టాలీవుడ్లో ప్రస్తుతం ఆసక్తిని పెంచుతున్న సినిమాల్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ, నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న వృషకర్మ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ రెండు సినిమాల విడుదల తేదీల చుట్టూ ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మొదట ప్రభాస్ ‘ఫౌజీ’ని డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా.. నాగచైతన్య వృషకర్మను డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటివరకు ఫౌజీ సినిమా విడుదల వాయిదా వేసినట్లు మేకర్స్ ఎక్కడా ప్రకటించలేదు. కానీ నాగచైతన్య, ప్రభాస్ సినిమాతో పోటీ పడే సాహసం చేయడని, ఆ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉండడంతోనే వృషకర్మ’ను డిసెంబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారనే ఊహాగానాలు తెలుగు సినిమా పరిశ్రమలో వైరల్ అవుతున్నాయి.
ఫౌజీ వాయిదాపై ఆసక్తికరమైన చర్చ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫౌజీ. ఈ సినిమాను మొదట డిసెంబర్ 3, 2026న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ ఏడాది చివర్లో ప్రభాస్ అభిమానులకు మరో భారీ సినిమా అందుబాటులోకి రానుందని అందరూ భావించారు. అయితే, సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు స్వతహాగా ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ చాలా కాలం నుండి ఈ సినిమా షూటింగ్ స్లోగా జరుగుతున్నట్లు ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తోడు తాజాగా వృషకర్మ చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో ‘ఫౌజీ’ డిసెంబర్ 3న విడుదల కావడం కష్టం అనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఫౌజీ
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ లుక్, కథా నేపథ్యం, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే, ఇలాంటి భారీ చిత్రాలకు షూటింగ్తో పాటు ఇతర నిర్మాణ పనులు కూడా కీలకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తికాకపోతే విడుదల తేదీని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ “ఫౌజీ” విడుదలను వాయిదా వేస్తే ఏ తేదీన విడుదల చేస్తారనే ఆసక్తి కూడా ప్రభాస్ అభిమానుల్లో నెలకొంది.
డిసెంబర్ 4న వృషకర్మ విడుదల
మరోవైపు నాగచైతన్య హీరోగా నటిస్తున్న వృషకర్మ డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ‘విరూపాక్ష’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ దర్శకుడి తదుపరి చిత్రంపై కూడా అంచనాలు పెరిగాయి. వృషకర్మలో మిస్టరీ, ఫాంటసీ, అడ్వెంచర్ అంశాలకు ప్రాధాన్యం ఉన్నట్లు ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి. నాగచైతన్య తన గత చిత్రాలకు భిన్నమైన కథను ఎంచుకోవడంతో ఈ సినిమా ఆయన కెరీర్లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే ఆసక్తి కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయి. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడంతో డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫౌజీ… వృషకర్మ అనుకున్న తేదీలలో విడుదలైతే
ఇక ఫౌజీ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్లు మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించలేదు. మరోవైపు వృషకర్మ చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఒకవేళ ఈ రెండు సినిమాలు మేకర్స్ చెప్పినట్టు విడుదల అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కూడా ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ వల్ల భారీ స్థాయిలో థియేటర్స్ ఓపెనింగ్ ప్రభాస్ కి వెళ్లే అవకాశం ఉందని, విడుదలైన తరవాత రోజు వృషకర్మ రిలీజ్ అయితే నాగచైతన్యకు ఓపెనింగ్స్ విషయంలో కాస్త ఎదురు దెబ్బ తగిలే అవకాశం చాలా వరకు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ రెండు సినిమాలు ఏ తేదీన విడుదల అవుతాయి. అనే ఆసక్తి ప్రస్తుతం సినీ లవర్స్ లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది.



