టాలీవుడ్ లో తండ్రి వారసత్వంగా సినిమాలోకి వచ్చి సక్సెస్ అయిన మొదటి స్టార్ నాగార్జున. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. 1967లో వచ్చిన సుడిగుండాలు సినిమాలో బాలనటుడిగా కనిపించి మొదటిసారి ప్రేక్షకులను అలరించారు. 1986లో విడుదలైన విక్రమ్ సినిమాతో నాగార్జున హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆఖరిపోరాటం, మజ్ను, జానకి రాముడు సహా అనేక యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో నటించి అప్పట్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. 1989లో మణిరత్నం దర్శకత్వంలో చేసిన గీతాంజలి సినిమా ఒక క్లాసిక్ ప్రేమ కథగా నిలిచింది. అదే ఏడాది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శివ అనే సినిమాలో నటించి తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ నే మార్చేశారు. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. గీతాంజలి, శివ సినిమాల విజయాల తర్వాత నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయారు.

ఆ సినిమాలతో మన్మథుడిగా గుర్తింపు

ఆ తర్వాత కాలంలో హలో బ్రదర్, నిన్నే పెళ్ళాడుతా, సంతోషం, మన్మధుడు లాంటి సినిమాలతో యూత్ ను ఆకట్టుకుని టాలీవుడ్ మన్మధుడిగా పేరు సంపాదించుకున్నారు. అయితే ఓవైపు క్లాస్ ఓవైపు మాస్ సినిమాలు చేసిన నాగార్జున ఎవరు ఊహించని విధంగా అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి లాంటి భక్తి రస సినిమాల్లో కూడా నటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలకు ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు. సాధారణంగా హీరోలు ఏదైనా ఒక జోనర్ లోనే ప్రేక్షకులను అలరిస్తారు. కానీ నాగార్జున మాత్రం అన్ని రకాల సినిమాలతోనూ ప్రేక్షకులను మెప్పించి ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ టీవీ షో కి హోస్ట్ గాను చేస్తున్నారు. అదేవిధంగా కేవలం హీరో రోల్స్ కే పరిమితం అవ్వకుండా విలన్ గాను నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవల వచ్చిన కుబేర, కూలీ సినిమాలలో నాగార్జున విలన్ గా నటించారు. అయితే హీరోగా మాత్రం గత కొంతకాలంగా నాగార్జునకు సరైన హిట్ లేదనే చెప్పాలి. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా తర్వాత సింగిల్ గా నాగార్జున మళ్ళీ అంతటి విజయాన్ని అందుకోలేకపోయారు. అయితే ఇప్పుడు నాగ్ చేయబోయేది ఆయన 100వ సినిమా.

పొలిటికల్ డ్రామాగా కింగ్ 100

ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా రాబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా డిసెంబర్ 24న ఈ సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ మ్యూజిక్ అందిస్తుండగా, సినిమాలో టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కింగ్ 100 గ్లింప్స్ లో మాత్రం నాగార్జున స్టైలిష్ లుక్ లో కనిపించారు. దీంతో ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందని అంతా అనుకున్నారు. ఇప్పుడు పొలిటికల్ డ్రామా అంటూ వార్తలు రావడంతో ఈ సినిమాలో కింగ్ రోల్ ఏంటి? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు నాగ చైతన్య వృషకర్మ విడుదలైన 20 రోజులకే ఈ సినిమా కూడా థియేటర్ లోకి రాబోతుండడంతో అక్కినేని తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేసారి థియేటర్లలో సందడి చేయనున్నారు. మరి నాగా తన 100వ సినిమాలో ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి.