ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకున్న సంగతి తెలిసిందే. పరివర్తన రాజనీతి పార్టీ “పిఆర్పి” పేరుతో వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పార్టీని ప్రకటించారు. అన్ని కులాలకు రాజ్యాధికారంలో అవకాశం ఇవ్వడం, యువతకు ప్రాధాన్యత ఇవ్వడం కోసమే తాను పార్టీని స్థాపించినట్టు విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో రెండు కుటుంబాల చేతుల్లోనే అధికారం ఉండకూడదనే నిర్ణయంతో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు ఉండేలా చేసేందుకే తన పార్టీని స్థాపించినట్టు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఉండగా ప్రతిపక్షంలో వైసిపి ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు పట్టు కోసం ప్రయత్నాలు జరుపుతున్నాయి. ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డి సొంత పార్టీని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా వైసిపిలో ఎంపీగా పనిచేసినప్పటికీ విజయసాయి రెడ్డి గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ లకు ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. రాజకీయాల్లో ఆయనకు ఎంతోమంది మిత్రులు ఉన్నప్పటికీ సుదీర్ఘ రాజకీయ అనుభవం మాత్రం లేదనే చెప్పాలి.
పార్టీ నిర్మాణం కోసం విజయ సాయి ప్రయత్నాలు
దీంతో విజయ సాయి పార్టీని ఎలా నిర్మిస్తారు? గ్రౌండ్ స్థాయి నుండి పార్టీని ఎలా బలోపేతం చేస్తారు? ప్రజల్లోకి ఎలా వెళతారు? అన్న చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకుగాను విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ప్రస్తుతం పొలిటికల్ సలహాదారు కోసం వెతుకుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు వైసిపి నాయకులు కూడా చెబుతున్నారు. “విజయ సాయి రెడ్డికి… అకౌంట్లు తెలుసు, కానీ పొలిటికల్ గా ఆయనకు సలహాలు అవసరమే, దీనిలో తప్పులేదు.” అని వైసిపి సీనియర్ నేత ఒకరు మీడియా ముఖంగా చెప్పారు. ఇక పార్టీ ప్రకటన చేసిన తర్వాత విజయ సాయి రెడ్డి పెద్దగా మీడియా ముందు కనిపించలేదు. అయితే దానికి కారణం ఆయన సలహాదారు కోసం వెతుకులాటలో పడటమే అని తెలుస్తోంది. ఆ పనిలో బిజీగా ఉండడం వల్లే మీడియా ముందుకు రాలేదని ఎక్కడా కనిపించలేదని ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీలో రాజకీయ వ్యూహకర్తలతో చర్చలు
అంతేకాకుండా ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉన్నారంటూ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఆయన జాతీయ స్థాయిలో పలువురు రాజకీయ సలహాదారులను కలిసి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా జాతీయ మీడియా ప్రతినిధులను సైతం కలుస్తున్నట్టు సమాచారం. దానివల్ల తన పార్టీ విధానాలు అజెండా లాంటి వాటిని ఖరారు చేసుకోవడంతో పాటు ఏ విధంగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి? గ్రౌండ్ లెవెల్ లో పార్టీ బలోపేతం అవ్వాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అనే విషయాలపై చర్చలు జరుపుతున్నారట. అదే విధంగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకోవాలని అనుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ఎంపీగా గెలవడంతో పాటు ఆయన పార్టీ నుండి ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా గెలుచుకున్నారు. దీంతో బీహార్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా పీకే పని చేస్తున్నారు. కాబట్టి ఆయన విజయసాయిరెడ్డి కోసం పనిచేసే అవకాశాలు కనిపించట్లేదు. దీంతో విజయసాయిరెడ్డి పీకే వద్ద పనిచేసిన కొందరు రాజకీయ సలహాదారులు వ్యూహకర్తలతో టచ్ లో ఉన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు విజయసాయిరెడ్డి ఎవరిని కలిసారు? ఎవరితో భేటీ అయ్యారనేది మాత్రం బయటకు రాలేదు.
గతంలో కేసీఆర్ కు సలహాలు ఇచ్చినవారితో చర్చలు
గతంలో కేసీఆర్ కు సలహాలు ఇచ్చిన కొంతమంది జాతీయ మీడియా ప్రతినిధులను కూడా విజయసాయి కలుస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా బిజెపి అధికారంలోకి వచ్చేందుకు కారణమైన ఆర్ఎస్ఎస్ పెద్దలతోనూ విజయ సాయి చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం విజయసాయి పార్టీ గురించి సీరియస్ గానే పనిచేస్తున్నట్టు అర్థమవుతుంది. అందుకోసమే జాతీయ స్థాయి మీడియా ప్రతినిధులు, ఎన్నికల వ్యూహాకర్తలతో చర్చలు జరుపుతున్నట్టు అర్థమవుతుంది. చూడాలి మరి ముందు ముందు విజయ సాయి ఎవరితో కలిసి పనిచేస్తారు? పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది.



