ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ టైం నడుస్తోంది. ప్రతి విషయంలోనూ జగన్ కు ఏదో ఒక రకంగా షాక్ తగులుతోంది. ఇటీవల వచ్చిన స్థానిక ఎన్నికల ఫలితాల్లో వైసిపికి కోలుకోలేని దెబ్బ పడింది. చాలా ప్రాంతాల్లో ఆ పార్టీ ఓటమిపాలైంది. ముఖ్యంగా జగన్ కు కంచుకోటలా ఉన్న కడప జిల్లాలోనూ వైసీపీకి ఎదురుగాలి వీచింది. పలు మున్సిపాలిటీలలో, జడ్పిటిసి, ఎంపిటిసి స్థానాల్లో భారీ మెజారిటీతో కూటమినేతలు విజయం సాధించారు.

యలహంక ప్యాలెస్ విషయంలోనూ విమర్శలు

మరోవైపు బెంగళూరు యలహంక ఫామ్ హౌస్ విషయంలో జరిగిన వివాదంలోనూ జగన్ పైనే విమర్శలు వచ్చాయి. షర్మిల కుమార్తె వివాహం ఆ ఫామ్ హౌస్ లో జరిపించడానికి జగన్ అడ్డు చెప్పడంతో ఆయన పై ప్రతిపక్షాలు దాడి చేశాయి. ఇక ఇప్పుడు వైసిపి నుండి కొందరు ముఖ్య నేతలు పార్టీని వీడటం కూడా ఆయనకు తలనొప్పిగా మారుతోంది. తాజాగా వైసిపి సీనియర్ నేత అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వంపై ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో ఎవరికీ సరైన సభ్యత్వాలు లేవని, సంతకాలు లేని లెటర్ ప్యాడ్లపై పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. వైసిపి లో పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పని చేసే కార్యకర్తలకు శ్రేణులకు ప్రాధాన్యత ఇవ్వకుండా కొందరికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారని విమర్శలు కురిపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసుకున్నారని వ్యాఖ్యానించారు. జగన్ వల్ల రాజకీయంగా ఇతరత్రా లబ్ధి పొందిన వాళ్లు కూడా ఇప్పుడు వైసీపీలో లేరు అంటూ వ్యాఖ్యానించారు.

విజయ సాయి రెడ్డి పార్టీలో చేరిక

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతుండడంతో తాను ఆ పార్టీలో చేరనున్నట్టు నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఐక్యంగా ఉన్నంతకాలం జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ మేయర్ గా వంగవీటి రాధాకృష్ణ గెలవడం వెనుక వైసీపీ నేతల పాత్ర కూడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోనూ వైసీపీకి చెందిన కొందరు నాయకులు కూటమిలో ఉన్న తమ మిత్రుల గెలుపు కోసం పనిచేశారని ఆరోపణలు చేశారు.

మరోసారి కోటరీ ఆరోపణలు

జగన్మోహన్ రెడ్డిని కలవాలి అంటే ముందుగా ఆయన కోటరీని కలవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. పార్టీ అధినేతకు క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు మధ్య కోటరి అడ్డుగోడగా మారిందని చెప్పారు. భజన బృందం కోటరీ అంతా కలిసి జగన్మోహన్ రెడ్డికి పార్టీ కార్యకర్తలకు మధ్య దూరం పెంచాయని చెప్పారు. టిడిపి, జనసేన నాయకులు క్షేత్రస్థాయిలో పరస్పరం కొట్టుకుంటున్నారని అన్నారు. వైసిపి, టిడిపి రాజకీయాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ కు అత్యంత సన్నిహితుడుగా వ్యవహరించిన సజ్జలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. సకల శాఖల మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ కు ఎదురవుతున్న సకల శోకాలకు కారణం అయ్యారని ఎద్దేవా చేశారు. వైసీపీలో నాయకత్వలోపం కార్యకర్తలకు గుర్తింపు లేకపోవడం కోడి రాజకీయాల కారణంగానే ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని విజయభాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీ ప్రత్యామ్నాయం కానందుని వ్యాఖ్యానించారు.

పార్టీని వీడే ఆలోచనలో మరికొందరు

అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విజయభాస్కర్ రెడ్డి చేసిన కామెంట్స్ చూస్తే మరికొందరు నేతలు సైతం వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు విజయసాయిరెడ్డి పార్టీ ప్రకటన సమయంలో వైసీపీలోని నేతలను తన పార్టీలోకి ఆహ్వానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో వైసీపీలో విజయసాయిరెడ్డి కీలక నేతగా ఉన్నారు. దీంతో ఆయనకు ఆ పార్టీ నేతల్లో చాలామందితో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నుండి విజయ భాస్కర్ రెడ్డి పిఆర్పీలో చేరతానని స్పష్టం చేశారు. దీంతో మరికొందరు వైసీపీ నేతలు సైతం పార్టీని విడుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది ముఖ్య నేతలు ఆ పార్టీని వీడారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రకటనతో మరికొందరు నేతలు సైతం జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే జగన్ కు మరో భారీ షాక్ తప్పదనే చెప్పాలి.