తెలంగాణ సీఎం రేవంత్, రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు మధ్య ప్రత్యేక అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో రేవంత్ రెడ్డి టిడిపిలోనే పనిచేశారు. జడ్పిటిసిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి టిడిపిలో అంచెలంచలుగా ఎదిగి ఎమ్మెల్సీ స్థాయి వరకు వెళ్లారు. ఆ పార్టీ నుండే ఆయన శాసనమండలిలో అడుగుపెట్టి తన గళాన్ని వినిపించారు. ఆ తర్వాత అనేక రాజకీయ పరిణామాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ చంద్రబాబు రేవంత్ రెడ్డిలది గురుశిష్యుల అనుబంధం అని చెబుతుంటారు. దానికి కారణం రేవంత్ రెడ్డి లోని టాలెంట్ చూసిన చంద్రబాబు ఆయనకు రాజకీయంగా మంచి అవకాశాలు ఇవ్వడమే.

గురు శిష్యుల మధ్య పోటీ

అలాంటి గురు శిష్యులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కావడంతో సంక్షేమంలో.. పాలనలో పోటీ నెలకొంది. గతంలో తెలంగాణకు కేసిఆర్, ఏపీకి వైయస్ జగన్ సీఎంలు గా ఉన్నారు. ఆ సమయంలోను రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధిని పోల్చేవాళ్ళు. ఇక ఇప్పుడు గురుశిష్యుల పాలన మధ్య కూడా పోలికలు పెడుతున్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు కూడా పెట్టుబడుల ఆకర్షణలో పోటీ పడుతున్నారు.

ఏపీలో సీఐఐ సమ్మిట్ కు భారీగా పెట్టుబడులు

ఈ క్రమంలోనే ఏపీలో సిఐఐ సమ్మిట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. విశాఖ వేదికగా నిర్వహించిన ఈ సమ్మిట్ కు దేశ విదేశాల వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ సమ్మిట్ ద్వారా ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుండి 9 వరకు ఈ సమ్మిట్ జరగనుంది. ఆరు ఎగ్జిబిషన్ హాల్స్ తో పెద్ద ఎత్తున ఈ సమ్మిట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిఫెన్స్, ఫార్మా, ఐటీ, ఎడ్యుకేషన్, స్టార్ట్ అప్ లాంటి రంగాలపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది.

అయితే ఏపీలో ఇప్పటికే సమ్మిట్ నిర్వహించగా కేంద్ర మంత్రులు ప్రముఖ వ్యాపారవేత్తల ద్వారా పెట్టుబడులను ఆకర్షించారు. దీంతో తెలంగాణలో సైతం ఏపీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయా… కేంద్ర మంత్రులను వ్యాపారవేత్తలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకురావడంలో విజయం సాధిస్తుందా? అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. సీఎం చంద్రబాబు ఐటీ మీద, పారిశ్రామిక రంగం మీద ఎంతో అనుభవం ఉన్న నాయకుడు. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధిలో తన పాత్ర ఉందని చంద్రబాబు పదేపదే చెబుతూ ఉంటారు. ఆయన వలన ఇప్పుడు దేశ విదేశాల్లో తెలుగు యువత స్థిరపడ్డారని అంటూ ఉంటారు.

ఏపీకి కేంద్రం సహకారం

ముఖ్యమంత్రిగా ఆయనకు ఇప్పటికే చాలా ఏళ్ల అనుభవం ఉంది. మరోవైపు ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ కూటమిలో కేంద్రంలోని బిజెపి సైతం భాగమైంది. కేంద్రంతో మంచి సంబంధాలు ఉండటం వల్ల కేంద్ర మంత్రుల సహకారం ఉండటం వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం కచ్చితంగా ఉంటుంది. అయితే తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో కేంద్రం ఏపీకి సహకరించిన స్థాయిలో సహకరిస్తుందా? లేదా? అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. మరోవైపు రేవంత్ రెడ్డి సీఎంగా ఎన్నికవ్వడం ఇదే మొదటిసారి. మరోవైపు పెట్టుబడి దారులు కూడా ఇప్పటికే ఏపీ సమ్మిట్ కు హాజరయ్యారు. కాబట్టి ఒప్పందాలు కుదుర్చుకొని ఉండొచ్చు. రెండు రాష్ట్రాల్లో పెట్టుబడులను పెట్టకపోవచ్చు. కాబట్టి తెలంగాణలో ఆ స్థాయిలో పెట్టుబడులు వస్తాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రోత్సాహకాలు.. తమ వ్యాపారాలకు ఇండస్ట్రీలకు అనుకూల వాతావరణం అందిస్తే తెలంగాణ వైపు సైతం పెట్టుబడిదారులు మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎంతో ఆసక్తి చూపుతారు. అదే గనక జరిగితే తెలంగాణకు సైతం భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి శిష్యుడు గురువును మించిపోతారా? లేదా? అనేది త్వరలోనే తేలనుంది.