బీఆర్ఎస్ పార్టీ అంటే గుర్తుకు వచ్చేది కేసీఆర్ తర్వాత హరీష్ రావు కేటీఆర్ పేర్లు. కెసిఆర్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్నది హరీష్ రావుకే అని చెప్పాలి. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కెసిఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ఎన్నికల సమయంలో ఏదైనా ముఖ్యమైన సభ ఉంటే తప్ప కేసీఆర్ బయటకు రావడం లేదు. అప్పటినుండి హరీష్ రావు కేటీఆర్ లే పార్టీని నడిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే కొన్నిసార్లు హరీష్ రావు పార్టీ సభలకు సమావేశాలకు దూరం అవడంతో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అలాంటి వార్తలే మళ్లీ మొదలయ్యాయి. గతంలో హరీష్ రావు బీఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరుతారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని హరీష్ రావు ఖండిస్తూ తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని, తనకు కేసిఆర్ ఏ బాస్ అని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ అలాంటి చర్చనే మొదలైంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

నిర్మల్ సభలో కనిపించని హరీష్ రావు ప్లెక్సీలు

కేటీఆర్ నిర్మల్ లో ఏర్పాటుచేసిన రైతు గర్జన సభలో ఫ్లెక్సీలలో కేటీఆర్ ఫోటోలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్లెక్సీలలో హరీష్ రావు ఫోటో లేకపోవడమే చర్చకు దారి తీసింది. హరీష్ రావును ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం చేశారా? అనే చర్చ మొదలైంది. ఇక నిర్మల్ లో ఏర్పాటు చేసిన రైతు గర్జన సభ విషయానికి వస్తే ఈ సభ తో నిర్మల్ మొత్తం గులాబీ జెండాలతో మెరిసిపోయింది. అయితే ప్లెక్సీలలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఫోటోలు కూడా ఉండాలి.. కానీ ఫ్లెక్సీలలో కేవలం కేటీఆర్ ఫోటోలు మాత్రమే ఏర్పాటు చేయడం హరీష్ రావు అభిమానులను నిరాశపరిచిన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు పార్టీలోని కొందరు మాత్రం ఈ సభకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కాబట్టి ఆయన ఫోటోలు వేసి హరీష్ రావు ఫోటోలు మరిచారని వాదిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో హరీష్ రావు ఫోటోలు వేయకపోవడం ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదా యాదృచ్ఛికంగా జరిగిపోయిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ట్రబుల్ షూటర్ గా గుర్తింపు

మరోవైపు రాష్ట్రంలో ఒకప్పుడు ఏ ఎన్నిక వచ్చినా హరీష్ రావు అక్కడ దిగేవారు. ఓడిపోయే స్థానాల్లోనూ హరీష్ రావు దిగారు అంటే విజయం సాధిస్తారనే నమ్మకం కార్యకర్తలకు ఉండేది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ట్రబుల్ షూటర్ అనే పేరు కూడా వచ్చింది. అయితే అలాంటి వ్యక్తిని రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలోనూ పక్కన పెట్టారు అంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. పార్టీలో కేసీఆర్, కేటీఆర్ తర్వాత కీలక నేతగా ఉన్న హరీష్ రావు ఫోటోలు ప్లెక్సీలలో వేయకపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం పెట్టడం వెనక ఏదైనా వ్యూహం ఉందా? లేదా పొరపాటు జరిగిందా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

కష్టాల్లో కలిసి కట్టుగా నడిస్తేనే విజయం

నిజానికి ప్రస్తుతం పార్టీ గట్టు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో పాటు ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సున్నా సీట్లు వచ్చాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, మధ్యలో వచ్చిన ఉప ఎన్నికల్లోనూ పార్టీకి ఎదురు దెబ్బలు తగిలాయి. పార్టీలోని చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో పార్టీకి క్యాడర్ కూడా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో సమిష్టిగా ఉండకుండా తప్పుడు నిర్ణయాలతో పార్టీకి నష్టం తప్పదనే విశ్లేషకులు భావిస్తున్నారు. కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా సమానంగా కనిపిస్తేనే పార్టీ మళ్ళీ గట్టెక్కే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. హరీష్ రావుకు ఉన్న మాస్ ఫాలోయింగ్ వల్ల ఆయనను జిల్లాకే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, సభలు నిర్వహిస్తే కలిసి వస్తుందని సూచిస్తున్నారు. మరి ఇప్పటికైనా ట్రబుల్ షూటర్ బయటకు వస్తారా? లేదా? చూడాలి.