బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై గతంలో చేసిన ఆరోపణల విషయంలో మాజీ మంత్రి కొండ సురేఖ వెనక్కి తగ్గారు. కేటీఆర్ పై చేసిన ఆరోపణల మీద ఎక్స్ వేదికగా స్పందించిన కొండ సురేఖ తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్న ట్టుగా ప్రకటించారు. అప్పటి రాజకీయ పరిస్థితులు ప్రతిపక్షాలను విమర్శించే క్రమంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. అంతేకానీ కేటీఆర్ ను ఆయన కుటుంబ సభ్యులను గానీ బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని, వారి ప్రతిష్టకు భంగం కలిగించే దురుద్దేశం తనకు లేదని చెప్పారు. కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన ఆరోపణల విషయంలో విచారం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్ లో ఉండి కేటీఆర్ కు క్షమాపణలు
కొండా సురేఖ అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే కొండా సురేఖ కేటీఆర్ పై ఆరోపణలు చేసి ఇప్పటికే సంవత్సరం అవుతుంది. గతంలో కేటీఆర్ కోర్టులో కేసు వేసినా, కొండ సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేసినా ఆమె తగ్గలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆమె తగ్గుతూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అసలు కొండా సురేఖ ఎందుకు అలా తగ్గారు? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి.
ఇటీవల కొండా సుస్మిత వ్యాఖ్యలతో కీలక పరిణామాలు
ఇటీవల కొండా సురేఖకు సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. తను పోటీ చేయాలనుకుంటున్న అసెంబ్లీ నియోజకవర్గం స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి మరో వ్యక్తిని ప్రతిపాదించడంపై సుస్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు టికెట్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు? అంటూ సుస్మిత నేరుగా విమర్శలు కురిపించారు. అక్కడితో ఆగకుండా రేవంత్ అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో సుస్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖ వివరణ ఇవ్వాలి అంటూ కాంగ్రెస్ నేతలు, రేవంత్ అభిమానులు డిమాండ్ చేశారు. సుస్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా సురేఖను పార్టీ అధిష్టానం సైతం ఆదేశించింది. అయినప్పటికీ కొండా సురేఖ వెనక్కి తగ్గలేదు. తన కూతురి వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కోరినప్పటికీ ఆమె తగ్గలేదు. ఈ క్రమంలో అనేక రాజకీయ పరిణామాల మధ్య కొండా సురేఖ మంత్రి పదవి పోయింది. అయినప్పటికీ ఆమె అదే పార్టీలో కొనసాగుతున్నారు. తను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కూడా ఇప్పటికే ఆమె స్పష్టం చేశారు.
రేవంత్ విషయంలో తగ్గని కొండా సురేఖ కేటీఆర్ విషయంలో ఎందుకు?
అయితే రేవంత్ విషయంలో తగ్గని కొండ సురేఖ కేటీఆర్ విషయంలో తగ్గడంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. కొండా సురేఖ పార్టీ మారితే ఒకవేళ బీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశం ఉందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికోసమే ఆమె కేటీఆర్ పై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకున్నారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు ఇది కొండా సురేఖ ప్లాన్ అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ పై తన ఆరోపణలను వెనక్కి తీసుకుంటే ఆమె పార్టీ మారుతారు అనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఆమెను వెళ్ళనివ్వకుండా ఏదైనా పదవి ఆఫర్ చేసే అవకాశం ఉంది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి కొండా సురేఖ ఎపిసోడ్ నెక్స్ట్ ఎలాంటి మలుపులు తిరుగుతుంది. కేటీఆర్ విషయంలో ఆమె వెనక్కి తగ్గడంపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది… అనేది చూడాలి.



