మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్ది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత ఆమె పోషించిన అచ్చియమ్మ పాత్ర చిత్రణపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కథలో ఆమె పాత్రను చూపించిన విధానం, కొన్ని సన్నివేశాల చిత్రీకరణ ప్రేక్షకుల్లో చర్చకు దారితీశాయి. తాజాగా ఈ వివాదంపై జాన్వీ కపూర్ స్పందించడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి ముగింపు పలుకుతున్నాయా? లేక కొత్త చర్చకు దారితీస్తున్నాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

తప్పు జరిగిందని అంగీకరించిన జాన్వీ..

పెద్ది సినిమాలో తన పాత్ర చిత్రణపై వస్తున్న విమర్శల గురించి జాన్వీ కపూర్ తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సినిమా కోసం ఎంతోమంది కష్టపడ్డారని, అందుకే ఈ వివాదంపై ఎలా స్పందించాలో మొదట తనకు అర్థం కాలేదని ఆమె పేర్కొన్నారు. అయితే తన పాత్ర ద్వారా సమాజంపై, ముఖ్యంగా మహిళల పట్ల ప్రజల ఆలోచనలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందనే విషయం తనను బాధిస్తోందని వెల్లడించారు.

ఈ విషయంలో తాను మరింత అప్రమత్తంగా ఉండాల్సిందని, అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో ఇంకా చురుగ్గా వ్యవహరించాల్సిందని జాన్వీ అంగీకరించారు. సినిమాలో తన పాత్ర చిత్రణలో సమస్యలు ఉన్నాయని, అది మహిళను వస్తువుగా చూపించే స్థాయికి వెళ్లిందని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, కథనం ద్వారా లైంగిక వేధింపులను సమర్థిస్తున్నట్లుగా భావించే పరిస్థితి కూడా ఏర్పడిందని అంగీకరించారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవడమే తన ముందున్న బాధ్యత అని తెలిపారు.

దర్శకుడి మాట విన్నానంటూ వివరణ..

తన వ్యాఖ్యల్లో జాన్వీ మరో ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. సాధారణంగా దక్షిణాది సినిమాల్లో ప్రతి సందర్భంలోనూ పూర్తి వివరాలతో కూడిన స్క్రిప్ట్ అందుబాటులో ఉండకపోవచ్చని, అలాగే సన్నివేశాలను ఏ కెమెరా కోణాల్లో చిత్రీకరిస్తారో ముందుగానే తెలుసుకునే అవకాశం కూడా పరిమితంగా ఉంటుందని వివరించారు. దర్శకుడు చెప్పిన విధంగా వృత్తిపరంగా వ్యవహరించాల్సి ఉంటుందని, షూటింగ్ సమయంలో పరిస్థితులు అర్థమైన కొద్దీ సమస్యలను తగ్గించేందుకు ప్రయత్నించానని తెలిపారు. అయితే తనకు పరిశ్రమలో ఉన్న ప్రత్యేక అవకాశాలను ఉపయోగించుకుని మరింత గట్టిగా ప్రశ్నించాల్సిందని జాన్వీ అభిప్రాయపడ్డారు. ఈ అనుభవం ఒక విధంగా తనకు బాధాకరంగా అనిపించిందని, భవిష్యత్తులో కథానాయికలను తెరపై చూపించే విషయంలో దర్శకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా ఈ పరిణామం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ముందే కథ తెలుసా? ఇప్పుడు వివరణ ఎందుకు?

అయితే జాన్వీ వ్యాఖ్యలపై చర్చ జరుగుతుండటానికి మరో కారణం ఉంది. సినిమా నిర్మాణానికి ముందు దర్శకుడు బుచ్చిబాబు సనా తనకు కథను వివరించారని, తన పాత్ర ఎలా ఉండబోతుందో తెలిసే సినిమాలో నటించారని గతంలో వచ్చిన చర్చలను కొందరు గుర్తుచేస్తున్నారు. ఒకవేళ పాత్ర స్వరూపం ముందే తెలిసి ఉంటే, అభ్యంతరకరంగా అనిపించిన అంశాలను చిత్రీకరణ సమయంలోనే ఎందుకు ప్రశ్నించలేదన్నది వారి వాదన.

సినిమా కోసం కోట్ల పారితోషికం తీసుకుని పనిచేసినప్పుడు పాత్రకు సంబంధించిన బాధ్యతను కూడా స్వీకరించాల్సిందేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చిన తర్వాత మాత్రమే ఆ పాత్ర చిత్రీకరణపై విచారం వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పూర్తి స్క్రిప్ట్, చిత్రీకరణ కోణాలు, తుది ఎడిటింగ్ వంటి అంశాలు నటీనటుల చేతుల్లో పూర్తిగా ఉండవు. అందువల్ల ఈ వివాదానికి ఒకరినే బాధ్యులుగా చూడటం కూడా సరైన దృక్పథం కాదన్న అభిప్రాయం కూడా కొందరిలో వ్యక్తమవుతోంది.

గతంలో టాలీవుడ్ పై రాధిక ఆప్టే, తాప్సి కూడా ఇలాంటి వ్యాఖ్యలే

టాలీవుడ్ లో మహిళా పాత్రల చిత్రణ, కథానాయికలపై ఉండే ఒత్తిళ్లు, తెరపై మహిళలను చూపించే విధానం గురించి గతంలో రాధిక ఆప్టే, తాప్సి పన్ను సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాప్సీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌత్ సినిమాల్లో పాటల సమయంలో హీరోయిన్ల నాభిపై అసహజంగా ఫోకస్ పెడతారని చెప్పింది. అసలు అక్కడే ఎందుకు అంత మోజు ఉంటుందో తనకు అర్థంకాదని తాప్సీ పలుసార్లు విమర్శించింది. అయితే బాలీవుడ్ ఆఫర్స్ రాకముందు ఈ బ్యూటీ ఎక్కువ సినిమాలు టాలీవుడ్ లోనే చేయడం, కోట్ల రెమ్యునరేషన్ లు తీసుకోవడం జరిగింది. బాలీవుడ్ కంటే తాప్సీకి సౌత్ సినిమాల ద్వారానే లైఫ్ వచ్చింది. మరోవైపు రాధిక ఆప్టే సైతం అదే తీరుగా కామెంట్స్ చేసింది. సౌత్ ఫిల్మ్ మేకర్స్ ఎక్కువగా తెల్లగా ఉండే ఉత్తరాది నటీమణులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె ఆరోపణలు చేసింది. ఓ హీరో తనను ఇబ్బంది పెట్టాడని కూడా చెప్పింది. కానీ ఆఫర్స్ వచ్చినప్పుడు మాత్రం సైలెంట్ గా నటించి తరవాత బాలీవుడ్ లో ఆఫర్స్ రాగానే ప్లేట్ ఫిరాయించింది. ఇలా హీరోయిన్స్ చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే అసలు నార్త్ వాళ్లకు కాకుండా సౌత్ హీరోయిన్ లకే ఇక్కడ అవకాశాలు ఇస్తే బెటర్ ఏమో అని సినిమా లవర్ అంటున్నారు.