సర్ ప్రక్రియలో లోపాలు, ఓటు చోరీ ఆరోపణలతో ఎలక్షన్ కమిషన్ కు వ్యతిరేకంగా ఇండియా కూటమి నవంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అయితే దీపావళి పండుగ నేపథ్యంలో తమ వ్యాపారాలు దెబ్బతింటాయని నిరసన మార్చ్ వాయిదా వేసుకోవాలని స్థానిక వ్యాపార సంఘాలు అభ్యర్థిస్తున్నాయి. ఢిల్లీలో నిరసన చేపడితే ఆందోళనకర పరిస్థితులు ఉంటాయని, తమ వ్యాపారం దెబ్బతింటుందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిరసన వాయిదా వేసుకోవడం విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గడం లేదు. తాము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఓటు చోరీని అడ్డుకునేందుకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకే చలో ఢిల్లీ రాంలీలా మార్చ్ నిర్వహిస్తున్నామని చెబుతున్నారు.

ఇది ఏ రాజకీయ పార్టీ ర్యాలీ కాదు

ఇది ఏ రాజకీయ పార్టీకి చెందిన ర్యాలీ కాదని నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తో విసిగిపోయిన ప్రజలు అంతా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. లాఠీ చార్జీలకు భయపడవద్దు అని, తమతో కలిసి రావాలని రాజ్యాంగాన్ని భారత జాతిని కాపాడేందుకు అందరం నడుం బిగిద్దామని కోరారు. ఇది దేశ యాత్ర… ఇది మీ యాత్ర అంటూ రాహుల్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.

నిరసన వాయిదా వేసుకోవాలని కోరుతున్న వ్యాపారులు

అయితే ఈ నిరసనను వాయిదా వేసుకోవాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కోరుతోంది. నవంబర్ 1న పిలుపునిచ్చిన నిరసన కారణంగా రామ్ లీలా మైదానం పరిసరాల్లో దాదాపు పదివేల కోట్ల వ్యాపారం పై పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 10 తర్వాత నిరసనను నిర్వహించాలని వ్యాపార అనుబంధ సంఘాలు కోరుతున్నాయి. ఈ అభ్యర్థనపై స్పందించిన రాహుల్ గాంధీ.. మీ సమస్యలు మాకు అర్థమవుతున్నాయి. కానీ మెట్రోలను ప్రభుత్వమే నిలిపివేసింది. రోడ్లను మూసివేసింది. దేశ రాజధానిని లాక్ డౌన్ లో పెట్టింది. ఓట్లనే చోరీ చేస్తే ఇక మీ దుకాణాలు, సేవింగ్స్, పిల్లల భవిష్యత్తు ఏది సురక్షితంగా ఉండదు. సిఇసి జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని ప్రధాని మోడీతో చెప్పండి… అప్పుడు 30 సెకండ్ల లోనే ఈ నిరసనలు ఆగిపోతాయి అని సమాధానం ఇచ్చారు.

ఎక్కడ తగ్గాలో తెలిసినోడే లీడర్

కానీ ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు… అన్నట్టు రాహుల్ గాంధీ ఈ విషయంలో తగ్గాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సర్ ప్రక్రియ అనేది ప్రజా సమస్య అయినప్పటికీ.. ఒక ఎంపీగా ప్రజా నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా తన నిరసనను తెలిపినప్పుడే విజయం సాధించినట్టు అని చెబుతున్నారు. రామ్ లీలా మైదానంలో నిరసన చేపట్టడం వల్ల తమ వ్యాపారం నష్టపోతుంది అని వ్యాపారులు ఆవేదన చెందుతున్నప్పుడు అది రాహుల్ గాంధీకి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. నిరసనను ఇప్పుడే అర్జెంటుగా నిర్వహించాల్సిన అవసరం లేదని, ఒక పది రోజులు వాయిదా వేసుకుని ఆ తర్వాత నిరసన చేపట్టినా ఎలాంటి నష్టం జరగదని అంటున్నారు. లేదంటే దీపావళికి ముందే ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఉండాల్సిందని చెబుతున్నారు. అలా చేయకుండా ఇప్పుడు రాహుల్ గాంధీ పట్టుబట్టి మరీ నవంబర్ 1న నిరసన చేపట్టడం వల్ల వ్యాపారులకు నష్టం జరుగుతుందని దానివల్ల కాంగ్రెస్ కు డ్యామేజ్ తప్ప మైలేజీ రాదని సూచిస్తున్నారు.

ఇలాంటి నిర్ణయాలు పార్టీకి నష్టమే

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పదేళ్లు దాటింది. గత ఎన్నికల్లో ఫలితాలు కాస్త మెరుగ్గా వచ్చినా అధికారం మాత్రం దక్కలేదు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించింది. ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ పార్టీని తిరిగి నిలబెట్టాలి అంటే ఆచి తూచి వ్యవహరించాలి. మరి ఇప్పటికైనా రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? లేదంటే అదే రోజున నిరసన కార్యక్రమం చేపట్టి ఆ వ్యాపారులను దూరం చేసుకుంటారా అనేది చూడాలి.