కర్ణాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. అక్కడ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా నాలుగు స్థానాల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. అందులో మూడు స్థానాల్లో బీజేపీ, ఒక స్థానాన్ని జెడిఎస్ కైవసం చేసుకున్నాయి. ఈ నాలుగు స్థానాల్లో రెండు స్థానాలు టీచర్ ఎమ్మెల్సీలు అయితే మరో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నాయి.

గ్రాడ్యుయేట్ లు, టీచర్లు వీరంతా చదువుకున్నవాళ్లే… సమాజంపై అవగాహన ఉన్నవాళ్లే అలాంటి వాళ్ళ ఓటు కాంగ్రెస్ కు పడకపోవడంతో కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ కు పెద్ద షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్డీఏ మధ్య ప్రధానంగా పోటీ కనిపించింది. బెంగళూరు టీచర్స్ స్థానం నుండి జెడిఎస్ మరియు బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఏపీ రంగనాథ్ పోటీ చేశారు. ఆయన చేతిలో కాంగ్రెస్ బలపరిచిన సీనియర్ నేత పుట్టన్న ఓడిపోయారు. మరోవైపు ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థి సుశీల్ వరుసగా ఐదుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. పశ్చిమ ఆగ్నేయ గ్రాడ్యుయేట్ స్థానాల్లో సైతం ఎన్డీఏ కూటమే విజయాన్ని సొంతం చేసుకుంది.

కాంగ్రెస్ ఓటమికి కారణాలు ఏంటి?

కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమికి కారణాలు ఏంటి? అంటూ ఇప్పుడు నేతలు ఆలోచనలో పడ్డారు. అంతే కాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉండి ఒక్క స్థానం కూడా గెలుచుకోకపోవడం ఏంటని ఆ పార్టీకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే పలు విశ్లేషణల ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ స్థాయిలో దెబ్బతీయడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పాలనపై విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత పథకాల వల్ల పేదల లబ్ధి పొందుతున్నప్పటికీ ఈ పథకాల వల్ల నిధుల కొరత ఏర్పడడం, పన్నుల భారం, ధరలు పెరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉద్యోగుల పాత పెన్షన్ స్కీ, డీఏ పెంపులో ఆలస్యం జరగడం పైనా ఉద్యోగుల్లో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బెంగళూరు లాంటి సిటీలో మౌలిక వసతుల కొరత కూడా ఈ ఫలితాలకు కారణమని ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోవడం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించల ఫలితాలు రావడానికి కారణమైనట్టు కూడా సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో రాష్ట్ర కాంగ్రెస్లో ఒకసారిగా అలజడి జరిగినట్టు తెలుస్తోంది ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వీటి ప్రభావం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యావంతులు ఉద్యోగుల్లో అసంతృప్తి ఈ స్థాయిలో ఉంటే సాధారణ ప్రజల్లో పార్టీపై పార్టీ అమలు చేస్తున్న పథకాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో అనే చర్చ జరుగుతోంది తాజా ఎన్నికల ఫలితాలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎన్ డి ఏ మరింత పుంజుకుంటుందని కాంగ్రెస్కు నిరాశ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీలకు ఎన్నికలు

తెలంగాణలోనూ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం 2027 మార్చిలో ముగియనుంది. దీంతో మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టబద్రుల స్థానంతో పాటు వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ రెండు స్థానాలకు ఓటర్ల జాబితాను కొత్తగా తయారు చేస్తున్నారు. తుది ఓటర్ల జాబితాను 2026 డిసెంబర్ 3న విడుదల చేయనున్నారు. ఓటర్ల జాబితా వచ్చిన తర్వాత ఎన్నికల తేదీ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ లో ఎన్నికల కోసం ఓటు నమోదు చేసుకుంటుండగా నవంబర్ 6 వరకు అవకాశం కల్పించారు.

కర్ణాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ లో టెన్షన్

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ లో టెన్షన్ మొదలైంది. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో ఇటు బిజెపి అటు బిఆర్ఎస్ సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ గట్టిగానే ఉంటుందని తెలుస్తోంది. మరి అలాంటి పోటీని తట్టుకుని కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కర్ణాటకలో వచ్చిన రిజల్ట్ తో ఇక్కడ కాంగ్రెస్ మరింత అప్రమత్తం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఆచితూచి అడుగేస్తూ బలమైన నాయకులను బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి. అయితే కర్ణాటకలో .. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఒకే రకంగా ఉండటంతో అక్కడి రిజల్ట్ ఇక్కడ ఏమైనా రిపీట్ అవుతుందా అనే టెన్షన్ మొదలైంది.