సినిమా ఇండస్ట్రీలో ఎంతటి విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ తర్వాత అవకాశాలు వస్తాయనే గ్యారెంటీ ఉండదు. ఒక సినిమా నటీనటులకు భారీ గుర్తింపును తీసుకొచ్చినా, తదుపరి సినిమాల విషయంలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ అందాల భామ.. ‘మహానటి’ సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. అయితే, అంతటి ఘనవిజయం తర్వాత కూడా తనకు దాదాపు ఆరు నెలల పాటు సినిమా అవకాశాలు రాలేదని ఆమె వెల్లడించింది. తాజాగా తన కెరీర్లో ఎదురైన ఇబ్బందుల గురించి కీర్తి సురేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఓపెన్ అయ్యింది.
తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న కీర్తి
కీర్తి సురేష్‌కు తెలుగు సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రామ్ పోతినేని హీరోగా నటించిన ‘నేను శైలజ’ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో ఆకట్టుకున్న కీర్తి.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంది.
‘మహానటి’తో జాతీయ స్థాయిలో గుర్తింపు
కీర్తి సురేష్ కెరీర్లో ‘మహానటి’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రముఖ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి టైటిల్ పాత్రను పోషించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను, విమర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. సావిత్రి హావభావాలు, ఆమె జీవితంలోని భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించిన తీరు కీర్తికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ చిత్రానికి గాను ఆమె ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. దీంతో కీర్తి సురేష్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.
అయితే, ఇంతటి ఘనవిజయాన్ని అందుకున్న తర్వాత తన కెరీర్ సాఫీగా సాగిపోతుందని ఆమె భావించినప్పటికీ, వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయట.
ఆరు నెలల పాటు సినిమా అవకాశాలు రాలేదట!
‘మహానటి’ సినిమా తర్వాత తనకు దాదాపు ఆరు నెలల పాటు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదని కీర్తి సురేష్ తాజాగా వెల్లడించింది. జాతీయ అవార్డును అందించిన సినిమా తర్వాత కూడా కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఆ సమయంలో ఇంటికే పరిమితమయ్యానని ఆమె చెప్పుకొచ్చింది.
సాధారణంగా ఒక సినిమా భారీ విజయాన్ని అందుకుంటే, ఆ నటీనటులకు వరుసగా అవకాశాలు వస్తాయని చాలామంది భావిస్తారు. కానీ కీర్తి అనుభవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ప్రతిభకు ప్రశంసలు దక్కినంత మాత్రాన వెంటనే కొత్త అవకాశాలు లభిస్తాయని చెప్పలేమనే విషయాన్ని ఆమె అనుభవం తెలియజేస్తోంది.
అయితే, అవకాశాలు రాలేదని ‘మహానటి’ సినిమాలో నటించినందుకు తాను ఎప్పుడూ బాధపడలేదని కీర్తి స్పష్టం చేసింది. తనకు వచ్చిన ఆ విరామాన్ని సానుకూలంగా తీసుకున్నానని, కొత్త పాత్రల కోసం ఎదురుచూస్తూ తనను తాను మరింతగా సిద్ధం చేసుకున్నానని తెలిపింది.
తోటి నటుల ప్రవర్తనతోనూ ఇబ్బందులు!
తన కెరీర్ ప్రారంభంలో షూటింగ్ సెట్లలో కొందరు సహనటుల ప్రవర్తన వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని కూడా కీర్తి సురేష్ ఇటీవల ప్రస్తావించింది. వారి ప్రవర్తన కారణంగా ఒకానొక సమయంలో తన నటనలోనే ఏదైనా లోపం ఉందేమోనని అనుమానపడేదాన్నని చెప్పింది. అయితే, ఆ తర్వాత అసలు సమస్య తనలో లేదని, కొందరు తమ అభద్రతాభావాలను తనపై చూపించేవారని అర్థం చేసుకున్నట్లు వెల్లడించింది.
సినిమా రంగంలో కొత్తగా అడుగుపెట్టినప్పుడు ఇలాంటి అనుభవాలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగడం ముఖ్యమని కీర్తి ప్రయాణం తెలియజేస్తోంది.
‘అక్క’ వెబ్ సిరీస్‌తో మరో కొత్త ప్రయాణం
తాజాగా కీర్తి సురేష్ కీర్తి సురేష్ ‘అక్క’ వెబ్ సిరీస్ లో నటించింది. ఆమె నటించిన ‘అక్క’ వెబ్ సిరీస్ అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మరాజ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో రాధికా ఆప్టే కూడా కీలక పాత్రలో నటించింది. వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ ఈ సిరీస్‌ను నిర్మించింది.
1980ల నేపథ్యంలో సాగే ఈ కథ కల్పిత ప్రాంతమైన పెర్నూరులో రూపొందింది. అక్కడ మహిళల ఆధిపత్యంలో నడిచే ప్రపంచం, నేర సామ్రాజ్యం చుట్టూ కథనం సాగుతుంది. కీర్తి ఇందులో భవానీ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనుంది. సాధారణ గ్యాంగ్‌స్టర్ పాత్రలకు భిన్నంగా ప్రశాంతంగా ఉంటూనే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించే వ్యక్తిగా తన పాత్రను తీర్చిదిద్దినట్లు ఆమె వెల్లడించింది.
ఇక ‘అక్క’ వెబ్ సిరీస్ తో కీర్తి సురేష్ ఏ స్థాయి ప్రశంసలను అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.



