తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర వార్త వినిపిస్తోంది. తమిళనాడులో హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బరిలో దిగుతారని కూడా ప్రచారం జోరు అందుకుంది. ఇప్పటికే ధనుష్ పార్టీ కోసం పావులు కదుపుతున్నారని.. ఆయన అభిమాన సంఘం సోషల్ మీడియాతో పెద్ద ఎత్తున ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు రావడానికి వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ధనుష్ తన అభిమాన సంఘం పార్టీ జెండాను ఆవిష్కరించారు. దీంతో అదే ధనుష్ ఫ్యూచర్ పొలిటికల్ పార్టీ జెండా అంటూ కూడా ప్రచారం జరిగింది. మరోవైపు గతంలో ఎన్నడూ లేనివిధంగా ధనుష్ అభిమాన సంఘం సేవ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఏర్పాటు వార్తలకు బలం చేకూరింది. గతంలో విజయ్ దళపతి సైతం ఈ విధంగానే చేశారు. మొదట సోషల్ మీడియా, తన అభిమాన సంఘాన్ని బలపరుచుకుని ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.

విజయ్ బాటలోనే ధనుష్

మొదటి ఎన్నికల్లోనే సీఎం అయ్యారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే పాలసీని ఫాలో అవుతున్నారని ప్రచారం ఉంది. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త ఇప్పుడు వినిపిస్తోంది. ధనుష్ పొలిటికల్ ఎంట్రీ వెనుక బిజెపి ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇటీవల చెన్నై ఓఎంఆర్ రోడ్డులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ధనుష్ చారిటీ మూమెంట్ మహిళా ప్రతినిధుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆయన పంపిణీ చేసిన బహుమతులు ఈ వివాదానికి కారణం అయ్యాయి.

కమలం గుర్తుతో బహుమతులు

సమావేశానికి వచ్చిన వెయ్యికి పైగా మహిళా ప్రతినిధులకు ధనుష్ దీపావళి కానుకగా 1.3 కోట్ల విలువైన వెండి కామాక్షి దీపాలను అందజేశారు. అయితే ఆ దీపాలకు కింది భాగంలో తామర గుర్తు ఉంది. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ధనుష్ స్థాపిస్తున్న తమిళగా ఎలుచ్చి కళగం అనే కొత్త పార్టీకి బిజెపికి సంబంధాలు ఉన్నాయని ప్రచారం మొదలైంది. బిజెపిని ధనుష్ ను వెనక ఉండి నడిపిస్తోంది అనే విమర్శలు కూడా వచ్చాయి.

గతంలో విజయ్ తో బీజేపీ పొత్తు అంటూ వార్తలు

అయితే గతంలో విజయ్ పైనా ఇలాంటి విమర్శలు వచ్చాయి. విజయ్ ని నడిపిస్తోంది బిజెపినే అంటూ ప్రచారం జరిగింది. విజయ్ బిజెపితో సైలెంట్ గా పొత్తు పెట్టుకున్నారని ప్రచారం జరిగింది. కానీ విజయ్ మాత్రం బహిరంగంగా బిజెపిని విమర్శిస్తూనే ఉన్నారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు ధనుష్ పై అలాంటి వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.

స్పందించిన ధనుష్ అభిమాన సంఘం

ఈ నేపథ్యంలో బిజెపి సపోర్ట్ పై ధనుష్ చారిటీ మూమెంట్ ప్రతినిధుల సంఘం స్పందించింది. తామర గుర్తు అనేది కేవలం ఆభరణాల తయారీదారుడు వేసుకున్న ముద్ద మాత్రమే అని స్పష్టం చేసింది. ఏ పార్టీ ఎన్నికల గుర్తు కాదని తెలిపింది. దీంతో ధనుష్ ను నడిపించేది బిజెపి కాదు అనే ఒక క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే ధనుష్ ను తమ వైపు తిప్పుకునేందుకు అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా బిజెపి సైతం ధనుష్ ను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని టాక్ కూడా ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ప్లాన్ డి పేరుతో ఆ పార్టీ సెలబ్రిటీలను వాడుకుంటుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ధనుష్ పార్టీలోకి కీలక నేతలు

అంతేకాకుండా ధనుష్ పార్టీలోకి కీలక నేతలు చేరబోతున్నారు అనే ప్రచారం కూడా ఉంది. తమిళనాడులోని పిఎంకే పార్టీ అధినేత డాక్టర్ రామదాసు, ఆయన కుమారుడు అన్బుమని రామదాస్ మధ్య విభేదాలు చెలరేగాయి. ఇటీవల ఎన్నికల అనంతరం వీరిద్దరూ రాజీ పడినప్పటికీ రామదాసు కుమార్తె గాంధీమతి మాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది. ఆమె ధనుష్ స్థాపించబోయే కొత్త పార్టీలో చేరెందుకు ఆసక్తి చూపుతున్నట్టు కూడా తమిళ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలా ధనుష్ పై వస్తున్న వార్తలు చూస్తుంటే ఆయన పార్టీ స్థాపించడం మాత్రం పక్కా అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.