రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఏమైనా విద్వేషాలు ఉంటే నాయకులు వారిని కంట్రోల్ చేయాలి. ప్రజల మధ్య విబేధాలు లేకుండా.. రాకుండా చూడాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో నాయకుల తీరు వేరేలా ఉంది. ప్రజలు కలిసి మెలిసి ఉంటున్నా నాయకులు మాత్రం అలా ఉండటం లేదు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు జరిగేలా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. తలలు పండిన ఎంతో అనుభవం ఉన్న నాయకుల తీరు కూడా ఇలాగే ఉండటం ఆశ్చర్యకరంగా మారింది. స్టేజ్ పైకి ఎక్కి మైక్ పట్టారు అంటే కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారు. ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సైతం అలాగే మాట్లాడారు. ఏపీలో స్థానిక ఎన్నికల్లో పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
హనుమంతరావు చేసిన వ్యాఖ్యలతో దుమారం
తెలంగాణలో ఈరోజు కొట్టుకున్నా రేపు కలిసిపోతారని అన్నారు. ఇక్కడ అసలు అలయ్ బలయ్ కార్యక్రమమే అవసరం లేదని ఇప్పటికీ ప్రజల మధ్య స్నేహం ఎక్కువ అయ్యిందని చెప్పారు. ఇప్పుడు ఏపీకి ఈ కార్యక్రమం చాలా అవసరం అని వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. స్థానిక ఎన్నికల వేళ కత్తులతో పొడుచుకుంటున్నారు అని అన్నారు. అక్కడ ఒక్కసారి విభేదాలు వస్తే మళ్ళీ కలవరని… రాయలసీమలో అంతా పొడవటం తీయటమే ఉందని చెప్పారు. కాబట్టి అక్కడ అలయ్ బలయ్ ఏర్పాటు చేయాలని గవర్నర్ బండారు దత్తాత్రేయ కు సూచించారు. వి హనుమంతరావు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అవ్వడంతో ఏపీ ప్రజలు సోషల్ మీడియాలో ఆహారం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు సైతం తెలంగాణ నేతలు అలా మాట్లాడటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పట్లో పవన్ దిష్టి వ్యాఖ్యలు
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పట్లో చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. కోనసీమలో ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది ఏమో అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇస్తూ తెలంగాణ నేతలు మీడియా సమావేశాలు నిర్వహించారు. దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలు సైతం సోషల్ మీడియాలో ఒక రాష్ట్రాన్ని కించపరిచేలా మరొకరాష్ట్రంవాళ్లు పోస్టులు పెట్టారు. అప్పట్లో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కేవలం హనుమంతరావు, పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా రెండు రాష్ట్రాల్లోని కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసమో… ఇతర కారణాల వల్లనో చేసే కామెంట్స్ ఇరు రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. దానివల్ల కలిసి ఉండాల్సిన వాళ్లు సైతం సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు.
ఇప్పటికైనా మారుతారా?
ఏపీ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాజధాని విషయంలో నీటి పంపకాల విషయంలో ఇప్పటికీ కొన్ని విభేదాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన నేతలు మాట్లాడుతున్న తీరు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి మెలిసి ఉండాలంటే.. ఇరు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోవాలి అంటే ముందుగా నేతలు ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ రాష్ట్రంలో ఉండే సమస్యలు ఆ రాష్ట్రంలో ఉంటాయి. ఏ రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు వారికే గొప్పవి. అలాంటప్పుడు ఒకరినొకరు కించపరుచుకుంటూ పోస్టులు పెట్టడం… రాజకీయ నాయకులు ప్రాంతాల మధ్య వివాదాలు చెలరేగేలా మాట్లాడటం వల్ల ప్రజల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా నేతల తీరు మారుతుందా లేదా అనేది చూడాలి.



