సినిమా తారలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కామన్. ఒకప్పటి ఎంజీఆర్, ఎన్టీఆర్ కాలం నుండి సినిమాల నుండి రాజకీయాల్లోకి వస్తున్నారు. అలా వచ్చిన వారిలో కొందరు సక్సెస్ అయితే మరికొందరికి మాత్రం పొలిటికల్ కెరీర్ అంతగా కలిసి రావడం లేదు. అయితే రాజకీయాలు కలిసి వస్తాయా… లేదా? అని ఆలోచించకుండా స్టార్స్ మాత్రం నచ్చితే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు నుండి ఎన్టీ రామారావు సినిమాల నుండే రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన పార్టీ పెట్టిన కొంతకాలానికే అధికారంలోకి కూడా వచ్చారు. ఆ తర్వాత తన మార్క్ పాలనతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. తమిళనాడులోనూ ఎంజీఆర్, జయలలిత సహా మరికొందరు ఇండస్ట్రీ నుండి రాజకీయంలోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత సంక్షేమ పాలనను అందించి ప్రజలకు దగ్గరయ్యారు. ఇక ప్రస్తుతం ఉన్న పలువురు స్టార్ లు సైతం రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు.
విజయ్ అనూహ్య విజయం
ఇటీవలే తమిళనాడులో విజయ్ దళపతి మొదటి ఎన్నికల్లోనే తిరుగులేని విజయం సాధించి సీఎం కూర్చిపై కూర్చున్నారు. రాష్ట్రంలోనే దిగ్గజ పార్టీలైన అన్న డీఎంకే, డీఎంకేలను ఓడించి విజయ్ సీఎం అయ్యారు. అయితే ఆయన సీఎం అయ్యేందుకు చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేశారనే ప్రచారం కూడా ఉంది. మొదట తన అభిమాన సంఘం ద్వారా సేవలు అందించి తర్వాత పొలిటికల్ పార్టీని ప్రకటించినట్టు ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
తెలుగులో పవన్ కళ్యాణ్
ఇక ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సైతం సినిమాల్లో నుండి వచ్చి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో సైతం ప్రచారం చేస్తూ నేషనల్ లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు మొదటి సారి ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. ఆయన పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోయారు. కానీ రెండవసారి ఆయన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులు గెలిచారు. దీంతో జనసేన క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.
తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ధనుష్ పేరు
ఇక ఇప్పుడు తమిళనాడులో మరో హీరో పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన ఎవరో కాదు ధనుష్. ఈ తమిళ హీరో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన “తమిళగా ఏలుచ్చి కళగం” పేరుతో పార్టీ పేరును సైతం రిజిస్టర్ చేశారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ధనుష్ కు సంబంధించిన వర్గాలు మాత్రం ఈ వార్తలను ఖండించాయి. ఆయన ఏ పార్టీని రిజిస్టర్ చేయించలేదని స్పష్టం చేశాయి. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి తమిళనాడు రాజకీయాల్లో ధనుష్ పేరు హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ధనుష్ గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉండటమే. ధనుష్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక నేతలతో చర్చలు జరిపేందుకే ఢిల్లీ వెళ్ళారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్టీ ఏర్పాటుపై మంతనాలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా రాజకీయ వ్యూహకర్తలతోనూ ధనుష్ మంతనాలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై మరోసారి తమిళనాడు ఆసక్తికర చర్చ మొదలైంది.
గతంలో రజినీ పొలిటికల్ ఎంట్రీపై వార్తలు
గతంలో ధనుష్ మామ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ కాంత్ సైతం పార్టీ పేరును ప్రకటించే వరకు వెళ్ళారు. కానీ ఈ వయసులో అనారోగ్య కారణాల వల్ల పార్టీని నడిపించలేరని ఆయన ఆరోగ్యమే తమకు ముఖ్యం అని ఆయన కుమార్తె స్పష్టం చేశారు. ఆ తరవాత కూడా రజినీ పొలిటికల్ ఎంట్రీ పై వార్తలు వచ్చినా అవి గాలి వార్తలుగానే మిగిలిపోయాయి. ఇక ఇప్పుడు ఆయన అల్లుడు ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై కూడా కథనాలు మొదలయ్యాయి. మరి ధనుష్ నిజంగానే వస్తే విజయ్, పవన్ కళ్యాణ్ లానే ఆయన కూడా సక్సెస్ అవుతారా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.



