ఎన్నికల సమయంలో ఏ రాష్ట్రంలో అయినా చిన్నచిన్న గొడవలు సహజమే. ఎలక్షన్స్ వచ్చాయంటే పోలింగ్ కేంద్రాల వద్ద చెదురు ముదురు ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొన్నిసార్లు దాడులు ప్రతి దాడులు కూడా జరుగుతుంటాయి. కార్యకర్తలు, అభ్యర్థులు ఒకరినొకరు అడ్డుకోవడం దాడులు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏపీలో తాజా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. నామినేషన్లకే అభ్యర్థులు కార్యకర్తలు తీవ్రమైన దాడులకు పాల్పడటం ఆందోళనకరంగా మారింది. ఇటీవల లోకల్ బాడీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన సంఘటన తెలిసిందే. దీంతో రాష్ట్రంలో శుక్రవారం నుండి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో పలు జిల్లాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వాహనాలకు నిప్పు పెట్టడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, కత్తులతో దాడి చేయడం, ఒకరినొకరు దూషించుకోవడం లాంటి ఘటనలతో పచ్చని పల్లెల్లో టెన్షన్ మొదలైంది. పులివెందులలో ఏకంగా పోలీసులు గన్ ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. అంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఎంపీ మిథున్ రెడ్డి పై కేసు నమోదు

శుక్రవారం అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితిలో నెలకొన్నాయి. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి స్థానిక అభ్యర్థులలో కలిసి నామినేషన్ కేంద్రానికి వెళుతుండగా అదే సమయంలో టిడిపి అభ్యర్థులు కార్యకర్తలు సైతం అక్కడికి చేరుకున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద మిథున్ రెడ్డిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మిథున్ రెడ్డి కాన్వాయ్ పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. మిథున్ రెడ్డికి చెందిన చెందిన నాలుగు స్కార్పియో వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మిథున్ రెడ్డి సైతం తన వాహనాన్ని వేగంగా టిడిపి కార్యకర్తల వైపు తీసుకువెళ్లారు. దీంతో టిడిపి కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మిథున్ రెడ్డి తోపాటు 50 మంది పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన తో పుంగనూరులో కొన్ని గంటల పాటు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల సెక్యూరిటీ మధ్య మిథున్ రెడ్డిని బయటకు పంపించారు.

కడపలో కలకలం

ఇదిలా ఉండగానే కడప జిల్లా శనివారం మరియాపురం నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ మాజీ డిప్యూటీ మేయర్ కుమారుడిపై కత్తులతో దాడి జరిగింది. టిడిపి నేతలు ఈ దాడికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. కడప జిల్లా గాంధీ నగర్ లో సైతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నా యి. టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్ళు రువ్వుకున్నాయి. ఈ ఘర్షణలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తత

అన్నమయ్య జిల్లా రాయచోటిలో శుక్రవారం వైసీపీ కార్యాలయం ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పు పెట్టారు. మరోవైపు శనివారం వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షరీఫ్ వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో రాయచోటిలోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత ఏర్పాటు చేశారు.

పులివెందులలో గాల్లోకి ఆరు రౌండ్ల కాల్పులు

మరోవైపు రాయచోటి, పులివెందుల ప్రాంతాల్లో టిడిపి వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కత్తులు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. పులివెందులలో నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ టిడిపి శ్రేణుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకేసారి నామినేషన్ వేసేందుకు రావడంతో ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఆందోళన కారులపై లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వైసిపి కార్యకర్తలు పోలీసుల పైకి దూసుకుని వెళ్లడంతో పోలీసులు గాల్లోకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు.

ఇప్పుడే ఇలా ఉంటే పోలింగ్ కౌంటింగ్ ఎలా?

రాష్ట్రంలో తాజా పరిణామాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కత్తిపోట్ల దాడులు, వాహనాలను తగలబెట్టడం, రోడ్లపై కర్రలతో రాళ్లతో కొట్టుకోవడం లాంటి వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఏపీ లో పరిస్థితులపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల సమయంలోనే ఇలా ఉంటే పోలింగ్ సమయంలో… కౌంటింగ్ సమయంలో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చగా ఉండాల్సిన పల్లెల్లో ఈ దారుణాలు ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇక పరిస్థితులను అదుపు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర పోలీసు యంత్రాంగం రంగంలోకి ప్రయత్నిస్తోంది. మరి ముందు ముందు పరిస్థితిని అదుపు చేస్తారా.. ఎన్నికలు సవ్యంగా జరుగుతాయా లేదా చూడాలి.