స్థానిక ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. కూటమి పార్టీల మధ్య సీట్ల కోసం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు మేయర్ స్థానాల కోసం పోటీ నెలకొంది. ఈ క్రమంలో నేతలు రాత్రి రాత్రే పార్టీలు మారడం కూడా ఆసక్తికరంగా మారింది. తాజాగా విజయవాడలో వెలసిన ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ నేత వంగవీటి రాధా జనసేనలో చేరారు.
ఇటీవల చంద్రబాబు, పవన్ లతో భేటీ
ఇటీవలే వంగవీటి రాధా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవగా తాజాగా ఆయన జనసేనలో చేరడం ఆశ్చర్యకరం. పవన్ చేతుల మీదుగా రాధా కండువా కప్పుకుని పార్టీలో చేరారు. మరోవైపు కొంతకాలంగా విజయవాడ మేయర్ రేసులో వంగవీటి రాధా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు జనసేన పార్టీలో చేరి పోటీ చేస్తుండటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
వంగవీటి రాధా ప్రస్థానం
వంగవీటి రంగా కుమారుడిగా వచ్చిన రాధా రాజకీయ ప్రస్థానం అనేక మలుపులు తిరిగింది. రాధా తండ్రి వారసత్వంగా 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అదే ఏడాది విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరవాత 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 లో మళ్ళీ విజయవాడ తూర్పు నుండి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. తిరిగి 2014లో ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పై ఓడిపోయారు. తరవాత 2015లో వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడుగా, విజయవాడ సెంట్రల్ కో ఆర్డినేటర్ గా పనిచేశారు. ఇలా 2019లో విజయవాడ తూర్పు టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన తరవాత ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకుండా కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కీలక పాత్ర పోషించారు. ఇక ఇప్పుడు ఆయన మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకున్నారు.
టీడీపీ నుండి జనసేనలోకి అందుకేనా?
ఇదిలా ఉంటే జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడంతో సీట్ల కేటాయింపులో లెక్క సరితూగేందుకే రాధా జనసేనలో చేరుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. వంగవీటి రాధాను జనసేనలోకి పంపిస్తే ఇటు టీడీపీ అభ్యర్థి జనసేన నుండి పోటీ చేసినట్టు అవుతుందని అందుకే ఆయనను ఆ పార్టీలోకి పంపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రెండు పార్టీలకు లాభం చేకూరాలనే ఇలా నిర్ణయం తీసుకున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. విజయవాడ కార్పొరేషన్ కోసం జనసేన ఒత్తిడి తెస్తుందని అమరావతి సమీపంలోని మేయర్ కార్పొరేషన్ అయిన విజయవాడను టీడీపీ వదులుకునేందుకు ఇష్టంగా లేదని, అందుకే రాధాను పంపిస్తే మేయర్ స్థానం తమ చేతిలోనే ఉంటుందని ప్లాన్ చేశారని వైసీపీ విమర్శలు చేస్తోంది.
పార్టీలు మారడంపై విమర్శలు
ఇక వంగవీటి రాధా పార్టీలు మారడంపైనా విమర్శలు వస్తున్నాయి. మొదట కాంగ్రెస్ తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన బీజేపీ తప్ప రాష్ట్రంలోని అన్ని పార్టీలు తిరిగారనే విమర్శలు వస్తున్నాయి. ఒక్కో కారణంతో పార్టీలు మారుతూ వస్తున్నారని, ఇప్పుడు జనసేనలో అయినా ఉంటారా లేదా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. రాధా ఇలా పార్టీలు మారుతుంటే జనానికి సైతం ఆయనపై నమ్మకం పోతుందని కాబట్టి ఇకపై ఆయన జనసేనలోనే కొనసాగడం మంచిదని సూచిస్తున్నారు. ఇక ఇన్ని పార్టీలు మారిన రాధా పొలిటికల్ ఫ్యూచర్ జనసేనలో ఎలా సాగుతుందో చూడాలి. అయితే ఏది ఏమైనా రాధాకు కాపు ఓటు బ్యాంకు బలంగా ఉంది. మరోవైపు జనసేనకు సైతం కాపు సామాజికవర్గం నుండి అభిమానులు ఎక్కువే. దీంతో కాపు ఓటు బ్యాంకు మాత్రం ఇకపై మిస్ కాదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.



