సీజేపీ “కాక్రోచ్ జనతా పార్టీ” భారత రాజకీయాల్లో ఇది ఒక సంచలనం అనే చెప్పాలి. యాక్టివ్ పాలిటిక్స్ లో తాము ఉండమని చెబుతున్నప్పటికీ సీజేపీ చేస్తున్న ఉద్యమాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఉద్యోగాలు రాని, స్కిల్స్ లేని కొందరు యువత న్యాయవస్థలోకి, జర్నలిజంలోకి వస్తున్నారు అలాంటివారు కాక్రోచ్లు పనికిరానివారు అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల నుండే సీజేపీ పార్టీ పుట్టింది.
మొదట సోషల్ మీడియా పేజీగా మొదలై
మొదట అభిజిత్ దీప్కే ఒక సోషల్ మీడియా పేజీగా ప్రారంభించిన సీజేపీ ఆ తర్వాత ఉద్యమంలా మారిపోయింది. గంటల వ్యవధిలోనే ఈ పేజీకి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ వచ్చారు. అదే సమయంలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అవడం, చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో మొట్టమొదట సీజీపీ ఆ ఇష్యూ పైనే పోరాటం చేసింది. జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. సీజేపీ చేసిన ఈ ప్రొటెక్ట్ కు దేశం నలుమూలల నుండి యువత వెళ్లి మద్దతు పలికారు.
నీట్ ఉద్యమానికి భారీగా మద్దతు
అంతేకాకుండా ఈ నిరసనలో విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ సైతం పాల్గొనడం మరో సెన్సేషన్ గా మారింది. బాలీవుడ్ టాలీవుడ్ సహా సినీ రాజకీయ ప్రముఖులు ఈ నిరసనకు సపోర్ట్ ఇచ్చారు. పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే ప్రధాన డిమాండ్ తో ఈ నిరసన దీక్ష కొనసాగగా చివరికి ఈ ఉద్యమం సక్సెస్ అయ్యింది. చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రిని గద్దె నుండి దింపిన ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోకుండా ఉండదు అనే చెప్పాలి.
నీట్ ఉద్యమం తరవాత ఎన్నికల సర్ ప్రక్రియపై ప్రొటెస్ట్
అయితే ఇది జరిగిన కొంతకాలానికి మళ్లీ సర్ ప్రక్రియ ద్వారా అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కమిషన్ అక్రమాలకు పాల్పడుతోంది అంటూ సంచలన ఆరోపణలు చేస్తూ ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి అని డిమాండ్ తెరపైకి వచ్చింది. మళ్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనకు సిద్ధమవగా ఈసారి మాత్రం దెబ్బ పడింది. కేంద్రం సీజేపీని కట్టడి చేస్తూ ఉద్యమాన్ని అడ్డుకుంది. నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేసింది. మరో వైపు గతంలో లభించినంతగా ఈ ప్రొటెస్టుకు మద్దతు కూడా లభించలేదు. నీట్ పరీక్ష పై ఉద్యమం సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, దేశంలోని యువత అంతా ఒక తాటి పైకి వచ్చారు.
సర్ ప్రక్రియపై భిన్నాభిప్రాయాలు
సర్ ప్రక్రియపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు కేంద్రం సైతం సీజేపీ నాయకులను అరెస్టు చేస్తూ జైళ్లకు పంపిస్తుంది. అదేవిధంగా జంతర్ మంతర్ వద్ద ఇకపై ప్రొటెస్టులు చేయవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో సైతం సర్ కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు అంతంత మాత్రంగానే సపోర్ట్ లభిస్తోంది. ఓవైపు కేంద్రం కట్టడి చేయడం… మరోవైపు దేశవ్యాప్తంగా నీట్ పై లభించిన మద్దతు లభించకపోవడంతో ఈసారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా విషయంలో సీజేపీ సక్సెస్ అవడం కష్టమేనని అనిపిస్తోంది.
అది కూడా మైనస్సే
కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా సిజెపి టీం ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పటికీ ఇతర పార్టీలతో కలిసి ప్రయాణం చేస్తే అనుకున్నది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉండేవేమో. కానీ తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పదేపదే చెప్పడంతో పొలిటికల్ పార్టీలు సైతం సీజేపీ నిరసనలకు దూరంగానే ఉంటున్నాయి. అప్పుడప్పుడు బిజెపి ప్రొటెస్ట్ గురించి మాట్లాడినప్పటికీ బహిరంగంగా వచ్చి పెద్దగా నిరసనల్లో పాల్గొనడం లేదు. ఇక్కడ క్రెడిట్ విషయంలోనూ ఇరువురి మధ్య కొంత గ్యాప్ వస్తుంది. నీట్ఉ ద్యమానికి పూర్తి క్రెడిట్ సీజేపీకే వెళ్లడంతో ఇతర పార్టీలో ఆలోచనలో పడ్డాయి. తాము కష్టపడినప్పటికీ ఫలితం కాక్రోచ్లకే దక్కుతుందని వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల సీజేపీ కీలక సభ్యులు అరెస్ట్ అయిన సమయంలోనూ ఏ ఒక్క రాజకీయ పార్టీ వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేయలేదు.



