సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. స్టార్ హీరోల నుండి ఇతర పాత్రలు చేసే నటీనటులు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతూ ప్రేక్షకులకు షాక్ ఇస్తూ ఉంటారు. అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా కలిసి కనిపించిన జంటలు సైతం విడాకులు ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఈ ట్రెండ్ కేవలం సినిమాలలోనే కాదు. ఇప్పుడు సీరియల్స్ లోను ఇలాంటి ట్రెండే కనిపిస్తోంది. ఇటీవల కాలంలో తెలుగు సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులు విడాకులు ప్రకటించడం షాకింగ్ గా మారింది.

భర్తతో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించిన ఐశ్వర్య పిస్సే

తాజాగా తెలుగు సీరియల్ నటి ఐశ్వర్య పిసే తన భర్తతో విడిపోయినట్టు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది. కన్నడ నటి అయినప్పటికీ ఐశ్వర్య ప్రస్తుతం తెలుగులో వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. *నా పేరు మీనాక్షి” సీరియల్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటి అగ్నిసాక్షి సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత కన్నడతో పాటు తమిళ, తెలుగు సీరియల్స్ లో బిజీగా మారింది. ఇక కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే ఈ బ్యూటీ 2019లో సీరియల్ నటి నవ్య స్వామి సోదరుడు హరి వినయ్ ని పెళ్లి చేసుకుంది. ఈ జంట పెళ్లి చేసుకొని దాదాపు 7ఏళ్లు అవుతోంది. అయితే ఇన్నేళ్ల తర్వాత ఐశ్వర్య విడాకులు ప్రకటించడం ఆశ్చర్యకరం.

ఏడాది కాలంగా విడిగా ఉంటున్న జంట

ఏడాదికాలంగా ఈ జంట విడివిడిగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐశ్వర్య వాటిపై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో “అవును మేమిద్దరం గత ఏడాదిన్నర కాలంగా విడివిడిగా నివసిస్తున్నాం. చాలాసార్లు ఆలోచించిన తర్వాత ఇరువురి అంగీకారంతో విడాకులు తీసుకోవాలి అని నిర్ణయానికి వచ్చాము. ఇది మా ఇద్దరి వ్యక్తిగత విషయం. ఈ కష్ట సమయంలో మా మనశ్శాంతి, వ్యక్తిగత గోప్యత గౌరవించాలని అభిమానులు శ్రేయోభిలాషులను కోరుతున్నాను. దయచేసి మా నిర్ణయాన్ని అందరు అర్థం చేసుకొని ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సీరియల్స్ సన్నివేశాలను సందర్భం లేకుండా వాడుకోవడం.. నా వ్యక్తిగత పరిస్థితిని దుర్వినియోగం చేయడం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదు. సోషల్ మీడియాలో నా ఫోటోలను పోస్ట్ చేసే వాళ్ళు నా పరిస్థితిని అర్థం చేసుకొని ప్రవర్తించాలి. తప్పుడు వార్తలు వ్యాప్తి చేయవద్దు సీరియల్స్ సన్నివేశాలకు నా వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. నా ప్రైవసీ దెబ్బతీయాలని చూసినా, తప్పుడు ప్రచారం చేసినా యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలుకునేందుకు నేను వెనకాడబోను” అంటూ రాసుకువచ్చింది. ఇలా ఐశ్వర్య తన విడాకులపై క్లారిటీ ఇచ్చేసింది.

ఇటీవల విడాకులు తీసుకున్న బుల్లితెర హీరోయిన్స్

ఇక కేవలం ఐశ్వర్య మాత్రమే కాదు గతంలోనూ కొంతమంది తెలుగు నటీనటులు తమ పార్ట్నర్స్ తో విడాకులను ప్రకటించారు. కొద్దిరోజుల క్రితమే బుల్లితెర సీరియల్ హీరోయిన్ శిరీష తన భర్తకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత మరో సీరియల్ నటుడిని ఆమె వివాహం చేసుకున్నారు. అంతే కాకుండా నిన్నే పెళ్లాడుతా, సూర్యకాంతం, రాధా రమణ సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న అనూష హెగ్డే బుల్లితెర నటుడు ప్రతాప్ సింగ్ ను వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరికి మనస్పర్ధలు రావడంతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. మరోవైపు ఎవరే నువ్వు, మోహిని సీరియల్ తో పాటు తమిళ సీరియల్స్ లో నటించిన చైత్ర రెడ్డి తన భర్త రాజేష్ అనుమాల నుండి విడిపోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఇలా సీరియల్ హీరోలు హీరోయిన్లు విడాకులు తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అయితే కారణం ఏదైనా విడాకులు తీసుకోవడం వారి వ్యక్తిగత విషయం. అయినప్పటికీ కొందరు సోషల్ మీడియాలో విడాకులు తీసుకున్న జంటలపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఎఫైర్స్ అంటగడుతూ పోస్టులు పెడుతున్నారు. దీంతో అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నటీనటుల అభిమానులు కోరుతున్నారు.