పిలిస్తే లంచం.. పలికితే లంచం ఇది తరచూ వినిపించే సామెత. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అనేది ఒక కామన్ పదం అయిపోయింది. ముఖ్యంగా లంచం అంటే గుర్తుకు వచ్చేదే రెవెన్యూ డిపార్ట్మెంట్.
రాష్ట్రంలో పెరిగిన ఏసీబీ దాడులు
ఇటీవల కాలంలో ఏసీబీ దాడులు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రెవెన్యూ శాఖలో ఉన్న అవినీతి తిమింగలాలు ఉన్నాయో బయటపడుతున్నాయి. ఒక్కో అవినీతి తిమింగలం ఆస్తులు చూస్తుంటే ప్రజల కళ్ళు బయలుకముతున్నాయి. రాజకీయ నాయకులకు పోటీ ఇచ్చే విధంగా తహసీల్దార్ ల సంపాదన కనిపిస్తోంది. ఏకంగా వందల కోట్ల అక్రమస్తులతో అధికారులు దొరికిపోవడం సంచలనంగా మారుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగికి వచ్చే జీతానికి ఒకటి లేదా రెండు ఇల్లు కట్టాలంటే జీవితాంతం కష్టాన్ని ధార పోయాల్సి ఉంటుంది. కానీ కొందరు అధికారులు ఒకటి రెండు కాకుండా మూడు నాలుగు ప్రాంతాలలో ఇండ్లు, ఖరీదైన విల్లాలు సంపాదిస్తున్నారు. ఇటీవల ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ చాలామంది అధికారులకు ఖరీదైన ఖరీదైన విల్లాలు, కేజీల కొద్ది బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు గుర్తించి వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తహసిల్దార్ పై పెట్రోల్ దాడి జరిగిన కార్యాలయంలోనే మళ్లీ లంచం
ఇక తాజాగా మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు పట్టు పడటం రాష్ట్రంలో కలకలం రేపింది. ఆయన పట్టుబడింది కూడా అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ కార్యాలయంలో కావడం విశేషం. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ కార్యాలయంలో గతంలో విజయా రెడ్డి అనే తహసిల్దార్ తన భూమి పట్టా చేయించేందుకు వేధిస్తోంది అంటూ రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ దాడిలో విజయా రెడ్డి తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మరణించారు.
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఘటన
రాష్ట్రంలో ఈ ఘటన సంచలనంగా మారింది. తాసిల్దార్ పై పెట్రోల్ పోసి నీకు అంటించడంతో రెవెన్యూ శాఖ అధికారులు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం సైతం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. అయితే ఇప్పుడు అదే అబ్దుల్లాపూర్మెట్ తాసిల్దార్ కార్యాలయంలో అదే ఛాంబర్ లో రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ రెవెన్యూ అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో తాసిల్దార్ బి. సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు ఉన్నారు. ఓ భూమికి సంబంధించి లేఅవుట్ సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు తహసిల్దార్ సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో సర్వేయర్ శ్రీనివాసులు రూ.20 లక్షల లంచాన్ని వసూలు చేస్తుండగా పక్కా సమాచారంతో అధికారులు పట్టుకున్నారు. అయితే ఇదే కార్యాలయంలో సేమ్ ఛాంబర్ లో గతంలో తాసిల్దార్ విజయ రెడ్డి పై రైతు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో ఈ వార్త సంచలనంగా మారింది. రైతు తీవ్ర ఆగ్రహానికి గురై దాడికి పాల్పడే స్థాయికి వెళ్లినప్పటికీ అదే కార్యాలయంలో తహసిల్దార్ లంచం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆ తహసిల్దారును కఠినంగా శిక్షించాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
రెవెన్యూ శాఖలో మార్పు రాదా?
ఈ వార్త వైరల్ అవ్వడంతో రెవెన్యూ శాఖలో ఇక మార్పు రాదా? అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఓ ఎమ్మార్వో రైతును “నువ్వు ఇంకా పురుగుల మందు తాగి చావలేదా” అంటూ వెక్కిలి నవ్వులు నవ్విన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ అధికారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇది జరిగిన రెండు మూడు రోజులకే అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ వ్యవహారం బయటపడటం రెవెన్యూ శాఖలో సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలకు రాజకీయ నాయకుల అండదండలు ఉండటం కూడా కారణం అనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులను కాపాడుతుంది కూడా వారి అనే ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా ఇలాంటి అధికారులను పూర్తిగా సర్వీసు నుండి తొలగిస్తే తప్ప మిగతా వారిలో భయం పుట్టదని కాబట్టి సస్పెండ్ చేయాలని ప్రజల నుండి డిమాండ్లు వస్తున్నాయి. మరి ప్రభుత్వం ఆ దిశగా చట్టం చేస్తుందా? లేదా అన్నది చూడాలి.



