కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీలో జోష్ పెరిగిందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గతంలో నిర్వహించిన భారత్ జోడో యాత్ర నుండి రాహుల్ గాంధీ సరికొత్తగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు పార్లమెంట్లో మాట్లాడినా.. మీడియా సమావేశంలో మాట్లాడినా రాహుల్ గాంధీ చాలా సౌమ్యంగా కనిపిస్తూ, అధికార పార్టీ నేతలకు కౌంటర్లు ఇవ్వడంలో కూడా విఫలం అయ్యేవారు.
భారత్ జోడో యాత్ర తరవాత మారిపోయిన రాహుల్
కానీ భారత్ జూడో యాత్ర నుండి ఆయన పూర్తిగా మారిపోయారు. అధికార బీజేపీకి కౌంటర్లు ఇవ్వడంలో.. ప్రజలతో కలిసిపోవడంలోనూ సరికొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి అంటూ చేస్తున్న నిరసనల్లో ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనలో నూతన ఉత్సాహం
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి అంటూ మొన్న జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనల్లో రాహుల్ గాంధీ ఏకంగా బారీకేడ్ల పైకి ఎక్కి నిలుచున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఆయన పోరాటంపై ప్రశంసలు కురిసాయి. రాహుల్ గాంధీ నిరసనల సమయంలో విద్యార్థులతో కలిసి నడవడం, ఆందోళనకారులతో కలిసి రోడ్లపై బైఠాయించడం లాంటివి కూడా పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించగా ఆ సమయంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం పోరాడేటప్పుడు తనపై నమోదు చేసే ప్రతి ఎఫ్ఐఆర్ కూడా ఒక మెడల్ లాంటిది… అంటూ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఏదైనా నిరసన దీక్షకు పిలుపునిస్తే తరవాత పోలీసులు అరెస్టు చేసిన వెంటనే దీక్షను లేదా నిరసనను వాయిదా వేసుకుంటారు. కానీ రాహుల్ గాంధీ అలా వెనక్కి తగ్గడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక నిరసన కార్యక్రమం ఆందోళనతో అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్నారు .
మీడియా సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు
అదేవిధంగా మీడియాతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రధాన అధికారిపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. తన మాటలు జ్ఞానేష్ కుమార్ వింటున్నాడని, చూస్తున్నాడని చెప్పారు. జ్ఞానేష్ కుమార్ కు రాహుల్ వార్నింగ్ ఇచ్చిన విధానం కూడా కొత్తగా కనిపించింది. ఈ స్థాయిలో రాహుల్ గాంధీ మాట్లాడటం ఎప్పుడూ చూడలేదని సొంత కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. ఙ్ఞానేష్ కుమార్ తప్పు చేశారు కాబట్టి కచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ అన్నారు. ఆయన వెనుక మోడీ, అమిత్ షా తో పాటు మరికొందరు వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు. తప్పు ఒప్పుకుని రాజీనామా చేస్తే జ్ఞానేశ్ కుమార్ ను క్షమించి వదిలిపెడతామని అన్నారు. ఇలా రాహుల్ గాంధీ పవర్ఫుల్ స్పీచ్ లు ఇస్తుంటే మరో వైపు అధికార నేతలు రాహుల్ గాంధీకి కౌంటర్లు ఇవ్వడంలో విఫలం అవుతున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరో వైపు రాహుల్ గాంధీ జెన్ జీ యువతతో కలిసిపోతూ వల్ల స్టైల్ ను ఫాలో అవుతున్నారు. జెన్ జీ ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తూ వారికి మద్దతు తెలుపుతున్నారు. వారి భాషలోనే మాట్లాడుతూ నిరసనలలో కూడా వారి స్టైల్ నే ఫాలో అవుతున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ సైలెంట్ అవ్వడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.
బీజేపీకి తలనొప్పిగా మారిన నిరసనలు
ఇటీవల జరిగిన సీజేపీ నిరసనలు కేంద్రానికి తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. సీజేపీ నిరసనల కారణంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారింది. అది జరిగిన కొద్ది రోజులకే జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి అంటూ ఇటు ప్రతిపక్ష పార్టీలు అటు సీజేపీ ఆందోళనలు చేపట్టడం అధికార పార్టీకి ఊపిరి పీల్చుకోలేనంత ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే రాహుల్ గాంధీ టైం చూసి దెబ్బ కొట్టడం వల్లే బీజేపీ నేతలు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



