తెలంగాణలో డర్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా నేతలు ఒకరినొకరు పర్సనల్ గా టార్గెట్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. రాజకీయాల్లోకి పర్సనల్ జీవితంతో పాటు కుటుంబాలను సైతం లాగుతున్నారు. ఇందులో అధికార ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా అందరిది ఒకే తీరుగా కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో సమస్యలను గాలికి వదిలేసి ఈ పర్సనల్ ఎటాక్ ఏంటి అంటూ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.

ఎన్నికల ముందు నుండి కేటీఆర్ పై పర్సనల్ ఎటాక్

రాష్ట్రంలో ఎన్నికల ముందు నుండి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోని ఓ హీరోయిన్ తో కేటీఆర్ కు సంబంధాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ తర్వాత కేటీఆర్ ఆ నేతలపై కేటీఆర్ పరువు నష్టం దావా సైతం వేశారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో కేటీఆర్ పై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అనేకసార్లు కేటీఆర్ ఆ ప్రచారాన్ని ఖండించినప్పటికీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆయనపై పోస్టులు దర్శనమిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇటీవల కేటీఆర్ తనకు జ్వరం వచ్చిందని రెస్ట్ తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే అదే సమయంలో కొందరు అధికార పార్టీ నేతలు కేటీఆర్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకున్నారని అందుకే బయటకు రావడంలేదని, దానికోసం కోట్లు ఖర్చు పెట్టారని ప్రచారం చేశారు. నిజానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినా ఇతర విషయాలు అయినా అవి కేటీఆర్ పర్సనల్ జీవితానికి సంబంధించినవి. రాజకీయాలకు ఆయన పర్సనల్ లైఫ్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ వాటిని రాజకీయాల్లోకి తెచ్చి విమర్శలు చేయడం సంచలనంగా మారింది. మరోవైపు కేటీఆర్ ను టార్గెట్ చేయడంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది.

రాష్ట్ర సీఎం పైనా ఆరోపణలు

ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొంత మంది సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేయడం సంచలనంగా మారింది. సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తున్న పేజీలు ఇతర దేశాల నుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కేటీఆర్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకున్నారని ఆరోపిస్తూ విమర్శలు కురిపించగా బీఆర్ఎస్ నేతలు బల్మూరి వెంకట్ ను టార్గెట్ చేశారు.

బల్మూరి వెంకట్ పై సంచలన వ్యాఖ్యలు

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత చిరుమల్ల రాకేష్ బల్మూరి వెంకట్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను మీడియా ముందు పెట్టారు. బల్మూరి వెంకట్ పెళ్లి చేసుకొని భార్యను విడిచిపెట్టారని, భార్య ఉండగానే మరో మహిళతో సంబంధాలు పెట్టుకున్నారని అన్నారు. అక్కడితో ఆగకుండా ఆయనకు గోవాలో విల్లా ఉందని అది ఎవరికి రాసి ఇచ్చారో తమకు తెలుసు అంటూ మాట్లాడారు.

నేతల తీరుపై ప్రజలు, రాజకీయ విశ్లేషకుల ఆగ్రహం

ఇలా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేయడంతో రాష్ట్రంలో డర్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయని భావన ప్రజల్లో కలుగుతోంది. సీనియర్ రాజకీయ విశ్లేషకులు అయితే గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని… రాజకీయ నాయకులు కాస్త హుందాగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ఇలా పర్సనల్ గా టార్గెట్ చేసుకుంటే ఫ్యూచర్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రజా సమస్యలను పక్కనపెట్టి కుటుంబ విషయాలను లాగుతూ విమర్శలు చేసుకోవడంపై ప్రజలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర భవిష్యత్తు ఏంటి?

రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని ముందుగా వాటిని పట్టించుకోవాలని కోరుతున్నారు. నిరుద్యోగం, పేదరికం, ఫీజు రియంబర్స్మెంట్ అందకపోవడం, స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు, పథకాలు పూర్తిస్థాయిలో అమలు జరగకపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఉన్నాయని మండిపడుతున్నారు. నేతలకు ఓట్లు వేసి గెలిపిస్తే మీరు చేసే రాజకీయాలు ఇవేనా అని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. అమలు చేయడంలో విఫలం అయితే ప్రతిపక్షాలు ప్రశ్నించాలి. కానీ అది పోయి ఇలా విమర్శలు చేసుకుంటూ పోతే రాష్ట్ర భవిష్యత్తు ఏంటో.