ఏపీలో స్థానిక ఎన్నికలవేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల బరిలో దిగబోతున్నారు అంటూ కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నం మేయర్ రేసులో బాలయ్య కుమార్తె తేజస్విని కూడా ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ రెండో కుమార్తె ఎంపీ శ్రీ భరత్ సతీమణి తేజస్వి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, విశాఖ మేయర్ పదవిపై కన్ను వేశారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు తేజస్విని పోటీపై ఇంకా అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.. ప్రస్తుతం ఇదంతా పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారమే.
ఇదే స్థానం నుండి మరో టీడీపీ నేత పేరు
మరోవైపు ఈ స్థానం నుండి పళ్ల లావణ్య దేవి టీడీపీ నుండి పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. అంతేకాకుండా ఈ మేయర్ స్థానంపై మిత్రపక్షాలు జనసేన, బీజేపీ సైతం కన్నువేశాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో విశాఖ మేయర్ రేసులో కూటమి నుండి ఏ అభ్యర్థి ఉంటారు అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. ఇక వైసీపీ విషయానికి వస్తే గుడివాడ అమర్నాథ్ సతీమణి గుడివాడ హేమ పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మేయర్ అభ్యర్థి గుడివాడ గౌరీ హేమ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి.
తేజస్విని గురించి
నందమూరి బాలకృష్ణ కుమార్తెగా తేజస్విని చాలామందికి సుపరిచితమే. ప్రస్తుతం తేజస్విని భర్త భరత్ విశాఖ ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలో తేజస్వినికి ఇటు సినిమాలపై అటు రాజకీయాలపై అవగాహన ఉంది. సినిమా రంగం విషయానికొస్తే తండ్రి బాలకృష్ణ హీరో అవ్వడంతో ఆయన ద్వారానే తేజస్విని సైతం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే నటనకు దూరంగా ఉన్నప్పటికీ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వచ్చిన అన్ స్టాపబుల్ అనే టీవీ షోకు తేజస్విని క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ షో అప్పట్లో టెలికాస్ట్ అవ్వగా ఓటిటిలో అత్యధిక వ్యూస్ వచ్చిన టాక్ షోగా గుర్తింపు సంపాదించుకుంది. అప్పట్లో ఈ షోకు విమర్శకుల ప్రశంసలు అందాయి. అంతేకాకుండా అసలు ఈ షోకు బాలకృష్ణ ఒప్పుకునేందుకు కూడా తేజస్విని కారణమని ప్రచారం ఉంది.
అప్పట్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం
కేవలం అన్ స్టాపబుల్ టాక్ లో మాత్రమే కాకుండా పలు సినిమాల నిర్మాణంలోనూ ఆమె భాగస్వామ్యం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. బాలయ్య హీరోగా నటించిన అఖండ 2 సినిమా నిర్మాణంలో తేజస్విని భాగస్వామిగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. అదే విధంగా మోక్షజ్ఞ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా నిర్మాణ వ్యవహారాల్లోనూ భాగస్వామ్యం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బాలయ్య స్క్రిప్ట్ ల ఎంపిక, షూటింగ్ షెడ్యూల్స్ లకు సంబంధించిన విషయాలను కూడా తేజస్విని చూసుకుంటున్నారట. ఇక ఇటీవలే ఓ జ్యూవెలరీ షాప్ టీవీ యాడ్ లోను తేజస్విని కనిపించి సందడి చేయడం ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా ఆమె ఓ పాటకు డాన్స్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అన్న ప్రచారం కూడా జరిగింది.
రాజకీయాల్లో సక్సెస్ అవుతారా?
ఇక ఇప్పుడు తేజస్విని పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం జరగడంతో ఆమె సక్సెస్ అవుతారా? అని అనుమానాలు కూడా మొదలయ్యాయి. అయితే నిజానికి విశాఖ మేయర్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో తేజస్విని అక్కడ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఈ స్థానంలో ఆమె గెలుస్తారని కూడా స్థానికంగా టాక్ ఉంది. భర్త ఎంపీగా ఉండటం ఇక్కడ టిడిపి క్యాడర్ బలంగా ఉండటంతో తేజస్విని గెలుస్తారని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా తేజస్విని ముందు నుండి సైలెంట్ గా ఉండకుండా ఏదో ఒక రంగంలో రాణిస్తున్నారు. కాబట్టి రాజకీయాల్లోనూ ఆమె సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి తేజస్విని పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా..? ఇస్తే ఏ మేరకు సక్సెస్ అవుతారు అని.



