రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. చాలాకాలం నుండి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్లు టికెట్ల కోసం తమ తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే టికెట్ల కోసం డబ్బు, పలుకుబడి ఉన్న నాయకులే ముందు వరుసలో నిలబడతారు. తమకు టికెట్లు ఇవ్వాలని ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమని చెబుతుంటారు. పార్టీలు కూడా ముందుగా ప్రజల్లో పలుకుబడి ఉండి, ఖర్చు పెట్టే స్తోమత ఉన్న నాయకులకే టికెట్లు ఇస్తుంటాయి. ఎంత చెప్పినా డబ్బు ఖర్చు పెట్టే స్తోమత ఉన్న వారికే చివరికి టికెట్లు దక్కుతుంటాయి. అయితే తాజాగా జనసేన చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. భారీగా ఖర్చు పెట్టే స్తోమత, పలుకుబడి ఉన్న వారికే కాకుండా పార్టీలో ఏళ్లుగా పనిచేస్తున్న వారికి, సామాన్య కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతలతో జరిపిన చర్చలు సఫలమైన తర్వాత ఎన్నికల శంఖారావం మోగించింది.

టికెట్ల కోసం దరఖాస్తులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, జిల్లా పరిషత్ తో పాటు పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పూర్తి బయోడేటాతో దరఖాస్తులను సమర్పించాలని అధికారికంగా వెల్లడించింది. అంతేకాకుండా దీనికోసం ఒక ప్రత్యేక వెబ్ సైట్ సైతం రూపొందించింది. జెఎస్పి లోకల్ బాడీ ఎలక్షన్స్ డాట్ కామ్ పేరుతో ఈ వెబ్ సైట్ ను జనసేన ప్రారంభించింది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ముఖ్యంగా మొదటి విడత ఎన్నికల సన్నాహాలలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ లలో, మున్సిపాలిటీలలో మేయర్లు, చైర్మన్ లు, కార్పొరేటర్, కౌన్సిలర్, స్థానాలకు పోటీ చేయాలి అనుకునే అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపే దరఖాస్తులను పంపించాలని తెలిపింది.

తరవాత జడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల నుండి దరఖాస్తులు

అదేవిధంగా అనంతరం ఎంపీటీసీ ,జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీపడే అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించనున్నట్టు స్పష్టం చేసింది. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే స్థానాల్లో ప్రజాదరణ ఉన్న నేతలు, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను బరిలో దింపాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆదేశాల మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంది. పోర్టల్ లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అందులో సామాజిక సమీకరణాలు, లోకల్ లో వారికి ఉన్న క్రేజ్, కష్టపడి పనిచేసే తత్వం, పార్టీ అభివృద్ధి కోసం కష్టపడటం ఇలా రకరకాల విషయాలను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ల ఆధారంగా టికెట్లను కేటాయించనున్నారు.

జనసేన ప్రయోగం ఫలిస్తుందా

అయితే సాధారణంగా పంచాయతీ ఎన్నికలలో లోకల్ లో ఎవరు బలంగా ఉంటే వారికే పార్టీలు టికెట్లు ఇస్తుంటాయి. కానీ సామాన్య కార్యకర్తల నుంచి సైతం దరఖాస్తులను స్వీకరించడం, ఆ దరఖాస్తులను పరిశీలించి టికెట్లు ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇలా టికెట్లు ఇవ్వడం ద్వారా ఆశావహులు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ దరఖాస్తులను సమర్పించే అవకాశం ఉంటుంది. టికెట్ ఇస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే కనీసం ఆశావాహులు ఎవరు అనేది తేలనుంది. దరఖాస్తులు పంపిన తర్వాత పరిశీలించి నిజంగానే పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి… అదేవిధంగా డబ్బు ప్రామాణికం కాకుండా టికెట్లు కేటాయిస్తే అసలైన కార్యకర్తలకు న్యాయం జరిగే అవకాశం కూడా ఉంది. అలా గెలిచిన కార్యకర్తలు, నాయకులు సైతం గ్రామాల అభివృద్ధికి పాటుపడే అవకాశం ఉంది. మరోవైపు జనసేన చేస్తున్న ఈ ప్రయోగం ద్వారా రాష్ట్రంలో కొత్త రాజకీయాలకు నాంది పడే అవకాశం కూడా ఉంది. ఇదివరకు చూసిన ముఖాలను కాకుండా కొత్త వారికి పదవులు దక్కే అవకాశం ఉంది. దీనివల్ల యువత సైతం రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి సామాన్య కార్యకర్తల నుంచి సైతం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న జనసేన వారికి డబ్బు ప్రామాణికం కాకుండా టికెట్లు కేటాయిస్తుందా లేదా అన్నది చూడాలి.