సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల పరిస్థితి చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఒక సినిమాపై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత అది మంచి విజయాన్ని అందుకుంటేనే నిర్మాతకు ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది. అదే సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైతే మాత్రం భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వరుసగా సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాతలు కోలుకోవడం మరింత కష్టంగా మారుతుంది. ప్రస్తుతం కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ విషయంలోనూ ఇలాంటి చర్చ జరుగుతోంది.

భారీ పెట్టుబడులతో సినిమాలు.. ఫలితాలతో ఒత్తిడి!

గతంతో పోలిస్తే ఇప్పుడు సినిమా నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించాలంటే భారీ బడ్జెట్ అవసరమవుతోంది. అంచనాలకు తగ్గట్టుగా సినిమా విజయం సాధిస్తే నిర్మాతకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రేక్షకులను మెప్పించడంలో సినిమా విఫలమైతే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడం సవాలుగా మారుతుంది. ఇదే సమయంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ వంటి నిర్మాణ సంస్థలు భారీ చిత్రాలపై పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే, ఈ సంస్థ నిర్మించిన కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఫలితం తేడా కొట్టిన సినిమాలివే!

కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వచ్చిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమాలు నిరాశపరచడం నిర్మాణ సంస్థకు సవాలుగా మారింది.

‘కేడీ: ది డెవిల్’ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అలాగే ‘బై టూ లవ్’, ‘జన నాయగన్’, ‘టాక్సిక్’, బెయిల్ వంటి చిత్రాలు కూడా ఈ సంస్థకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.

మెగాస్టార్ సినిమాతోనైనా హిట్ దక్కుతుందా?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ అనస్వర రాజన్, చిరంజీవికి కూతురు పాత్రలో కనిపించనుండగా ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన గ్లింప్స్ సూపర్ సక్సెస్ కావడంతో ఈ ప్రాజెక్టుపై మెగాస్టార్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో చిరంజీవి, బాబీ కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ విజయవంతం కావడంతో మరోసారి ఈ కాంబినేషన్ ప్రేక్షకులను అలరిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

అయితే, నిర్మాణ సంస్థ గత చిత్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని కొందరు అభిమానులు కొత్త సినిమా విషయంలో ఆసక్తితో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటే సంస్థకు సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఈ సినిమాతోనైనా పరిస్థితి మారుతుందా?

నిర్మాతలకు విజయాలు ఎంత ముఖ్యమో, వరుస పరాజయాల నుంచి బయటపడటం కూడా అంతే ముఖ్యం. కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇప్పుడు భారీ చిత్రాల ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరి ‘కాకా’తో కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు మంచి విజయం దక్కుతుందా? గత సినిమాల ఫలితాలను పక్కనపెట్టి ఈ చిత్రం కొత్త విజయాన్ని అందిస్తుందా? అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

భారీ పోటీతో సంక్రాంతి బరిలో దిగరున్న ‘కాకా’…

చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘కాకా’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో చిరు – బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్టేర్ వీరయ్య’ కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో చాలా కాంపిటేషన్ ఉంది. మరి అలాంటి టఫ్ కాంపిటీషన్లో నెగ్గి ఈ సినిమా విజయాన్ని అందుకొని కేవీఎన్ ప్రొడక్షన్స్ కు జోష్ నింపుతుందా? లేదా? అనే అనుమానాలను కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

ట్రేడ్ పండితుల అంచనా…

ఒకవేళ ‘కాకా’ చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి టాక్ గనుక తెచ్చుకున్నట్లయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం అని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.