స్థానిక ఎన్నికల వేళ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన స్థానాలపై ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, జనసేన వీర మహిళలు తీవ్ర నిరాశలో ఉన్నారు. తమ నిరాశను, అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆవేదనతో పోస్టులు పెడుతున్నారు. ప్లీజ్ ఇంకా తగ్గొద్దు పవన్.. అంటూ ఆ పార్టీ అధినేతను కోరుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలో జనసేనకు కేవలం 21 స్థానాలు మాత్రమే కేటాయించారు. 21 స్థానాల్లోనూ జనసేన జెండా ఎగరవేసింది. అంతేకాకుండా ఎంపీలు ఎన్నికల్లో టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేస్తే జనసేన కేవలం 2 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. ఈ రెండు స్థానాల్లోనూ విజయం సాధించింది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన అంతా బలంగా లేకపోయినా ఎన్నికల తర్వాత తన బలాన్ని నిరూపించుకుంది. 100 శాతం స్ట్రైక్ రేట్ తో సత్తా చాటింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన క్యాడర్ మరింత పెరిగింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీలోకి కీలక నేతలు చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన మూడవ అతిపెద్ద పార్టీగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నేషనల్ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ కంటే జనసేన బలంగానే ఉంది. గతంలో అధికారం చేపట్టిన వైసీపీ మరియు టీడీపీలతో పోటీ పడే స్థాయిలో ఉంది. అయినప్పటికీ టికెట్ల కేటాయింపులో తమకు నష్టం జరుగుతోందని కార్యకర్తలు అభిమానులు భావిస్తున్నారు.
40 శాతం స్థానాలు డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్
ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో జనసేన 40 శాతం సీట్లు డిమాండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ పలు దఫాలుగా జరిగిన చర్చల తర్వాత ఆ పార్టీకి దక్కింది 20.33 శాతం స్థానాలు మాత్రమే. రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాల్లో టిడిపి (89) బరిలోకి దిగుతోంది. జనసేనకు 21 సీట్లు కేటాయించగా బీజేపీకి 9 సీట్లు కేటాయించారు. మరోవైపు 17 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాల్లో టిడిపికి 11 సీట్లు, జనసేనకు 4 బిజెపికి 2 స్థానాలు కేటాయించారు. అదేవిధంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలు నగర పంచాయతీలలో 106 స్థానాల్లో చైర్పర్సన్ పదవులు టిడిపికి 78, జనసేనకు 21, బిజెపికి 7 స్థానాలు దక్కాయి. ఈ లెక్కలపై జనసైనికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడ్డవారికి ఫలితం లేదా?
జనసేన స్థాపించిన నాటినుండి పార్టీ కోసం కష్టపడుతుంటే ఇప్పుడు కూడా టికెట్లు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ బలంగా ఉన్న స్థానాల్లోనూ టీడీపీకి సీట్లు కేటాయిస్తే లాభం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ పెట్టింది అధికారంలోకి వచ్చేందుకని ఇలా పొత్తులు పెట్టుకుంటే పార్టీ భవిష్యత్తు ఏంటని నిలదీస్తున్నారు. జనసేనలో ఎక్కువగా మొదటి నుండి పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్లకి టికెట్లు ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటినా, ఎంపీ ఎన్నికల్లో ఇచ్చిన రెండు స్థానాల్లో గెలిచినా ఇప్పుడు కూడా తక్కువ సీట్లు కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చాలా ఏళ్లుగా పార్టీని నమ్ముకుని బ్రతుకుతున్నామని తమలాంటి వారికి టికెట్లు ఇవ్వకపోతే పార్టీ ఎలా బతుకుతుంది అని అడుగుతున్నారు.

జనసేనలో టీడీపీ నేతలకు టికెట్లు
మరోవైపు జనసేనకు కేటాయించిన స్థానాల్లో టిడిపి నేతలను పార్టీలోకి చేర్చుకుని టికెట్లు ఇవ్వడం పై సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీలో నాయకులు కార్యకర్తలు ఉన్నప్పటికీ వారికి ఇవ్వకుండా టిడిపి నుండి కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ఇటివలే విజయవాడలో వంగవీటి రాధా జనసేనలో చేరగా ఆయన మేయర్ అభ్యర్థి అంటూ ప్రచారం జరుగుతోంది. మరికొన్ని చోట్లా ఇలానే జరిగింది. ఈ చేరికలపై సైతం కార్యకర్తలు అసంతృప్తిగానే ఉన్నారు.
రెబల్స్ గా బరిలోకి దిగుతున్న నేతలు
ఇది ఇలా ఉంటే నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా కూటమి నుండి టిడిపి అభ్యర్థిగా చింతకాయల పద్మావతి నామినేషన్ వేయగా అదే స్థానంలో జనసేన రెబెల్ అభ్యర్థిగా అద్దేపల్లి సౌజన్య నామినేషన్ దాఖలు చేశారు. దీంతో జన సైనికులు ఆమె చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న అన్ని స్థానాల్లోనూ జనసేన రెబల్స్ బరిలో దిగాలని సూచిస్తున్నారు. అయితే దీనిపై సైతం అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియా పోస్టులు చూస్తే మాత్రం జనసేన కేడర్ తీవ్ర నిరాశలో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే పార్టీ భవిష్యత్ కే నష్టం తప్పదని విశేషకులు సైతం హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పటికైనా జనసేనాని అర్థం చేసుకుంటారా లేదా చూడాలి.



