లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. గతంలో సల్మాన్ ఖాన్ పై దాడుల సమయంలో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు వెలుగులోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలపై కాల్పులు జరిపారు అనే ఆరోపణలతో బిష్ణోయ్ గ్యాంగ్ ఆయనపై దాడికి ప్రయత్నించింది. ఇక తాజాగా మరో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కలుపులతో మరోసారి సంచలనంగా మారింది.
టైగర్ ష్రాఫ్ పై కాల్పులు
అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ముంబైలోని జుహూ ప్రాంతంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారు సమీపంలోనే కాల్పులు జరిగాయి. ఈ ప్రమాదం నుండి హీరో సురక్షితంగా బయటపడ్డాడు. అయితే దాడి తర్వాత ఈ దాడికి బాధ్యులు తామే అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అనిల్ పండిట్ ప్రకటించాడు .
టైగర్ ష్రాఫ్ పై కాల్పుల కేసులో సంచలనాలు
అయితే తాజాగా టైగర్ ష్రాఫ్ పై కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ ఇళ్ల దగ్గర కూడా ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించినట్టు తేలింది. ముంబై బాంద్రాలోని రణబీర్ కపూర్ ఇంటిదగ్గర నిందితుల కదిలికలను పోలీసులు గుర్తించారు. టైగర్ ష్రాఫ్ పై దాడికి ఒక రోజు ముందే షూటర్ల చేతికి తుపాకులు వచ్చినట్టు తెలిసింది. అక్టోబర్ 17వ తేదీన షూటర్లకు ఆయుధాలు అందినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆయుధాలు సరఫరా చేసింది కూడా పురుషులు కాదని భవిత, రాదా అనే ఇద్దరు మహిళలు ఆయుధాలను సప్లై చేశారని పోలీసులు గుర్తించారు.
బాలీవుడ్ హీరోలు ఎందుకు టార్గెట్ అయ్యారు?
అయితే ఇప్పుడు కేవలం టైగర్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ మాత్రమే కాకుండా బాలీవుడ్ లోని పలువురు హీరోలను బిష్ణోయ్ గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేసింది అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. నిజానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మొదట టార్గెట్ చేసింది సల్మాన్ ఖాన్ నే. గతంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలపై కాల్పులు జరిపాడు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే లారెన్స్ బిష్ణోయ్ సమాజం కృష్ణ జింకలను దైవంగా ఆరాధిస్తారు. వాటికి ఎలాంటి హాని తలపెట్టకూడదని భావిస్తారు. దీంతో సల్మాన్ ఖాన్ వాటిని చంపారని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయనను టార్గెట్ చేశాడు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కు సన్నిహితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేస్తోంది. అంతే కాకుండా మొదటి నుండి ఈ గ్యాంగ్ సినిమా తారలు, హై ప్రొఫైల్ వ్యక్తులనే టార్గెట్ చేస్తోంది.
లారెన్స్ బిష్ణోయ్ ఎందుకు గ్యాంగ్ స్టర్ గా మారాడు
లారెన్స్ పంజాబ్ లోని ఓ పోలీస్ కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి ఒక కానిస్టేబుల్. కాగా చిన్ననాటి నుండే బిష్ణోయ్ నేర ప్రపంచానికి అట్రాక్ట్ అయ్యాడు. స్కూల్ లో ఉండగానే తనపేరు ముందు లారెన్స్ అని పెట్టుకున్నాడు. అంతే కాకుండా కాలేజీ రోజుల్లో గోల్డ్ గిబ్రార్ అనే గ్యాంగ్ స్టర్ తో చేతులు కలిపాడు. అప్పటి నుండి అదే ప్రపంచంలోకి అడుగుపెట్టి నేరాలు చేస్తున్నాడు. ప్రస్తుతం బిష్ణోయ్ గ్యాంగ్ లో 300 మంది షూటర్లు ఉన్నట్టు తెలుస్తోంది. బిష్ణోయ్ జైలులో ఉన్నా తన నెట్ వర్క్ ను అక్కడ నుండే రన్ చేస్తున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ సబర్మతి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతడు 2014 లోనే అరెస్ట్ అయ్యాడు. రాజస్థాన్ లో బిష్ణోయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే తరవాత పోలీసుల నుండి తప్పించుకుని బయటికి వచ్చాడు. మళ్ళీ అతడిని అదే సంవత్సరంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జైలులోనే ఉన్నప్పటికీ ముంబై, పుణె సహా పలు నగరాల్లో బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం బిష్ణోయ్ హై సెక్యూరిటీ మధ్య జైలులో ఉన్నప్పటికీ ఎలా కార్యకలాపాలు సాగిస్తున్నాడు అనేది చాలా మందికి ప్రశ్నగా మారింది. మొత్తం బాలీవుడ్ కి తలనొప్పిగా మారిన బిష్ణోయ్ గ్యాంగ్ ఎప్పుడు ఎవరిని ఏం చేస్తుందో అని అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. మరి ఈ గ్యాంగ్ ను పోలీసులు ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి.



