ఏపీలో పొత్తులపై మరోసారి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలపై కూటమి నేతలు ఒక క్లారిటీకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మున్సిపల్ ఎన్నికల విషయంలో కూటమి పార్టీల నుండి టికెట్లు ఆశించిన కొంతమంది కార్యకర్తలు, నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమ అసంతృప్తి బహిరంగంగానే ప్రకటించారు. ముఖ్యంగా జనసేనకు నష్టం జరిగిందని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమకు అన్యాయం జరిగిందని తగిన స్థాయిలో టికెట్లు కేటాయించలేదని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అసలు ఈ పొత్తే వద్దంటూ కూడా అసంతృప్తితో జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ ను రిక్వెస్ట్ చేస్తూ పోస్ట్లు పెట్టారు. నిజానికి పవన్ కళ్యాణ్ మొదట మున్సిపల్ ఎన్నికల్లో 40 శాతం సీట్లు తమకు కేటాయించాలని చంద్రబాబును కోరారు. కానీ కూటమి పార్టీల మధ్య జరిగిన చర్చల తరవాత రాష్ట్రంలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీకి 72.35% జనసేనకు, సుమారు 20.32 శాతం, బీజేపీకి 7.31 శాతం సీట్లను కేటాయించారు.
జనసేన లో అసంతృప్తి
దీంతో ఆశించిన స్థాయిలో జనసేనకు టికెట్ లు దక్కకపోవడంతో ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి మొదలైంది. ఇక ప్రస్తుతం జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలపై కూటమి పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో కూటమి పార్టీల మధ్య సీట్ల కేటాయింపు పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
టికెట్ల కేటాయింపు పై జనసేన, టీడీపీ మధ్య చర్చలు
ఇప్పటికే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో రెండుసార్లు భేటీ అయ్యారు. ఈ భేటీలో టికెట్ల కేటాయింపు పై ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో జనసేనకు 30% స్థానాలు కేటాయించాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినట్లు సమాచారం అందుతోంది. అదేవిధంగా జడ్పీ చైర్మన్ స్థానాల్లో 9 స్థానాలు జనసేనకు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే టిడిపిలోనూ ఆయా స్థానాల కోసం పోటీ ఎక్కువగా ఉందని చంద్రబాబు పవన్ కు చెప్పినట్టు తెలుస్తోంది. టిడిపి నుండి పలువురు నేతలు జడ్పీ చైర్మన్ పదవులు ఆశిస్తున్నారని… ఈ అంశంపై పునరాలోచన చేయాలని పవన్ కు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఇరుపక్షాలు ఒక కొలిక్కి వచ్చి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
టికెట్ల విషయంలో సంతృప్తిగా బీజేపీ
మరో వైపు మున్సిపల్ ఎన్నికల్లో కేటాయించిన స్థానాలపై బీజేపీ సంతృప్తి గానే ఉంది. ఎక్కడ కూడా బిజెపి నేతలు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు. తమకు కేటాయించిన స్థానాల్లో టికెట్లు తీసుకొని బరిలోకి దిగుతున్నారు. ఇక ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో సైతం కేటాయించిన స్థానాలపై బిజెపి సంతృప్తి గానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం జనసేన, టిడిపి మధ్యనే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈసారైనా పవన్ కోరిన స్థానాలు కేటాయిస్తారా?
అయితే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థానాలు దక్కకపోవడంతో జనసేన కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వాళ్లు సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో టిడిపి, జనసేన పార్టీల అభిమానులు, కార్యకర్తల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఇప్పుడు ఆ వార్ కు చెక్ పెట్టాలి, అన్నా జనసేన నేతలను కార్యకర్తలను సంతృప్తి పరచాలన్నా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో పవన్ ఆశించినట్టుగా 30% స్థానాలను కేటాయించాల్సి ఉంది మరి ఆ దిశగా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారా లేదా చూడాలి. టికెట్ల కేటాయింపు పై ఇప్పటికే జనసేన నేతలు కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. మరోవైపు టిడిపి నేతలను పార్టీలో చేర్చుకుని వారికి టికెట్లు ఇవ్వడం పైనా జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు అందరూ కలిసి పోటీ చేయాలని చెప్పినా కార్యకర్తలు మాత్రం తమ ఆందోళనను బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆసంతృప్తి కొనసాగితే స్థానిక ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై ఇరు పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.



