తెలంగాణ బిజెపికి ఏమైంది? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఈ ప్రశ్న జోరుగా వినిపిస్తోంది. దానికి కారణం బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్ చేసిన వ్యాఖ్యలే. ఇటీవల సునీల్ తెలంగాణ బిజెపి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పనిచేయనప్పుడు పదవులు ఎందుకని, బాధ్యతలు నిర్వర్తించకపోతే వేరే వాళ్లకు ఆ పదవులు ఇచ్చేయాలని సునీల్ బాన్సల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేవలం హైదరాబాద్ లోని స్టేట్ ఆఫీస్ కే పరిమితం కాకుండా గ్రౌండ్ స్థాయిలోకి వెళ్లాలని సూచించారు. తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే కాదని… నేతలు గ్రౌండ్ లోకి వెళ్లాలని చెప్పారు. బహిరంగ సభల్లో పెద్దపెద్ద ప్రసంగాలు చేసే కంటే గ్రౌండ్ లోకి వెళ్లి చిన్నచిన్న సమూహాలతో చాయ్ తాగుతూ మాట్లాడితే వచ్చే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన రెండు మూడు కార్యక్రమాల్లో కనీసం ఒకటి కూడా అమలు చేయకపోతే ఎలా? అంటూ మండిపడ్డారు.
సునీల్ బన్సాల్ చేసిన వ్యాఖ్యలతో కలకలం
సునీల్ బన్సాల్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర బిజెపిలో కలకలం రేపాయి. మరోవైపు అసలు బిజెపికి ఏమైంది… ఎందుకు ఆయన అలా మాట్లాడారు అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నెక్స్ట్ టార్గెట్ తెలంగాణే అని భావిస్తున్న అధిష్టానం
నిజానికి కేంద్రంలోని పెద్దలు తమ తదుపరి టార్గెట్ తెలంగాణ అంటూ పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. బెంగాల్ ఎన్నికల తర్వాత తమ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని, అక్కడ జెండా ఎగరవేస్తామంటూ ఎక్స్ వేదికగా సైతం ప్రకటించారు. తెలంగాణ నేతలు సైతం ఈ విషయాన్ని అనేకసార్లు గుర్తు చేశారు. ప్రస్తుతం సౌత్ లో బిజెపి బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ ఏకంగా 8 ఎంపీ స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లోను గతంలో లేని విధంగా ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. అయితే బిజెపిలో అప్పట్లో కనిపించిన జోష్ మాత్రం ఇప్పుడు కనిపించడం లేదని సొంత పార్టీలోనే మొదలైంది. కొంతకాలం క్రితం నేతల మధ్య సఖ్యత లేకపోవడమే దీనికి కారణం అంటూ కథనాలు వచ్చాయి. బిజెపి రాష్ట్ర నాయకత్వానికి ఇతర నాయకులు గ్యాప్ ఉంది అంటూ కూడా వార్తలు వినిపించాయి. మరోవైపు పార్టీలోనే ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వార్ జరుగుతోంది అంటూ కూడా వార్తలు వినిపించాయి. వీరిద్దరూ ఇన్ డైరెక్ట్ గా ఒకరిపై ఒకరు విమర్శలు సైతం చేసుకున్నారు. కానీ ఇటీవల ఇద్దరూ కలిసి మీడియా ముందు కనిపించారు. దీంతో ఇక రాష్ట్రంలో బిజెపికి డోకా లేదని కార్యకర్తలు అభిమానులు భావించారు.
నేతలకు కలుసుకున్నా పార్టీలో కనిపించని జోష్
అయితే ఆ తర్వాత కూడా పార్టీలో పెద్దగా జోష్ కనిపించలేదు. దీంతో రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా, రెండు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినా గట్టిగా పని చేయడం లేదని అధిష్టానం భావిస్తోంది. తాము 2028 ఎన్నికలను టార్గెట్ చేసుకుని రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తే గ్రౌండ్ రియాల్టీ మాత్రం వేరుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
గ్రౌండ్ లో యాక్టీవ్ గా లేని నేతలు
కేంద్రం భావిస్తున్నట్టుగానే రాష్ట్రంలో ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీ పెద్దగా యాక్టివ్ గా లేదనే భావన కార్యకర్తల్లో, అభిమానులలో సైతం ఉంది. కాంగ్రెస్ తర్వాత అధికారం బీజేపీదేనని పదేపదే చెప్పుకున్నప్పటికీ ప్రస్తుతం బీజేపీ పరిస్థితి చూస్తుంటే మూడో స్థానానికి పరిమితమవుతోంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. మరోవైపు అదే తీరులో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ బిజెపి ఆ రెండు పార్టీలకు పోటీ ఇవ్వడం లేదనే భావన సొంత పార్టీ కార్యకర్తల్లోనే ఉంది. అదేవిధంగా బిజెపికి రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ సహా కొన్ని జిల్లాలలో పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు. అయితే అక్కడ కూడా కార్యకర్తలను అభిమానులను సరైన రీతిలో నాయకులు ఉపయోగించుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి.
ఇప్పుడైనా నాయకుల్లా మార్పు వస్తుందా?
ఇలాంటి పరిణామాల మధ్య సునీల్ బన్సాల్ ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ గా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ ఒక్కరిని ఉద్దేశించి చేసినట్టుగా కనిపించడం లేదు. పార్టీ పదవులు అనుభవిస్తూ కష్టపడని ప్రతి సీనియర్ నేతను ఆయన టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా బిజెపి గ్రౌండ్ లోకి వెళ్లి తన బలాన్ని పెంచుకుంటుందా? 2028 ఎన్నికలే టార్గెట్గా పనిచేస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.



