స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతలు వరుస మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ కార్యకర్తలకు, అభ్యర్థులకు ధైర్యాన్ని చెబుతూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. నేతల వ్యాఖ్యలు తమ పార్టీ కార్యకర్తలు, అభ్యర్థుల్లో జోష్ పెంచుతుంటే ప్రజల్లో మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం కనిపిస్తుండడంతో నాయకులు చేస్తున్న కామెంట్లతో ఎన్నికలు ఎలా జరుగుతాయా అన్న టెన్షన్ మొదలైంది.

పులివెందులలో జగన్ సంచలన వ్యాఖ్యలు

తాజాగా పులివెందుల పర్యటన సందర్భంగా జగన్ ప్రతిపక్ష నాయకులకు సవాల్ విసిరారు. ఓటింగ్ ముందు రోజు రాత్రి తాను పులివెందులకు వస్తానని అన్నారు. పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేస్తానని.. ఇప్పటికే షర్ట్ మడత పెట్టా.. ఎవరు వస్తారో రండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా పోలీసులు వైసీపీ వాళ్లపై చేయి వేశారు అంటే తనపై వేసినట్టేనని స్పష్టం చేశారు. తమ టైం వచ్చినప్పుడు అన్యాయం చేసే అధికారిని వదిలిపెట్టం అంటూ హెచ్చరించారు. అధికారులు రిటైర్మెంట్ అయినా తీసుకువస్తామని చెప్పారు. అంతేకాకుండా పులివెందులలో కొడితే రాష్ట్రం మొత్తం రీ సౌండ్ వినిపించాలని జగన్ అన్నారు. కూటమి పార్టీ చేస్తున్న దౌర్జన్యాన్ని ఎదిరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వచ్చే ఏడాది పాదయాత్ర

వచ్చే ఏడాది సెప్టెంబర్ లో పాదయాత్ర మొదలుపెడతానని ఆ తర్వాత కూటమి ప్రభుత్వం తుడిచిపెట్టుకు పోతుందని వ్యాఖ్యానించారు. రెండేళ్ల తర్వాత వచ్చేది జగన్ జగన్ 2.0 అని అన్నారు. జగన్ 2.0లో తాను ఒకటి అయితే.. కార్యకర్త రెండు అని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలు ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతున్నాయి.

జగన్ కామెంట్స్ పై పవన్ కౌంటర్

మరోవైపు జగన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ 2.0 కంటే ఎన్డీఏ పది రెట్లు చూపిస్తుందని హెచ్చరించారు. జగన్ 1.O చూపిస్తేనే ఎదుర్కొని ఎలా నిలబడ్డామో తెలుసు కదా అంటూ మాట్లాడారు. వాళ్ళు అలాంటి వయోలెన్స్ ను చూపిస్తే ప్రజలకు రక్షణ కవచంగా ఎలా ఉండాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. బలహీనుడు బెదిరిస్తాడని బలవంతుడు ఎప్పుడూ బెదిరించడని అన్నారు. 2024 లో ఛాలెంజింగ్ పరిస్థితిలో అధికారంలోకి వచ్చామని అన్నారు. స్థానిక ఎన్నికలు కీలకమైనవని, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఈజీగా జరిగిందని చెప్పారు. కానీ లోకల్ ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉందని సీట్ల సర్దుబాటులో ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటున్నారని అన్నారు. కొందరికి సర్ది చెప్పి ముందుకు వెళుతున్నామని, అగ్ర నేతల ఐక్యతను కిందిస్థాయి నేతలు సైతం చూపించాలని వ్యాఖ్యానించారు.

తుఫాన్ వల్లే సీట్ల సర్దుబాటు అవ్వలేదు

అర్నాబ్ తుఫాన్ వల్ల సీట్ల సర్దుబాటు జరగలేదని చెప్పారు. స్థానిక ఎన్నికలు రిఫరెన్స్ కాదని, విజయానికి భంగం కలిగించేలా ఎవరు చేయవద్దని చెప్పారు. వేల మంది పోటీదారులు ఉన్నారని ఈ సమయంలో తుఫాన్ వచ్చిందని అన్నారు. సర్దుబాటు కుదరలేదని టిడిపి బలంగా ఉంది, వాళ్ళకి సీట్లు ఎలా తగ్గించగలం అంటూ వ్యాక్యానించారు. జనసేన బలం జనసేనకి ఉందని కాకపోతే భారీ స్థాయిలో వెళ్లడానికి 25 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. కొందరు ఓటేసి ఉండొచ్చని, కొందరు తిరిగి ఉండొచ్చని, ఆశావాహులు ఉండవచ్చని కానీ బీఫామ్ ఇచ్చిన వాళ్లే పోటీ చేయాలని స్పష్టం చేశారు.

సవాళ్లు ప్రతి సవాళ్లతో టెన్షన్

ఇలా జగన్, పవన్ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడంతో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే కార్యకర్తలు అభ్యర్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా నేతల సవాళ్లతో ముందు ముందు ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి.