తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు తమ అసంతృప్తిని బయటపడుతున్నారు. దీంతో నేతల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ లో పలువురు నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో నేత ప్రభుత్వం పై షాకింగ్ కామెంట్లు చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తమ నియోజకవర్గంలో నిధులు విడుదల కావడం లేదు అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక కార్యక్రమంలో అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ… నేను చనిపోతా అంటేనే బిల్లులు వస్తాయంటే చావడానికి కూడా సిద్ధం అంటూ వ్యాఖ్యానించారు. నా చావు 40 కోట్ల విలువనా? లేదా నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి అంటూ మాట్లాడారు. తన నియోజకవర్గంలో రోడ్లు పూర్తి చేయకుంటే 30వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్ల నిర్మాణానికి బిల్లులు మంజూరు చేస్తామని అన్నారని, కానీ ఇప్పటివరకు చేయలేదని చెప్పారు. తన చావుతోనైనా స్పందిస్తారా..? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 40 కోట్లు విలువైనవా లేదా తన ప్రాణం విలువైనదా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి అంటూ కామెంట్స్ చేశారు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో అనిరుద్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో అనిరుద్ రెడ్డి
చాలాసార్లు ఆయన ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేస్తున్న అసంతృప్తి వ్యాఖ్యలకు అనిరుధ్ రెడ్డి రెడ్డి మద్దతు తెలిపారు. ఇప్పుడు ఆయన కూడా అసంతృప్తి వ్యాఖ్యలే చేయడం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను తెగ వైరల్ చేస్తుంది. ఆయన తీరుపై సొంత పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఉంటే మాట్లాడుకుని పని చేయించుకోవాలని.. కానీ ఇలా బహిరంగంగా మాట్లాడితే పార్టీకే తీరని నష్టం జరుగుతుందని అంటున్నారు. అనిరుద్ రెడ్డి ఒక్కో సందర్భంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నారని, ఆయనను అధిష్టానం కంట్రోల్ చేయాలని కోరుతున్నారు.
కొండా సురేఖపై వేటు
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో కొంతమంది నేతలపై వేటుపడిన సంగతి తెలిసిందే. పార్టీకి వ్యతిరేకంగా లేదా నేతలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటంతో కొండా సురేఖ మంత్రి పదవి నుండి సైతం అధిష్టానం తొలగించింది.
జక్కడి ప్రభాకర్ రెడ్డిపై వేటు
అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎల్బీనగర్ లో కీలక నేత జక్కడి ప్రభాకర్ రెడ్డి పై సైతం తెలంగాణ పిసిసి క్రమశిక్షణ కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, ఇబ్బందికర ప్రవర్తన కారణంగా ఆయన పై చర్యలు తీసుకుంది. మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత జి. చిన్నారెడ్డి పై సైతం క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. ఆయనను పదవి నుండి తప్పించింది. ఇప్పటివరకు ఇలా కాంగ్రెస్ 9 మంది సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకుంది.
ఇప్పటికైనా కంట్రోల్ చేస్తుందా?
బిల్లులు రావడం లేదు అంటూ అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్లపై కూడా పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే మరోసారి ఈ వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్ లో సంచలనంగా మారనుంది. తరచూ పార్టీలో ఎవరో ఒకరు అసంతృప్తి వ్యాఖ్యలు చేయడం, గ్రూపు రాజకీయాలు పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి అసంతృప్తి కొనసాగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తుందా? ఎలాంటి అసంతృప్తి లేకుండా నేతలను కంట్రోల్ లో పెట్టుకుంటుందా? అనేది చూడాలి.



