రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాఠాలను నేర్చుకుంటుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గులాబీ అధినేత కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ మరియు కీలక నేత హరీష్ రావు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడ ఓడిపోయారో అక్కడ నుండే తిరిగి గెలిచేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గులాబీ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణలో అందులోనూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోటలా ఉండేది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్ సభ ఎన్నికల్లో ఈ జిల్లాలో మంచి ఫలితాలు వచ్చాయి.
పదేళ్ల పాలన తరవాత మారిన ఫలితాలు
అయితే పదేళ్ల పాలన తర్వాత మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫలితాలు మారిపోయాయి. ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు పట్టం కట్టడంతో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. దీంతో ఇప్పుడు గులాబీ పార్టీ మళ్లీ అదే జిల్లా పై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ జిల్లాలో వరుస పర్యటనలు చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీని వీడిన వారు, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులుగా ఉన్నవారు సైతం బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేటీఆర్ నవంబర్ 1వ తేదీన జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీ గ్రౌండ్స్ లో రైతు గర్జన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎల్ నినో ప్రభావం, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. జిల్లాలో ఎక్కువగా రైతులు ఉండడంతో కేటీఆర్ రైతులకు తలెత్తుతున్న సమస్యలు నీటి సమస్యపైనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.
కోల్ బెల్ట్ పై పట్టు కోసం మళ్లీ ప్రయత్నాలు
మరోవైపు ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల మందమర్రి, చెన్నూరు ఇతర ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉంటారు. ఈ క్రమంలో అక్కడ సమావేశాలు నిర్వహిస్తూ సింగరేణి కార్మికులను తిరిగి బీఆర్ఎస్ వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో కారుణ్య నియామకాలు ఇచ్చారు. దీంతో చాలామంది ఉద్యోగుల కుటుంబాలు లాభపడ్డాయి. అయితే ఇప్పుడు మళ్లీ సింగరేణిలో కారుణ్య నియామకాల గురించి ప్రస్తావిస్తూ వారిని దగ్గర చేసుకుంటున్నారు. అంతేకాకుండా బీఆర్ ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అంటూ వరుస సమావేశాలు నిర్వహిస్తూ మళ్ళీ కోల్ బెల్ట్ ఏరియాలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే కోల్ బెల్ట్ ఏరియాలో పట్టు కోసం తెలంగాణ రక్షణ సేన అధినేత కవిత కూడా ప్రయత్నిస్తున్నారు. సింగరేణి కార్మిక సంఘాల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై కూడా ఆమె ఫోకస్ పెట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ జిల్లాలో గతంలో జాగృతి నుండి యువత ఎక్కువ యాక్టివ్ గా కనిపించడంతో కవిత సైతం ఈ జిల్లాపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా గతంలో తనకు సింగరేణితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కార్మికులకు మరింత మేలు చేస్తామని కారుణ్య నియామకాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా చూస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో కార్మికులు కార్మిక నేతలు కవిత వైపు మల్ల కుండా కూడా బీఆర్ఎస్ జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోంది.
పార్టీ మారిన నేతలు తిరిగి బీఆర్ఎస్ గూటికి
గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్న కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు తిరిగి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదిలాబాద్ జిల్లా నుండి కొందరు కాంగ్రెస్ ముఖ్య నాయకులు సైతం ఇటీవల బీఆర్ఎస్ లో చేరారు. దీంతో జిల్లాలో బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకున్నట్టు కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా జిల్లా జిల్లాపై కేటీఆర్ ఫోకస్ ఇలానే ఉంటే గులాబీ జెండా ఎగరడం ఖాయం అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.



