ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైసిపి నుండి టిడిపిలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. పదవుల ఆశతో కొందరు, పార్టీలో ఉండలేక మరి కొందరు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసిపికి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. మరికొందరు జనసేన పార్టీలోనూ చేరారు. అలా చేరిన వారిలో ప్రస్తుతం పార్టీలో ఉన్న కొంతమంది ముఖ్య నాయకుల సన్నిహితులు, బంధువులు సైతం ఉండటం ఆ నేతలకు, ఇటు పార్టీకి తలనొప్పిగా మారింది. స్థానిక ఎన్నికల ముందు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వైసీపీకి గుడ్ బై చెప్పి తన కుమార్తె సిరి సహస్రతో కలిసి టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మజ్జి శ్రీనివాసరావు కుమార్తె ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో విజయనగరం జిల్లా తెర్లాం జడ్పిటిసి స్థానం నుండి బరిలో దిగి విజయం సాధించారు కూడా. సిరి సహస్ర విజయంతో ఆమె జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

బొత్స ఫ్యామిలీ నుండి జగన్ కు మరో షాక్

అయితే ఇప్పుడు వైసీపీలో బొత్స ఫ్యామిలీ నుండి ఆ పార్టీకి మరో షాక్ తగలడం ఆసక్తికరంగా మారింది. బొత్స సత్యనారాయణ సమీప బంధువు, పశ్చిమగోదావరి జిల్లా తనుకు మున్సిపల్ మాజీ చైర్మన్ బలగం సీతారాం కుమారులు బాబీ రాజ్ కుమార్ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. తనుకు ఎమ్మెల్యే ఆరెమిల్లి రాధాకృష్ణ తన క్యాంపు కార్యాలయంలో వారిని టిడిపి కండువాలు కప్పి ఆహ్వానించారు. బలగం సీతారాం బొత్స సత్యనారాయణ సోదరుడు సతీష్ కు పిల్లను ఇచ్చిన మామ. అంతే కాకుండా తూర్పు కాపు సామాజిక వర్గంలో ఆ కుటుంబానికి మంచి పట్టు ఉంది. బలగం బాబి గతంలో వైసిపి పట్టణ యూత్ అధ్యక్షుడిగా పనిచేశారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు బలగం కుటుంబం టిడిపిలో చేరడం ఇప్పుడు స్థానికంగా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను టిడిపిలో చేరడం, ఇప్పుడు బలగం కుటుంబం సైతం టిడిపిలో చేరడం వైసిపికి నష్టం కలిగించడంతో పాటు టిడిపికి మరింత బలం చేకూర్చింది.

చిన్న శ్రీను పార్టీని వీడటంపై బొత్స స్పందన

గతంలో చిన్న శ్రీను, వైసీపీని వీడి టిడిపిలో చేరిన సమయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమోషనల్ అయ్యారు. పలు సందర్భాల్లో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. బొత్స సత్యనారాయణకు చిన్న అత్యంత సన్నిహితుడుగా చిన్న శ్రీను ఉండేవారు. అలాంటి శ్రీను వైసిపిని వీడి టిడిపిలో చేరడం తో మీడియా ముఖంగానే రెండుసార్లు బొత్స సత్యనారాయణ కన్నీళ్లు పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక మీడియా సమావేశంలో చిన్న శ్రీను పార్టీ మారడంపై బొత్స కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రాజకీయ పార్టీలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. మనుషులు వస్తుంటారు పోతుంటారని.. మనిషి అన్నవాడికి స్వార్థం ఉంటుందని చెప్పారు. పార్టీ తన పని తాను చేసుకుంటుందని ఇందులో కొత్తేమీ లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన కుటుంబం నుండే మరికొందరు కూడా టిడిపిలో చేయడం బొత్సకు సైతం షాకింగ్ గా మారిందనే చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ కీలక నేతగా వ్యవహరించారు. పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ ఆయన కీలక నేతగా ఎదిగారు. అలాంటి బొత్సకు ఇప్పుడు సొంత కుటుంబంలోనే షాక్ లు తగలడంతో గట్టు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక ఆయన కుటుంబ సభ్యులు ఇప్పుడు వైసిపిని వీడి టిడిపిలో చేరడంతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.