ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ప్రారంభించబోతున్నారు. నవంబర్ 11వ తేదీన మధ్యాహ్నం 11 గంటలకు ఆయన పార్టీని అనౌన్స్ చేయనున్నారు. విజయసాయి రెడ్డి కొత్త పార్టీని ప్రారంభిస్తారని చాలా కాలం క్రితమే ప్రకటించినప్పటికీ ఇటీవల దసరా సందర్భంగా పార్టీ ప్రారంభించబోయే తేదీని అనౌన్స్ చేశారు. ఇక నవంబర్ 11న ప్రారంభించబోయే ఈ పార్టీపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి ఎవరు వదిలిన బాణం? ఎవరితో జత కడతారు? ఫ్యూచర్ లో ఆయన ప్లాన్స్ ఏంటి ఇలా రకరకాల అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఆయన పార్టీ గుర్తు ఏంటి పేరు ఏంటి అనే అంశాలపై కూడా చర్చ జరుగుతుంది అయితే వీటిపై ఇప్పుడు క్లారిటీ రానుంది.

విజయసాయి రెడ్డి రాజకీయ ప్రస్థానం

విజయసాయిరెడ్డి రాజకీయ ప్రస్థానం చూసినట్లయితే ఆయన గతంలో పెద్దగా పార్టీలు మారింది లేదు. తలపండిన రాజకీయ నాయకుడు కూడా కాదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి కేవలం పదేళ్లు మాత్రమే అవుతుంది. నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయి వృత్తిరీత్యా సీఏగా పనిచేసేవారు. ఆయన చాలా కాలం పాటు వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడుగా వైఎస్ జగన్ కు ఆర్థిక మరియు వ్యాపారపరమైన వ్యవహారాల్లో కీలక సలహాదారుడుగా పనిచేశారు. ఈ క్రమంలోనే వైసిపి పార్టీని ప్రారంభించిన తర్వాత ఆ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. 2016లో మొదటిసారి వైసీపీ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు . 2021లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సభ్యుడు గా ఎన్నికయ్యారు. 2022లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు కానీ 2025లో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైతం ఆయన రాజీనామా చేశారు. ఈ పరిణామం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. పార్టీని వీడే సమయంలో విజయసాయిరెడ్డి పార్టీపై కానీ, జగన్ పై కానీ ఎలాంటి ఆరోపణలు విమర్శలు చేయలేదు. ఇకపై తాను రాజకీయాల్లో ఉండనని, శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతున్నట్టు ప్రకటించారు. తాను సేంద్రియ వ్యవసాయం చేస్తానని చెప్పారు. కానీ ఇంతలో ఏం జరిగిందో మళ్లీ తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత 2029లో మళ్లీ సీఎం జగన్ కావాలని కోరుకున్న విజయసాయిరెడ్డి ఆ తర్వాత మాట మార్చారు.

వైసీపీపై, జగన్ పై విమర్శలు

వైసీపీలో తను మానసిక వేదనను అనుభవించానని చెప్పారు. పార్టీలో దాదాపు 70 సార్లకు పైగా తనకు అవమానాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ ల ద్వారా, బహిరంగ లేఖల ద్వారా ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. తాను సొంతంగా జగన్ ను వదిలి వెళ్లలేదని కొందరి కుట్రల వల్ల పార్టీ నుండి మెడపట్టి బలవంతంగా తోసేసారని ఆరోపించారు దివంగత నేతలు రాజారెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి తనను ఎప్పుడు ఒక్క మాట అనలేదని కానీ జగన్ మాత్రం కొందరి చెప్పుడు మాటలు విని దారుణంగా కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లపాటు ఏపీని పాలించింది జగన్ కాదు.. ఆయన వెనక సజ్జల ముఠా ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. టిడిపి తో లాలూచీ పడ్డ వారికే పార్టీలో మొదటి స్థానం లభించిందని, జగన్ ఆ కోటరీ ఉచ్చులో చిక్కుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. రెండు కులాలు రెండు కుటుంబాలకే రాష్ట్రం పరిమితమైందని నిరంకుశ ధోరణితో నడుస్తోందని చెప్పారు. రాష్ట్రాన్ని కేవలం రెండు కుటుంబాలు లేదా రెండు సామాజిక వర్గాల్లో చేతుల్లో పెట్టకూడదనే ఉద్దేశంతో తను యువతకు ప్రాధాన్యమిస్తూ కొత్త ప్రత్యామ్నాయ పార్టీని పెడుతున్నట్టు చెప్పారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పైన విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్ చేశారు. జగన్ చొక్కా మడత పెడతానని చివరికి కాలు మడత పెట్టాడు అంటూ వ్యాఖ్యానించారు.

విజయ సాయి ఎవరు వదిలిన బాణం

అయితే పార్టీ ప్రకటన ఎలా? విజయసాయిరెడ్డి ఎవరు వదిన బాణం అనే చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది. నిజానికి విజయసాయిరెడ్డి మొదటి నుండి వైసీపీపై జగన్ పై విమర్శలు కురిపిస్తున్నారు. పార్టీని వీడిన తర్వాత జగన్ పై బాణాలు ఎక్కుపెడుతున్నారు. గతంలో విజయసాయిరెడ్డి బిజెపిలో చేరుతారని ప్రచారం జోరుగా సాగింది. కానీ తాను ఏ పార్టీలో చేరడం లేదని ఆయన ప్రకటించారు. కానీ బీజేపీ పెద్దలతో విజయసాయిరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. ఎంపీగా పనిచేసినప్పుడు విజయసాయిరెడ్డి బిజెపితో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు. మరోవైపు వైసీపీపై, జగన్ పై విమర్శలు చేసినంతగా విజయసాయిరెడ్డి కూటమి నేతలపై ఆ పార్టీలపై విమర్శలు చేయలేదు. మరోవైపు ఆయన ఇప్పుడు హిందుత్వ ఎజెండాను మోస్తున్నారు. ఇప్పటికే జనసేన బిజెపితో జతకట్టి హిందుత్వ ఎజెండాతో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ సాయి రెడ్డి కూడా అదే బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మతమార్పిడులను విజయసాయిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆయన సైతం కూటమిలో భాగం అవుతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు తమ సామాజికవర్గమైన రెడ్డి సామాజికవర్గంలో ఓట్ల చీలిక కోసం… కొంతమంది నాయకులను తమ వైపు తిప్పుకునేందుకే విజయ సాయి రెడ్డి ప్లాన్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి విజయసాయిరెడ్డి బాణాలు చివరికి ఎవరిని గుచ్చుకుంటాయో..