ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల హవా కనిపిస్తే వైసీపీ మాత్రం డీలా పడిపోయింది. గతంలో అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ ఈ స్థాయిలో దెబ్బతింటుందని ఎవరూ ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల హవా కనిపిస్తే వైసీపీ మాత్రం డీలా పడిపోయింది. గతంలో అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ ఈ స్థాయిలో దెబ్బతింటుందని ఎవరూ ఊహించలేదు.జగన్ అడ్డా కడప జిల్లాలో కూడా వైసిపి ఓటమిపాలైంది. ఈ ఎన్నికల ద్వారా జనసేన, బిజెపి రాష్ట్రంలో పుంజుకుంటున్నట్టు కనిపించింది. ఈ ఎన్నికల్లో ఓటమిపాలైన వైసిపి నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికలలో కూటమి పార్టీలు తమ బలాన్ని చాటాయి. మూడు పార్టీలు కలిస్తే ఎలాంటి విజయాన్ని ఊహిస్తారో అలాంటి విజయమే దక్కింది. ఈ ఎన్నికల్లో కూటమి విజయానికి అసలు కారణం ఐక్యంగా ముందుకు సాగడమే అని స్పష్టంగా అర్థమవుతోంది. గతంలోనూ ఈ మూడు పార్టీలు కలిసి ఉన్నప్పటికీ ఈసారి మాదిరిగా ఐక్యంగా పోరాడలేదు. ఎవరికి నచ్చిన చోట వాళ్ళు పోటీ చేశారు. కానీ ఈసారి అలా జరగలేదు. పలుమార్లు చర్చలు జరిపి ఎవరికి ఎక్కడ బలముందో అక్కడే బరిలో దిగారు. పార్టీ ఏదైనా తాము టికెట్ ఇచ్చిన వారికే సపోర్ట్ చేయాలంటూ ముందే అధినేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోరాడి విజయం సాధించారు.

టీడీపీకి పెరిగిన బాధ్యత

మున్సిపాలిటీలలో నగర పంచాయతీల చైర్ పర్సన్ స్థానాలకు సంబంధించి వచ్చిన ఫలితాలలో టీడీపీ 59 స్థానాలు, జనసేన 18 స్థానాలు బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. వైసిపి కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. మిగిలిన రెండు స్థానాల్లో స్వతంత్రులు గెలిచారు. మరోవైపు 17 చోట్ల చైర్ పర్సన్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక రెండు కార్పొరేషన్లలో జనసేన విజయం సాధించడంతో పట్టణ స్థానిక ఎన్నికల్లో కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. కూటమి పొత్తులో భాగంగా అత్యధిక స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 59 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, చైర్ పర్సన్ స్థానాలను దక్కించుకుంది. మొదటి నుండే రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉన్న టిడిపి ఎన్నికల్లో సత్తా చాటి మరోసారి తన బలాన్ని నిరూపించుకుంది. ఈ విజయంతో ఆ పార్టీ నాయకత్వం బాధ్యత మరింత పెరిగింది. కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇదే జోష్ చూపిస్తూ మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లోను సత్తా చాటే అవకాశం ఉంది.

స్థానికంగా పుంజుకుంటున్న జనసేన

మున్సిపల్ ఎన్నికల్లో జనసేన విజయంతో ఆ పార్టీ స్థానికంగా కూడా బలాన్ని పెంచుకున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో జనసేన రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో జెండా ఎగరవేసింది. తమకు కేటాయించిన చైర్ పర్సన్ స్థానాలలో పోటీ చేసి 100% స్ట్రైక్రెట్ సాధించడం గొప్ప విషయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ,ఎంపీ ఎన్నికల్లోను జనసేన 100% స్ట్రైక్ రేట్ ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా వచ్చిన ఫలితాలతో ఆ పార్టీ ప్రజల్లోకి మరింత విస్తరించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు గెలిచిన చోట మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ పార్టీని బలోపేతం చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

ఈ ఫలితాలతో బీజేపీకి మంచి అవకాశం

బీజేపీకి కూటమి పొత్తులో భాగంగా స్థానిక ఎన్నికల్లో తక్కువ సీట్లే దక్కాయి. పార్టీ బలాన్ని బట్టి సీట్లను కేటాయించడంతో పెద్దగా స్థానాలు దక్కలేదు. అయినప్పటికీ పోటీ చేసిన స్థానాల్లో మాత్రం విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ 4 మున్సిపల్ చైర్ పర్సన్ స్థానాలను దక్కించుకుంది. నిజానికి రాష్ట్రంలో బిజెపికి పెద్దగా బలం లేదని చెప్పాలి. కానీ తాజాగా వచ్చిన ఫలితాలతో పార్టీ విస్తరణకు బీజం పడింది. ఈ ఫలితాలతోనే సంతృప్తి చెందకుండా నాయకత్వాన్ని తయారుచేసుకుని ప్రజా సమస్యలపై ఫైట్ చేస్తూ ముందుకు వెళితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం ఉంటుంది. మెల్లి మెల్లిగా పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలపరుచుకునే ఛాన్స్ ఇప్పుడు బీజేపీకి ఉంది.

జగన్ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి?

వైసిపికి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో దెబ్బ పడటంతో పాటు ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలోనూ పరాజయం ఎదురైంది. కడప జిల్లా పరిషత్ లోని 39 జడ్పి స్థానాల్లో 23 స్థానాలను కూటమి ఏకగ్రీవంగా గెలుచుకోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో 27 ఏళ్ల తర్వాత కడప జడ్పీ ఫై టిడిపి ఆధిపత్యం ఏర్పడింది. వైఎస్ కుటుంబానికి రాజకీయంగా బలమైన పునాదిగా ఉన్న జిల్లాలో ఈ గెలుపుతో పరిణామాలన్నీ ఒకసారిగా మారిపోయాయి. ఎన్నికలో ఎదురైన ఈ ఓటమిని చూసి జగన్ అనేక పాఠాలు నేర్చుకోవాల్సిన అవకాశం ఉంది. ముఖ్యంగా పార్టీని మళ్ళీ సంస్థాగతంగా నిలబెట్టేల్సిన అవకాశం కచ్చితంగా ఉంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాత్రమే కాకుండా.. ప్రజల్లోకి స్థానిక సమస్యలను తీసుకెళ్లడం ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలి. జగన్ నాయకుల కంటే కార్యకర్తలకు, ప్రజలకు ఎక్కువగా దగ్గర అవ్వాలి. వైసీపీలో కోటరీ ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన కోటరీని దాటి పార్టీలో సమస్యలను ముందుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంపై చేసే విమర్శలు సైతం సొంత పార్టీకి మైనస్ అవ్వకుండా అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా ఉండేవిధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ ఇప్పటికే పాదయాత్రను ప్రకటించగా ఆ యాత్రలో ఆయన ఎంత నిజాయితీగా ఉంటారనేదే వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.