తెలుగులో నటించిన ఓ సినిమా గురించి మాట్లాడుతూ బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తను నటించిన ఓ తెలుగు సినిమాలో చాలా ఏజ్ గ్యాప్ ఉన్న హీరోతో జోడి కట్టానని రాధిక వెల్లడించారు. ఆ సినిమా మధ్యలోనే తాను చనిపోతానని ట్రోలింగ్ లోడింగ్ చేశారు. సినిమాలో సొంత మామను పెళ్లి చేసుకునే సన్నివేశాలలో నటించమన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధిక ఆప్టే చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. నిజానికి కొన్ని సౌత్ రాష్ట్రాల్లో మేనమామను, మామ వరుస అయ్యేవాళ్ళను పెళ్లి చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. నార్త్ లో ఈ కల్చర్ లేకపోవచ్చు కానీ ఇక్కడ ఇది సాధారణమే.
లెజెండ్ సినిమాపైనే రాధిక ఆప్టే కామెంట్స్
రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమా గురించే అని అందరికీ అర్థమైంది. ఈ సినిమాలో బాలయ్యకు రాధిక ఆప్టే జోడి కట్టారు. నిజానికి అప్పట్లో ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు లేవు. ఇండస్ట్రీలోకి కొత్తగా రావడంతో అవకాశాల కోసం వెతుక్కుంటూ సౌత్ లో ఛాన్స్ రావడంతో బాలయ్య పక్కన నటించారు. ఈ సినిమాతో పాటు తెలుగులో లయన్ అనే సినిమాలో కూడా రాధిక ఆప్టే నటించారు. అయితే ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇంటర్వ్యూలలో సౌత్ సినిమాలపై విమర్శలు కురిపించడం ఆమెకు కామన్ అయిపోయింది. గతంలోనూ తనను ఓ సౌత్ హీరో వేధింపులకు గురి చేశారని చెప్పింది. కానీ ఆ హీరో ఎవరో బయటపెట్టలేదు. ఇక ఇప్పుడు మరోసారి తెలుగు సినిమా గురించి ఆమె ఎద్దేవా చేస్తూ మాట్లాడటం పై ఇటు సినీ ప్రేక్షకులు, అటు అభిమానులు మండిపడుతున్నారు.
హీరోయిన్ ల తీరుపై ఎస్ కేఎన్ ఫైర్
తాజాగా ఇదే అంశంపై టాలీవుడ్ నిర్మాత ఎస్ కేఎన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హీరోయిన్లకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దక్షిణాది చిత్రాలలో పాత్రలు స్వీకరించి పనిచేసి, ఇక్కడ గుర్తింపు మరియు అవకాశాలు పొంది ఆ తర్వాత కొన్నేళ్లకు అదే పరిశ్రమలోని కథలను సంస్కృతి సాంప్రదాయాలను విమర్శించడం ఒక దురదృష్టకరమైన ధోరణిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నటుడికి అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉందని కానీ నిర్మాణాత్మక విమర్శలకు మిమ్మల్ని ఆదరించిన పరిశ్రమను పక్షపాతంతో, తక్కువగా చేసి చూడటానికి మధ్య వ్యత్యాసం ఉందని స్పష్టం చేశారు. తెలుగు సినిమాకు సొంత సాంస్కృతిక గుర్తింపు సాంప్రదాయాలు, కథ చెప్పే విలువలు ఉన్నాయని తెలిపారు. వేరే ప్రాంతానికి చెందిన వారికి అసాధారణంగా అనిపించేది మన సంస్కృతిలో పూర్తిగా సాధారణం కావచ్చు అని వ్యాఖ్యానించారు. గౌరవం ఎప్పుడూ పరస్పరం ఉండాలని అవకాశాలను ఆస్వాదించి ఆ తర్వాత వాటి వెనక ఉన్న సంస్కృతిని అగౌరవపరచడం సరికాదని చెప్పారు .నిర్మాణాత్మక విమర్శను ఎప్పుడు స్వాగతిస్తామని అయితే పక్షపాత విమర్శకు పక్షపాత వైఖరికి సాంస్కృతిక ఆధిక్యతకు ఇక్కడ చోటు లేదని హెచ్చరించారు. మిమ్మల్ని గౌరవించిన పరిశ్రమను మీరు కూడా గౌరవించాలి అంటూ ఎస్కేఎన్ హీరోయిన్లకు స్పష్టం చేశారు.
కేవలం రాధిక ఆప్టే మాత్రమే కాదు
దీంతో ఎస్కేఎన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను తెలుగు ప్రేక్షకులు అభిమానులు సమర్ధిస్తున్నారు. ఇక ప్రస్తుతం వరుస హిట్ లతో ఫామ్ లో ఉన్న నిర్మాతలలో ఎస్కేఎన్ కూడా ఒకరు. ఆయన యంగ్ టాలెంట్ ను, తెలుగు వాళ్లను ప్రోత్సహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు నార్త్ హీరోయిన్ల తీరుపై ఆయన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక ఎస్కేఎన్ వ్యాఖ్యలు కేవలం రాధిక ఆఫ్టేను మాత్రమే ఉద్దేశించి చేసినవి కాదని అర్థమవుతుంది. గతంలో కూడా కొందరు నార్త్ హీరోయిన్లు సౌత్ సినిమాలపై విమర్శలు చేశారు. మొదట అవకాశాల కోసం సౌత్‌లో నటించి ఆ తర్వాత ఇక్కడి హీరోలను, ఇక్కడి కథలను ఎద్దేవా చేసుకుంటూ ఇంటర్వ్యూలలో మాట్లాడారు. ఇప్పుడు అలాంటి హీరోయిన్లకు ఎస్ కేఎన్ గట్టి సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై ఇండస్ట్రీ నుండి ఇంకా ఎవరైనా మాట్లాడుతారా లేదా అన్నది చూడాలి.



