ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పక్క రాష్ట్రాల సీఎంలతో స్నేహంగా మెలగటం ఎంతో అవసరం. రాష్ట్రానికి ఏ ఆపద వచ్చినా.. అవసరం వచ్చినా ఆదుకునేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రాల మధ్య సరిహద్దుల సమస్యలు ఉన్నా, నీటి వివాదాలు ఉన్నా అవి పక్కనపెట్టి ముఖ్యమంత్రుల మధ్య మాత్రం స్నేహపూర్వక సంబంధాలు ఉండాలి. అలా స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉంటూ సీఎం చంద్రబాబు ఫ్రెండ్లీ సీఎంగా ప్రశంసలు అందుకుంటున్నారు.
ఏపీని వెంటాడుతున్న వరుస తుఫాన్లు
ఏపీని వరుస తుఫాన్లు ఇబ్బందు పెడుతున్న సంగతి తెలిసిందే. మొన్న వచ్చిన అర్ణబ్ తుఫాన్ కారణంగా రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ పడింది. రాష్ట్రంలో తీవ్రంగా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా కోస్తా జిల్లాలపై తుఫాన్ ఎఫెక్ట్ భారీగా పడింది. ఈ తుఫాన్ కారణంగా ప్రాణనష్టం తో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరి పంటతో సహా ఇతర పంటలు నేల రాలాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ తుఫాన్ ప్రభావం నుండి బయటపడక ముందే మళ్లీ రాష్ట్రాన్ని మురసు తుఫాన్ కలవరపెడుతోంది. ఈ తుఫాన్ ప్రభావం నుంచి ఎలా అయినా బయటపడాలి అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తుఫాన్ ల కారణంగా దెబ్బ తిన్న విద్యుత్ వ్యవస్థ
ముఖ్యంగా తుఫాన్ల కారణంగా విద్యుత్ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. విద్యుత్ పునరుద్ధరణకు ప్రభుత్వం వెంట వెంటనే చర్యలు తీసుకుంటున్నా… అవసరమైన సిబ్బంది, పరికరాలు అందుబాటులో లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది.
ఇతర రాష్ట్రాల సాయం కోరిన చంద్రబాబు
ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఇతర రాష్ట్రాల సాయం కోరుతున్నారు. అయితే సీఎం చంద్రబాబు కోరిన సహాయానికి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం సానుకూలంగా స్పందిస్తున్నారు. ఏపీలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థలకు మొదట చంద్రబాబు తమిళనాడు సీఎం విజయం సాయం కోరారు. దీంతో వెంటనే స్పందించిన విజయ్ సిబ్బందిని, అవసరమైన పరికరాలను పంపేందుకు హామీ ఇచ్చారు. మరోవైపు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ను సైతం చంద్రబాబు విద్యుత్ పునర్ధరణకు సాయం కోరారు. డీకే శివ కుమార్ సైతం వెంటనే సానుకూలంగా స్పందిస్తూ ఎక్స్ లో సైతం ట్రీట్ చేశారు. ఆ ట్వీట్ లో…. తుఫాన్ వల్ల కలిగిన విధ్వంసంతో ఏపీ పోరాడుతున్న సమయంలో ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుతో మాట్లాడి కర్ణాటక పూర్తి మద్దతు ఇస్తుందని ఆయనకు హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. తుఫాన్ కారణంగా 15కు పైగా విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ మౌలిక సదుపాయాల పునరుద్ధరణ అత్యంత కీలకమని, ఈ ప్రయత్నంలో ఏపీ కర్ణాటక సాయాన్ని కోరిందన్నారు. తమ విద్యుత్ శాఖ ఈ సహాయాన్ని సమన్వయం చేస్తుందని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ మంత్రి కే. జే జార్జ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ మద్దతుతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగం చేయడానికి, విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించడానికి వీలుగా కర్ణాటక 500 మంది నైపుణ్యం కలిగిన సిబ్బందిని, అవసరమైన పరికరాలతో పాటుగా పంపిస్తుందని స్పష్టం చేశారు. విద్యుత్ పునరుద్ధరించే ప్రదేశాలలో మానవ వనరులు పరికరాల సమృద్ధివంతమైన వినియోగాన్ని నిర్ధారించడానికి తమ బృందాలు ఏపీ అధికారులతో సమన్వయంతో పని చేస్తాయని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. అంతేకాకుండా రాబోయే మరుసు తుఫాన్ తో ఏపీకి మరో ముప్పు పొంచివుందని తెలిపారు. కాబట్టి రాబోయే రెండు రోజులు తాము పరిస్థితిని, దాని ప్రభావాన్ని అంచనా వేస్తూనే తమకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కష్ట సమయాల్లో సంఘీభావం కార్యాచరణగా మారాలని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం ఏపీ ప్రజలకు భుజం భుజం కలిపి నిలుస్తుందని తాము సాధ్యమైన అన్ని విధాలా మద్దతును అందజేస్తామని డీకే స్పష్టం చేశారు. ఇప్పుడు డీకే శివకుమార్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా ఇతర రాష్ట్రాల సీఎంలతో మంచి సంబంధాలు
నిజానికి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరోవైపు తమిళనాడులో విజయ్ టీవీకే ప్రభుత్వం అధికారంలో ఉంది. టీవీ కే ప్రస్తుతం ఇండియా కూటమికే మద్దతు ఇస్తోంది. అంటే ఇటు కాంగ్రెస్ అటు టీవీకే రెండు కూడా బిజెపికి వ్యతిరేక పార్టీలే. కానీ ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. పార్టీలు, సిద్ధాంతాలు వేరు అయినప్పటికీ ఆయన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రాల సీఎం లు కూడా కష్టం వచ్చిన వెంటనే ఆదుకునేందుకు సిద్ధం అయ్యారు.



