సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల సందడి మొదలవుతుంది. స్టార్ హీరోలు తమ సినిమాలతో రెడీ అవుతుంటారు. సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్లపై సైతం జోరుగా చర్చ జరుగుతుంది. సంక్రాంతి విన్నర్ ఈసారి ఎవరయ్యారు? అంటూ అంతా చర్చించుకుంటారు. ఇక ఈ ఏడాది కూడా సంక్రాంతికి చాలానే సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి? ఆ విశేషాలు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం….
ఈ ఏడాది సంక్రాంతి సీజన్ పై స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు కన్నేశారు. ఇప్పటికే విడుదల తేదీలను సైతం లాక్ చేశారు. దీంతో ఈ ఏడాది సంక్రాంతికి హీరోల మధ్య పోటీ ఎక్కువగానే ఉండబోతున్నట్టు కనిపిస్తోంది. ఓవైపు భారీ బడ్జెట్ చిత్రాలు మరోవైపు మిడ్ రేంజ్ చిత్రాలు పండగకు క్యూ కట్టడం ఆసక్తికరంగా మారింది. కేవలం తెలుగు నుండే కాకుండా తమిళ ఇండస్ట్రీ నుండి సైతం సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
సంక్రాంతి రిలీజ్ కు క్యూ కట్టిన సినిమాలు
ఈ ఏడాది రెండు ఇండస్ట్రీల నుండి కలిపి దాదాపు 1000 కోట్ల వరకు బాక్సాఫీస్ బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సంక్రాంతి వచ్చింది అంటే టాలీవుడ్ లో చాలా ఏళ్లుగా స్టార్ హీరోలు.. సీనియర్ హీరోల సినిమాలు కామన్ గానే విడుదలవుతాయి. ఈ ఏడాది కూడా చిరంజీవి సంక్రాంతికి రాబోతున్నారు. డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ “కాకా” సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేశారు.
మూడోసారి సంక్రాంతి బరిలో రావిపూడి
మరోవైపు గత రెండేళ్లుగా సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చే పేరు అనిల్ రావిపూడి. వరుసగా రెండేళ్లు అనిల్ రావిపూడి సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టాడు. ఇక ఈసారి కూడా ఆయన పండగపై కన్నేశాడు. తన నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడి జనవరి 12న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు సాయి దుర్గా తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా “సంబరాల ఏటిగట్టు” సైతం సంక్రాంతి పండుగకి రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు హనుమాన్ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేయాలని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భావిస్తున్నారు. వీటితోపాటు మహాకాళి సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రాలతో పాటు హీరో శర్వానంద్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. మరోవైపు ఇటీవల కాలంలో వరుస హిట్లతో వినోదాన్ని పంచుతున్న హీరో శ్రీ విష్ణు కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తన నెక్స్ట్ సినిమా ఫ్యామిలీ ప్యాక్ ను కూడా 2027 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు.
సంక్రాంతికి 1000 కోట్ల పండగ
ఇలా వరుస చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉండడంతో ఈ ఏడాది సంక్రాంతి పండగకు బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని మూవీ లవర్స్ అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ పండగకి థియేటర్ల వద్ద సంక్రాంతి జోష్ డబుల్ కానుంది. గత ఏడాది అనిల్ రావిపూడి “మన శంకర వరప్రసాద్” సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించాడు. 2025 సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సైతం సూపర్ డూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ ఏడాది కూడా అనిల్ రావిపూడి సంక్రాంతికి మెప్పిస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిరంజీవికి కూడా గతేడాది మన శంకర వరప్రసాద్ సినిమాతో హిట్ పడగా ఈ ఏడాది కాకాకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ ఎవరు అవుతారు అనేది.



