సినిమా ఇండస్ట్రీలో పోలికలు గమ్మత్తుగా ఉంటాయి. చూసేందుకు ఒకేలా ఉన్నా.. ఇద్దరి మధ్య కొన్ని పోలికలు ఉన్నా కంపేర్ చేయడం మొదలు పెడుతుంటారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, రీసెంట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గల మధ్య కూడా అలాంటి పోలిక పెడుతూ కంపేర్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా సాయి పల్లవి కంటే నాగదుర్గ బెటర్ అంటూ కంపేర్ చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం షాకింగ్ గా మారింది. దీనిపై కొందరు సాయి పల్లవి అభిమానులు ఆగ్రహం చేస్తున్నారు.
సాయి పల్లవి కెరీర్
ప్రస్తుతం సాయి పల్లవి స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. త్వరలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా రామాయణ్ లోనూ ఆమె హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా గనుక విజయం సాధిస్తే సాయి పల్లవి పాన్ ఇండియన్ హీరోయిన్ గా సైతం గుర్తింపు సంపాదించుకునే అవకాశం ఉంది. మొదటగా ఢీ అనే డాన్స్ షో ద్వారా చిన్న వయసులోనే సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే మలయాళంలో తీసిన ప్రేమమ్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులోను ప్రేమమ్ రీమేక్ లో నటించి మెప్పించారు. ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో ఛాన్స్ కొట్టారు. ఫిదా బ్లాక్ బస్టర్ అవడం సాయి పల్లవి నటనకు, డ్యాన్స్ కు ఆలాగే అందానికి ప్రేక్షకులు ఫిదా అవ్వడంతో తిరుగులేని హీరోయిన్ గా మారిపోయారు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ మలయాళ సినిమాల్లో నటిస్తున్నారు. ఓవైపు సినిమాల్లో హీరో పక్కన హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు. 2020లో ఈ బ్యూటీకి ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకటించిన “30 అండర్ 30” జాబితాలో చోటు దక్కింది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం నుండి “కలైమామని” అనే పురస్కారాన్ని అందుకుంది. ఇలా సాయి పల్లవి కెరీర్లో చాలానే అవార్డులు, ప్రశంసలు అందాయి.
నాగ దుర్గ కెరీర్
ఇక ఇటీవల ఇడుపు కాగితం సినిమాతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ నాగదుర్గ. నిజానికి నాగదుర్గ తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా అభిమానులను సంపాదించుకున్నారు. ఈమె చేసిన ఫోక్ సాంగ్స్ కి యూట్యూబ్లో మిలియన్స్ కొద్దీ వ్యూవ్స్ వచ్చాయి. దీంతో నాగదుర్గకు చాలామంది అభిమానులు అయ్యారు. నల్గొండ జిల్లాకు చెందిన నాగదుర్గ చిన్ననాటి నుండి కూచిపూడి, భరతనాట్యం లాంటివి చేస్తూ ఫోక్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. ఫోక్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం.. ప్రేక్షకులకు దగ్గర అవడంతో సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. నాగ దుర్గ ఫస్ట్ సినిమా “కలివివనం” కాగా ఈ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు సంయుక్తంగా ఇడుపు కాగితం అనే సినిమాలో నాగదుర్గను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా టైటిల్ తోనే వివాదం మొదలవగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ సినిమాకు చాలా క్రేజ్ వచ్చింది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే నాగ దుర్గకు సైతం క్రేజ్ రావడంతో పాటు ఆఫర్ లు క్యూ కడుతున్నాయి.
సాయిపల్లవితో నాగదుర్గ పోలిక ఎందుకు?
అయితే ఇప్పుడు సాయి పల్లవి నాగ దుర్గ మధ్య పోలిక పెడుతూ సాయి పల్లవిని కొందరు తక్కువ చేసి విమర్శలు చేయడం షాకింగ్ గా మారింది. నిజానికి సాయి పల్లవి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఆమె చేసిన సినిమాల్లో చాలా వరకు హిట్స్ ఉన్నాయి. ఎక్స్పోజింగ్ దూరంగా ఉంటూ కేవలం పద్ధతి గల పాత్రలలోనే నటిస్తూ పక్కింటి అమ్మాయిలా ప్రేక్షకులను అలరిస్తోంది. అటు నటనలోనూ ఇటు డాన్స్ లోనూ మెప్పిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఇప్పుడు కొందరు అందం, డ్యాన్స్ లో సాయి పల్లవిని తక్కువ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇద్దరూ ఒకేలా ఉన్నారు.. టాలెంట్ కూడా ఒకేలా ఉంది అనటంలో తప్పులేదు. కానీ ఇప్పటికే సక్సెస్ అయ్యి బిజీగా ఉన్నా నటిపై ట్రోలింగ్ చేయడం ఆసక్తికరం. అయితే దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయి. సాయి పల్లవి డేట్స్ సర్దుబాటు కాకపోవడం, తన పాత్రకు ఇంపార్టెన్స్ లేకపోవడం కారణంతో కొన్ని సినిమాలను నేరుగా రిజెక్ట్ చేశారు. స్టార్ హీరోల సినిమా అయినా తనకు నచ్చకపోతే రిజెక్ట్ చేస్తుంటారు. దీంతో ఆ హీరోల అభిమానులు సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు సాయి పల్లవి పలు సందర్భాల్లో తనకు రావణుడిపై ఉన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటీవల రామాయణం ప్రమోషన్స్ లోనూ అలాంటి కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కూడా వాదాస్పదంగా మారాయి. దీంతో సాయి పల్లవి హిందుత్వానికి వ్యతిరేకం అంటూ కొందరు కావాలనే ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పోలిక పెడుతూ సాయి పల్లవిని తక్కువ చూపే ప్రయత్నం కూడా చేస్తున్నారు.



