సెలబ్రెటీలతో రాజకీయ నాయకులు, పార్టీలు సత్సంబంధాలను కొనసాగిస్తూ ఉంటాయి. ఎందుకంటే సెలబ్రిటీలను అభిమానించే వాళ్ళు సైతం లక్షల మంది ఉంటారు. కొందరు హీరోలకు అయితే అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ ఉంటారు. హీరోలు చెబితే ఫ్యాన్స్ కూడా వింటారు కాబట్టి రాజకీయ పార్టీలు ఎప్పుడూ సెలబ్రిటీలతో స్నేహపూర్వకంగానే ఉంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు కలుస్తుంటారు కూడా. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి ఆయన కుమారుడు రామ్ చరణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.

బిజీ షెడ్యూల్ లో అమిత్ షాతో చిరంజీవి, చరణ్ భేటీ

అమిత్ షా పాదయాత్ర చేసేందుకు హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్లోని ఐటిసి హోటల్లో బస చేశారు. కాగా అమిత్ షా బస్ చేసిన హోటల్ వెళ్లి చిరంజీవి, రామ్ చరణ్ ఆయనను కలిసి కాసేపు సమయం గడిపారు. అమిత్ షాను శాలువాతో సత్కరించి.. ప్రత్యేక జ్ఞాపికను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తెలంగాణ రాజకీయాల్లో చిరంజీవి రామ్ చరణ్ అమిత్ షా తో భేటీ కావడం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి అమిత్ షా హైదరాబాద్ షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉంది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడ నుండి నేరుగా చార్మినార్ వెళ్లి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత పాదయాత్రలో పాల్గొన్నారు. మరోవైపు బీజేపీ నేతలతో ఐటీసీ హోటల్లో సమావేశమై రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పై చర్చించారు. ఇంతటి బిజీ షెడ్యూల్ లో అమిత్ షా చిరంజీవి, రామ్ చరణ్ లను కలవడమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్ పర్యటనలో అమిత్ షా కీలక ప్రకటన

అమిత్ షా తన పర్యటనలో భాగంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి జెండాను ఎగరవేస్తామని ప్రకటించారు. అయితే గతంలోనూ ఎన్నికల సమయంలో బిజెపి నాయకులు పలు రాష్ట్రాల సెలబ్రిటీలతో భేటీ అయ్యారు. బిజెపికి మద్దతు తెలపాలని కోరారు. చిరంజీవి, రామ్ చరణ్ తో అమిత్ షా భేటీ కూడా వచ్చే ఎన్నికల్లో సపోర్ట్ కోసమే అంటూ ప్రచారం జరుగుతోంది.

గతంలో చిరు కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తారా?

చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ చీఫ్ గా ఉండగా… ఏపీలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంది. బిజెపి కోసం పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాల్లో సైతం పర్యటిస్తూ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఇక ఇప్పుడు అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవ్వడంతో రాష్ట్రంలో వారి మద్దతు కూడా కోరేందుకే ఈ భేటీ జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే నిజానికి చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి రాజ్యసభకు సైతం వెళ్లారు. దీంతో చిరు కాంగ్రెస్ వాది అనే పేరు ఉంది. కాబట్టి ఒకవేళ అమిత్ షా రాష్ట్రంలో పార్టీకి మద్దతు కోరి ఉంటే చిరంజీవి సపోర్ట్ ఇస్తారా? లేదా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇది సాధారణ భేటీనే అని చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులు అంటున్నారు. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా కూడా అమిత్ షాతో రామ్ చరణ్, చిరంజీవి భేటీ అయ్యారు. ఆ సమయంలో అమిత్ షా రామ్ చరణ్ ను పిలిపించుకుని మరీ అభినందనలు తెలిపారు. దీంతో తాజాగా జరిగిన భేటీ కూడా స్నేహ పూర్వక భేటీ మాత్రమే అని చెబుతున్నారు. మరి ఈ భేటీ ఏదైనా రాజకీయ కోణంలో జరిగిందా? లేదంటే స్నేహపూర్వక భేటీ నేనా? అనేది ముందు ముందు తేలనుంది.