టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గత కొంతకాలంగా సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గ్యాప్ లేకుండా ప్రతి సినిమాలో కనిపించే ప్రకాష్ రాజ్ ఈ మధ్య మాత్రం స్క్రీన్ పై అసలు కనిపించడం లేదు. ఏడాదికి ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నారు. సినిమాల్లో స్క్రీన్ పై కనిపించకపోయినప్పటికీ తరచూ వార్తలో మాత్రం నిలుస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన బిజెపి నిరసనల సమయం నుండి ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఆయన వార్తల్లో ఉంటున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ సీజేపీ చేసిన నిరసనకు మద్దతు ఇస్తూ ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లి వారిని కలిశారు.

సీజేపే నిరసనలో పాల్గొన్న ప్రకాష్ రాజ్

నిరసనలో ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు సోషల్ మీడియాలో వీడియోలు చేశారు. మరోవైపు ఇటీవల ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి అంటూ సైతం ప్రకాష్ రాజ్ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. సీజేపీతో కలిసి ప్రొటెస్టులో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ప్రకాష్ రాజ్ తను సెక్యులర్ అని చెబుతూ బిజెపి విధానాలను, సిద్ధాంతాలను చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో బీజేపీ నేతలు సైతం ప్రకాష్ రాజ్ ను టార్గెట్ గా చేస్తూ విమర్శలు కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పలుమార్లు బిజెపి నేతలు కార్యకర్తలు ప్రకాష్ రాజ్ కు వార్నింగులు కూడా ఇచ్చారు.

ప్రకాష్ రాజ్ భార్య సంచనల వ్యాఖ్యలు

అయితే ఇప్పుడు ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడంపై ఆయన భార్య, కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రకాష్ రాజ్ ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాతే ఆయనకు అవకాశాలు తగ్గాయని ఆవేదన వ్యక్తం చేసింది. జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య తర్వాతనే ప్రకాష్ ఆలోచన విధానంలో పెను మార్పులు వచ్చాయని ఆమె తెలిపింది. మొదట్లో తన భర్త ప్రశ్నించడంతో ఆందోళన చెందినట్టు చెప్పింది.

గౌరీ లంకేష్ హత్య తరవాత ప్రకాష్ రాజ్ ఆలోచనలో మార్పు

గౌరీ లంకేష్ హత్య ప్రకాష్ రాజ్ ను మానసికంగా ఎంతో కృంగదీసిందని వెల్లడించింది. ఈ ఘటనకు ముందు ఆయన భయపడినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆయనలో ధైర్యం వచ్చిందని చెప్పింది. ఒక మహిళగా గౌరీ లంకేష్ ప్రాణాలకు తెగించి పోరాటం చేసినప్పుడు.. తాను కూడా మాట్లాడాలని ప్రకాష్ రాజ్ నిర్ణయించుకున్నట్టు చెప్పింది. ప్రకాష్ రాజ్ అలా ప్రశ్నించడం వల్ల వృత్తిపరంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఆయన రాజకీయ అభిప్రాయాల కారణంగా కొంతమంది నిర్మాతలు చేతులకు అడ్వాన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత సినిమాలను క్యాన్సిల్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాలే కాకుండా కొన్ని యాడ్స్ ప్రమోషన్స్ కూడా చేతికి వచ్చి ఆ తర్వాత చేజారిపోయాయని తెలిపింది. అయినప్పటికీ ప్రకాష్ రాజ్ తన అంతరాత్మ చెప్పినట్టుగానే నడుచుకుంటున్నారని, తప్పును అంగీకరించబోరని తెలిపింది. దేశంలో ప్రాథమిక సౌకర్యాలు మెరుగుపడాలని మాత్రమే ఆయన కోరుకుంటున్నారని, ప్రజల భవిష్యత్తు కోసమే ఆయన ఈ పోరాటం చేస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం పోనీ వర్మ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. కేంద్రంలో ఉన్న బీజేపీని ప్రశ్నించడం వల్లే ప్రకాష్ రాజ్ కు అవకాశాలు తగ్గాయా? అనే చర్చ మొదలైంది.

ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల పైనా విమర్శలు

నిజానికి ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల పైన కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబుపై గతంలో ప్రకాష్ రాజు విమర్శలు చేశారు. మా ఎన్నికల సమయంలో మంచు విష్ణుకు వ్యతిరేకంగా బరిలో నిలిచి వార్తల్లో నిలిచారు. ఇలా కొంతవరకు ప్రకాష్ రాజ్ కు చిత్ర పరిశ్రమలో సైతం వ్యతిరేకత వచ్చినట్టు కనిపిస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీపై విమర్శలు చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నిర్మాతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఆయనకు అవకాశాలు తగ్గాయని టాక్ ఉంది. మరి ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుండటంతో ఇప్పటికైనా వెనక్కి తగ్గుతారా? లేదా నచ్చిందే చేస్తారా? అన్నది చూడాలి.