తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్ నినో గండం తప్పదా? కరువు వస్తే ఆ ప్రభావం ప్రస్తుత ప్రభుత్వంపై కూడా పడనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి గ్రౌండ్ లో. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కరువులు, ఇతర విపత్తులు రావడం అనేది సర్వసాధారణం. ఏది వచ్చినా అది ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆ విపత్తును సరిగ్గా ఎదుర్కోలేకపోతే ఆ ప్రభావం అధికారంలో ఉన్న పార్టీ పై సైతం పడుతుంది.

కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ brs ప్రచారం

ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అదే ముప్పు పొంచి ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కేవలం తెలంగాణలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎల్ నినో ముప్పు పొంచి ఉన్న సంగతి తెలిసిందే. లోటు వర్షపాతం కారణంగా ఎల్ నినో వల్ల కరువు తప్పదనే ఇప్పటికే వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అయితే ఈ కరువును సరిగ్గా ఎదుర్కోలేకపోతే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. నీటి కొరత కారణంగా అన్ని ఆహార పదార్థాల ధరలు, నిత్యావసరాల ధరలు పెరగడంతో పాటు నీటిని కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది.

తెలంగాణలో లోటు వర్షపాతం

ఎల్ నినో ప్రభావంతో 2026 నైరుతి రుతుపవనాల కాలంలో రాష్ట్రంలో 17% లోటు వర్షపాతం కనిపించింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వల సామర్థ్యం 20% కంటే తక్కువకు చేరుకున్నాయి. కొన్ని ప్రాజెక్టులు అయితే పూర్తిగా అడుగంటిపోయాయి. ఇంకా రాష్ట్రంలో వర్షాకాలం పూర్తవ్వలేదు… ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుంది అన్న ఆందోళన ప్రజల్లో మొదలైంది. రాష్ట్రంలో వర్షాధార పంటలైన వరి పంటను పండించవద్దని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసింది రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీంతో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 25 కేజీల బియ్యం ధర 3000 వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ జోరుగా ప్రచారం చేస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలేశ్వరం నీళ్లు ఎత్తుకుపోవడం వల్లనే ఈ కరువు వచ్చిందని ఆరోపణలు చేస్తుంది. అయితే రేవంత్ సర్కార్ మాత్రం కాలేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు కుంగిపోయాయని, నీటిని ఎత్తిపోస్తే ప్రాజెక్టు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెబుతోంది. ఎవరి మాట నమ్మాలో… నమ్మకూడదో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు.

ఎల్ నినోను సమర్థవంతంగా ఎదుర్కొంటారా?

కాంగ్రెస్ ప్రభుత్వం ఇది బీఆర్ ఎస్ పాలకులు గతంలో చేసిన వైఫల్యాల వల్ల వచ్చిన కరువు అని చెబుతుంటే… బీఆర్ఎస్ నాయకులు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనం వల్ల వచ్చిన కరువు అని చెబుతున్నారు. ఈ క్రమంలో కరువును సరిగ్గా ఎదుర్కోకపోతే రేవంత్ ప్రభుత్వానికి గండం తప్పదనే చెప్పాలి. ఇప్పటికే రేవంత్ సర్కార్ కరువును ఎదుర్కునేందుకు 8 నెలల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఎల్ నినో పై వరుస సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు, రైతులకు పలు సూచనలు చేస్తోంది. హైదరాబాద్ లో అయితే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఇప్పటికే హెచ్చరికలు సైతం జారీ చేసింది. నీటిని ఇతర మార్గాల ద్వారా అందించినప్పటికీ ఇబ్బందులు తప్పవని కూడా చెబుతోంది. అయితే ఏది ఏమైనా కరువు సమయంలో ధరల పెరుగుదల భారీగా ఉండి, నీటిని అందించలేక పోతే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పడుతుంది. మరి రాబోయే ఎల్ నినోను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.