బీహార్ అంటే క్రైమ్ దొంగతనాలు, హత్యలు, వలస జీవితాలు… ఇవే గుర్తొస్తాయి. ఏ రాష్ట్రంలో చూసినా బీహార్ నుండి వలస వచ్చిన కూలీలు, కార్మికులే కనిపిస్తూ ఉంటారు. అలాంటి దీనస్థితి నుండి బీహార్ బయటపడాలి అంటే ముందుగా అక్కడి రాజకీయాల్లో మార్పు రావాలి. నాయకులు మారితే ప్రభుత్వాలు మారుతాయి… పాలన విధానం మారితే సంక్షేమ పథకాలు అందడంతో పాటు అభివృద్ధి వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీహార్ రాజకీయాలు ఆ దిశగా మారుతున్నట్టు కనిపిస్తున్నాయి.
బీహార్ ను సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీ
బీహార్ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఆ తర్వాత అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉన్నారు. ఆయన తన ప్రాంతీయ పార్టీ జనతా తరఫున బీజేపీ మరియు ఆర్జెడి కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ రెండు దశాబ్దాల నుండి బీహార్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. మరోవైపు 1990 నుండి 2025 వరకు లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ బీహార్ ను పాలించింది. అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో పెద్దగా మార్పు కనిపించలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. బీహార్లో జనసాంద్రత ఎక్కువగా ఉండటం, కుల రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు బీహార్ ను ఈ స్థితిలోకి నెట్టివేశాయి. అయితే ఇటీవల వస్తున్న ఎన్నికల ఫలితాలు చూస్తుంటే బీహార్ ప్రజలు మరో కొత్త పార్టీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.
బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ప్రశాంత్ కిషోర్
ముఖ్యంగా బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. తొలిసారి బీహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బలాన్ని నిరూపించుకున్నారు. బీహార్ శాసనమండలి ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ “జన్ సూరజ్ పార్టీ” అభ్యర్థి సురేష్ ప్రసాద్ రాయ్ విజయం సాధించారు. ఈ స్థానం సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వస్తోంది. మాజీ పీసీసీ చీఫ్, సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ మదన్మోహన్ జా ఈ స్థానం నుండి బరిలో దిగగా ఆయనను సురేష్ ప్రసాద్ రాయ్ ఓడించడం ఆసక్తికరంగా మారింది.
శాసన మండలిలో అడుగుపెట్టిన ప్రశాంత్ కిషోర్ పార్టీ
ఈ గెలుపుతో శాసనమండలిలోనూ ప్రశాంత్ కిషోర్ పార్టీ అడుగు పెట్టింది. దీంతో బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ కీలకంగా మారుతుందని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ పార్టీ గెలవడానికి కారణం జేడీయూతో పాటు మహాగట్ బంధన్ కూటమిపై విద్యావంతులు ఉపాధ్యాయ వర్గాల్లో ఏర్పడిన తీవ్ర అసంతృప్తి అని చర్చ జరుగుతోంది. నితీష్ కుమార్ జేడీయూ అభ్యర్థి గణేష్ శ్యామ్ రాయ్ ఈ ఎన్నికల్లో కేవలం 862 ఓట్లతో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. మరోవైపు ప్రతిపక్ష కూటమిలో ఉన్న కాంగ్రెస్, సీపీఎం, ఆర్జెడి వేరు వేరుగా బరిలో దిగడంతో ఓట్లు చిలాయి.
రెండేళ్ల నుండి ప్రజల్లోనే
మరోవైపు గత రెండేళ్లుగా ప్రశాంత్ కిషోర్ బీహార్ లో గ్రౌండ్ లెవెల్ లో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లోను ప్రజలు పట్టం కట్టినట్టు కనిస్తోంది. మొదటిసారి బీహార్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ కు చేదు అనుభవం ఎదురైంది. బరిలో దిగిన మొదటి సారి భారీ అంచనాలు నెలకొనగా ఆయన ఓటమి పాలయ్యారు. కానీ వెనక్కి తగ్గకుండా మరోసారి ఎమ్మెల్యే రేసులో నిలిచి విజయం సాధించారు. దీంతో జన్ సురాజ్ పార్టీ పేరు రాష్ట్రంలో మార్మోగిపోయింది. విద్య, యువతకు ఉపాధి ఎజెండాతో మధ్యతరగతి యువత, విద్యావంతులైన ఓటర్లను ఆకర్షించడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే గ్రాడ్యుయెట్, టీచర్ లాంటి చైతన్యవంతమైన ఓట్లు వేసే ఎన్నికల్లోను విజయం సాధించారు. గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ప్రశాంత్ కిషోర్ వైపు నిలిచారు అంటే రాబోయే రోజుల్లో ఆయన పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. చూడాలి మరి బీహార్ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పుతారా? అప్పటివరకు రాజకీయ సమీకరణాలు మారుతాయా అనేది.



