ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా రాప్తాడులో పదవ తరగతి బాలికపై ఓ యువకుడు చెట్లు కట్ చేసే మిషన్ తో దాడి చేశాడు. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. మరోవైపు యువకుడు దాడి చేసింది కూడా ఎక్కడో రోడ్డుపైన లేదా నిర్మానుష్య ప్రదేశంలో కాదు. నేరుగా బాలిక చదువుతున్న ప్రభుత్వ పాఠశాలకు వచ్చి యువకుడు ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
రాష్ట్రంలో దారుణ ఘటన
ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతో జరిగిన కొద్దిసేపటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు. అయితే ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఒక స్కూల్ బాలికపై యువకుడు నేరుగా స్కూల్ కు వచ్చి దాడి చేయడంతో అంతా ఈ దారుణం గురించే చర్చించుకుంటున్నారు. స్కూళ్లలో, కాలేజీలలో అమ్మాయిల భద్రతపై సైతం ఆందోళన నెలకొంది. అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలకు శిక్షపడేలా కఠిన చట్టాలు అమలు చేసినా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరంగా మారింది. కొన్ని నెలల క్రితం కాకినాడ జిల్లా తునిలో ఓ 60 ఏళ్ల వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారం చేయడం కూడా రాష్ట్రంలో సంచలనగా మారింది. బాలికను హాస్టల్ నుండి తీసుకువెళ్లిన వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడగా ఓ స్థానికుడు ప్రశ్నించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడుని అదుపులోకి తీసుకోగా ఆ తర్వాత అనుమానాస్పద స్థితిలో మరణించాడు. రాష్ట్రంలో ఘటనే కాకుండా ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి.
సాయి ధరమ్ తేజ్ ను ప్రశ్నిస్తున్న నెటిజన్లు
అమ్మాయిలపై దాడులు, అత్యాచార ఘటనలు ఇలా అనేకం చోటు చేసుకుంటున్నాయి. అయితే గత ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు జరిగిన సమయంలో జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగింది అంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు సైతం రాష్ట్రంలో అలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీంతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అప్పుడు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఏ దారుణం జరిగినా టాలీవుడ్ నటుడు సాయిధరమ్ తేజ్ ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. దానికి కారణం ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత… ఏపీ ఇప్పుడు సేఫ్ హాండ్స్ లో ఉంది. అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేయడమే. ఈ ట్వీట్ కారణంగానే ఆయనపై వైసీపీ శ్రేణులు ఇప్పుడు మండిపడుతున్నారు. రాష్ట్రం సేఫ్ హ్యాండ్ లో ఉంది అన్న హీరో ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ దారుణాలు ఆగేది ఎప్పుడు అని అడుగుతున్నారు.
అమ్మాయిలపై దారుణాలు ఆగాలంటే
అయితే నిజానికి రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గాలంటే కేవలం ప్రభుత్వాలు మారితే సరిపోదనే చెప్పాలి. ప్రజల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలను భయంతో పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రభుత్వాలు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం కూడా ఉంది. మరోవైపు చట్టాలను మరింత కఠినం చేయాల్సిన అవసరం కూడా ఉంది. నిజానికి గతంలో కంటే ఇప్పుడు చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. మైనర్ బాలికల వైపు చూస్తే పోక్సో లాంటి కఠిన చట్టాలను అమలు చేసి జైలుకు పంపిస్తున్నారు. ఆ తర్వాత జీవితమే నాశనం అవుతుంది. అయితే చట్టాలపై కూడా చాలామందికి అవగాహన లేదు. కాబట్టి వీటి గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. తప్పు చేయాలి అంటే దుర్మార్గులు వారికి వేసే శిక్ష గురించి భయపడాలి. అప్పుడే మార్పు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో దారుణాలు తగ్గే అవకాశం కూడా ఉంది.



