తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జనసేన పొత్తు ఆసక్తికరంగా మారింది. ఏపీలో టిడిపి, బిజెపి, జనసేన కలిసి గత ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోనూ బిజెపి, జనసేన స్నేహపూర్వకంగానే ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఉండదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఈ చర్చ ఇప్పుడు మొదలైంది కాదు 2020 నుండే రెండు పార్టీల మధ్య ఏ ఎన్నికలు వచ్చినా ప్రతిసారి చర్చలు జరుగుతుంటాయి.
2020 GHMC ఎన్నికల్లో జనసేన సపోర్ట్
2020 లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో మొదట జనసేన కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. నామినేషన్లు కూడా వేసింది. అయితే ఆ తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి బీజేపీ ముఖ్యనేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు. చర్చల తర్వాత జనసేన నామినేషన్లను విత్ డ్రా చేసుకుని బిజెపికి మద్దతు తెలిపింది. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడంతో కనీసం 10% వార్డుల్లో పోటీచేయాలనే నిబంధనను నెరవేర్చలేక తెలంగాణలో తన ఉమ్మడి గాజు గ్లాస్ గుర్తును కూడా తాత్కాలికంగా కోల్పోవాల్సి వచ్చింది.
2023 ఎన్నికల్లో కలిసి బరిలోకి
ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బిజెపి కలిసి పోటీ చేశాయి. ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు బిజెపి 9 అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. మిగతా స్థానాల్లో బిజెపి అభ్యర్థులు బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో జనసేన కుకట్ పల్లె, కొత్తగూడెం, ఖమ్మం, వైరా, అశ్వరావుపేట, పాల్వంచ, నాగర్ కర్నూల్, సూర్యాపేట, కోదాడ లాంటి స్థానాలలో పోటీ చేసినప్పటికీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ప్రచారం చేశారు. జనసేన తో పాటు బిజెపి అభ్యర్థుల తరఫున సైతం పవన్ కళ్యాణ్ ప్రచార సభల్లో పాల్గొన్నారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది.
మరోసారి పొత్తులపై చర్చలు
ఇక తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఉండదా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే తెలంగాణ బిజెపి నేతలు మాత్రం జనసేనతో పొత్తువద్దనే అధిష్టానానికి విన్నవించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బిజెపి రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్ సహ ఇన్ చార్జీలు రేఖా శర్మ, అభయ్ పాటిల్ రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై ప్రధానంగా చర్చించినట్టు వార్తలు వచ్చాయి. అయితే తెలంగాణ బిజెపి ముఖ్య నేతలు జనసేనతో పొత్తు వద్దనే సునీల్ బన్సల్ కు చెప్పినట్టు తెలుస్తోంది. జనసేన పట్ల రాష్ట్రంలో వ్యతిరేకత ఉందని, ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు ఉంటే నష్టమేనని తేల్చి చెప్పినట్టు సమాచారం. జనసేనతో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని…. బిజెపి కూడా తెలంగాణ వ్యతిరేక అనే ముద్ర వేసి ప్రచారం చేసే ప్రమాదం ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. సున్నితమైన ఈ అంశంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, హిందుత్వకు బిజెపి బ్రాండ్ గా ఉందని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ హిందుత్వం గురించి ప్రచారం చేస్తే పెద్దగా ప్రయోజనం కూడా ఉండదని చెప్పినట్టు సమాచారం. మరో వైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఇక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయి? అనే అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పినట్టు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న కారణంగా ఇక్కడ జనసేన ను గౌరవిద్దామని పరోక్షంగా వారి మద్దతు తీసుకుందాం కానీ పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో పార్టీకి నష్టం కలుగుతుందని కొందరు నేతలు సూచించినట్లు తెలుస్తోంది. కానీ నిర్ణయం మాత్రం బిజెపి అధిష్టానానికే వదిలేసినట్టు సమాచారం. మరోవైపు ఇప్పటికే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి గడల శ్రీనివాస్ బరిలో దిగుతానని జనసేన ఇప్పటికే ప్రకటించింది. అయితే కావాలంటే గడల శ్రీనివాస్ బిజెపిలో చేరితే ఆయనకు టికెట్ ఇవ్వడంపై ఆలోచన చేయాలని కూడా సూచించినట్టు సమాచారం.
భవిష్యత్ లోనూ పొత్తు లేనట్టే
దీంతో తెలంగాణలో బిజెపి జనసేన పొత్తుపై ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ పార్టీల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తులేకుంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో పొత్తుల కారణంగా జనసేన నష్టపోతుంది అనే ఆలోచనలో జనసైనికులు కార్యకర్తలు ఉన్నారు. దీంతో తెలంగాణలో పొత్తులు లేకపోవడమే మంచిది అని వాళ్ళు సైతం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఫ్యూచర్ లోను జనసేన బిజెపి మధ్య పొత్తులు ఉండే అవకాశం లేదు.



