తెలంగాణ కాంగ్రెస్ లో నేతల మధ్య రోజుకో పంచాయితీ జరుగుతోంది. జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య ఏదో ఒక విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీలో ఓ సీనియర్ మంత్రి, జూనియర్ ఎమ్మెల్యే ఏకంగా కొట్టుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ “ఓట్ చోరీ” వ్యతిరేక సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నిరసన సభ కోసం తెలంగాణ నాయకులు సైతం వెళ్లారు. ఈ క్రమంలో ఓ జూనియర్ ఎమ్మెల్యే బసచేసిన హోటల్లోనే ఆ జిల్లాకు చెందిన మంత్రి సైతం బస చేశారు. ఈ క్రమంలో సీనియర్ మంత్రి ఎమ్మెల్యే పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతులతో రెచ్చిపోయినట్టు సమాచారం. ఈ పరిణామాలతో అక్కడ ఉన్న నాయకులు ఇతర ఎమ్మెల్యేలు షాక్ అయినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే వ్యవహార శైలిపై మంత్రి అసంతృప్తితో ఉన్నారట. దీంతో ఢిల్లీలో ఎదురుపడగానే ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి రాష్ట్రంలో సీఎం తరవాత హోదా

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత స్థాయి హోదాను అనుభవించిన ఆ మంత్రి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖలో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ ఆయన సీనియర్ నాయకుడిగా ఉన్నారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే మంత్రిని ఇబ్బంది పెడుతున్నట్టు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జిల్లా అధ్యక్ష పదవిని తన సన్నిహితుడికి కట్ట పెట్టాలని మంత్రి ఆలోచించగా ఎమ్మెల్యే అడ్డు పడినట్టు కూడా తెలుస్తోంది.

ఎమ్మెల్యేకు ఏఐసీసీ నేత కుమారుడితో సంబంధాలు

సదరు ఎమ్మెల్యేకు ఏఐసీసీ కీలక నేత కుమారుడితో సత్సంబంధాలు ఉండటంతో పదవుల విషయంలో మంత్రి ఎమ్మెల్యే మధ్య వివాదాలు చలరేగినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక త్వరలో రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ మూడు స్థానాల్లో ఒకటి బీసీ వర్గానికి కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని మంత్రికి వ్యతిరేకంగా ఉన్న వర్గానికి చెందిన ఓ నాయకుడికి ఇప్పించేందుకు జూనియర్ ఎమ్మెల్యే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా జిల్లాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు జూనియర్ ఎమ్మెల్యే దీనికోసం ఎఐసిసి లోని కీలక నేత కుమారుడి ద్వారా లాబీయింగ్ చేసినట్టు కూడా సమాచారం.

ఎమ్మెల్సీ టికెట్ కోసం లాబీయింగ్

కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ ఆశావాహుడికి ఏఐసీసీ కీలక నేత అపాయింట్మెంట్ ఇప్పించి, ఎమ్మెల్సీగా ఛాన్స్ కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో సీనియర్ మంత్రి మరింత ఆగ్రహానికి గురైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఎదురుపడినప్పుడు మంత్రి బూతులతో రెచ్చిపోయినట్టు సమాచారం. మరోవైపు ఇద్దరి మధ్య ఇసుక వ్యాపార వ్యవహారానికి సంబంధించి కూడా విభేదాలు ఉన్నట్టు సమాచారం. ఇరువురి నియోజకవర్గాలు పక్కపక్కనే ఉండడంతో ఇసుక వ్యాపారంలోను వీరిద్దరి మధ్య పడటం లేదని జిల్లాలో చర్చ జరుగుతుంది. సీనియర్ మంత్రి తనను దూషించడంపై ఎమ్మెల్యే ఇప్పటికే పీసీసీకి కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో పీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ లో కొందరు నేతల అసంతృప్తులు పార్టీకి నష్టం కలిగేలా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు నేతల మధ్య కొట్లాటలు కూడా పార్టీకి తలనొప్పిగా మారాయి. త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. అ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరోవైపు ఖైరతాబాద్ లోనూ బై ఎలక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పార్టీలో నెలకొన్న విభేదాలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అని కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానుల్లో ఆందోళన మొదలైంది.