దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న కుంభ పాత్ర గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
పురాణాలతో సంబంధం ఉన్న కథ
రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాలో భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ అంశాలను కలిపి చూపించబోతున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, సినిమా గురించి వెల్లడైన వివరాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా రామాయణ యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది. మరోవైపు రావణుడి సోదరుడైన కుంభకర్ణుడి కథకు, పృథ్వీరాజ్ పోషిస్తున్న కుంభ పాత్రకు సంబంధం ఉండొచ్చనే ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
కుంభ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?
ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన ఆయన ఫస్ట్ లుక్‌లో వీల్‌చైర్‌లో కూర్చుని, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రత్యేకమైన చేతులతో కనిపించడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఆయన పాత్రను అత్యంత శక్తిమంతమైన, క్రూరమైన వ్యక్తిగా పరిచయం చేశారు.
సినిమా గురించి ప్రచారంలో ఉన్న కొన్ని కథనాల ప్రకారం కుంభ పాత్రకు రామాయణంలోని కుంభకర్ణుడితో సంబంధం ఉండవచ్చనే చర్చ జరుగుతోంది. అంతేకాదు, గత జన్మలు, పురాణ రహస్యాలు, అసాధారణ శక్తులు వంటి అంశాలు కూడా కథలో భాగమవుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కుంభ పాత్రకు కుంభకర్ణుడితో ఉన్న అసలు సంబంధం ఏమిటన్నది చిత్రబృందం అధికారికంగా వెల్లడించలేదు.
మహేష్ బాబుకు కుంభ ఇచ్చే బాధ్యత ఏమిటి?
ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఒక పురావస్తు అన్వేషకుడిగా, సాహసికుడిగా పరిచయం కానున్నారు. 2027లో శంభవి అనే భారీ గ్రహశకలం వారణాసి నగరాన్ని ఢీకొట్టే ప్రమాదం ఏర్పడుతుందని, ఆ విపత్తును అడ్డుకోవడానికి రుద్ర ఒక పురాతన విశ్వశక్తికి సంబంధించిన వస్తువును వెతికే ప్రయాణం ప్రారంభిస్తాడని పెద్ద ఎత్తున టాలీవుడ్ సర్కిల్లో వార్త వైరల్ అవుతుంది.
ఈ ప్రయాణంలో ఆఫ్రికా అడవులు, అంటార్కిటికాలోని మంచు ప్రాంతాలు, యూరప్‌లోని విభిన్న ప్రదేశాలు కీలకంగా కనిపించనున్నాయి. ఈ అన్వేషణలో రుద్రకు కుంభ నుంచి ఎదురయ్యే సవాళ్లు కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చనున్నట్లు తెలుస్తోంది.
కథలో ప్రియాంక పాత్ర కూడా కీలకమే!
ఇందులో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో నటిస్తున్నారు. ఆమె ఒక చరిత్రకారిణిగా, నైపుణ్యం కలిగిన షూటర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రుద్ర ప్రయాణంలో ఆమె పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం.
మరోవైపు రాజమౌళి ఈ కథలో తండ్రి, కొడుకుల మధ్య ఉండే భావోద్వేగ బంధంతో పాటు ప్రేమకథకు కూడా ప్రాధాన్యత ఉంటుందని గతంలో వెల్లడించారు. దీంతో ఈ సినిమా కేవలం యాక్షన్, పురాణాలకే పరిమితం కాకుండా బలమైన భావోద్వేగాలతో సాగనుందని అర్థమవుతోంది.
ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల!
ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. భారీ సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు.
మొత్తానికి కుంభ పాత్రకు రామాయణంతో ఉన్న సంబంధం ఏమిటి? కుంభకర్ణుడి కథకు ఈ పాత్రకు ఏమైనా లింక్ ఉందా? రుద్ర ప్రయాణం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. రాజమౌళి తనదైన విజువల్ వండర్‌తో మరోసారి ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటివరకు అపజయం ఎరుగని రాజమౌళి రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందనేది తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.



