మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఆర్సీ 17. ఇటీవలే ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని అఫీషియల్ గా ప్రారంభించారు. ఇప్పటికే రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రంగస్థలం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిగెలిచింది. రామ్ చరణ్ కెరీర్ చూస్తే రంగస్థలానికి ముందు ఆ తర్వాత అని చెప్పుకునే స్థాయిలో ఈ సినిమాకు గుర్తింపు వచ్చింది. దానికి కారణం సినిమాలో రామ్ చరణ్ నటన ఒకటి అయితే సినిమాలో కథ స్క్రీన్ ప్లే ఊహించని విధంగా తీయడం మరో కారణం.

కొత్త రామ్ చరణ్ ను చూపించిన సుకుమార్

ఈ చిత్రంతో సుకుమార్ మరో కొత్త రామ్ చరణ్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు సుకుమార్ వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన పుష్ప సినిమా తర్వాత సుకుమార్ క్రేజ్ బాలీవుడ్, కోలీవుడ్ కు సైతం పాకిపోయింది. పుష్ప రెండు పార్టులుగా తీయగా రెండు పార్ట్ లు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. సెకండ్ పార్ట్ కి బాలీవుడ్ ప్రేక్షకులు మరింత ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. అలాంటి సినిమా తర్వాత మళ్లీ సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సినిమా గురించి ఆసక్తికర వార్తలు

ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పలు ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తారని టాక్ ఉంది. అంతే కాకుండా ఈ సినిమాకు కూడా సుకుమార్ లక్కీ కాంబినేషన్ గా చెప్పుకునే దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా కథపై కూడా కొన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని ఒక మైథాలజీ డ్రామా లేదా ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ డ్రామా తో కూడిన కథతో తెరకెక్కించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే రామ్ చరణ్ చాలావరకు బరువు తగ్గి కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఆయన జుట్టును సైతం పెంచుకున్నారు. దీంతో సినిమాలో రామ్ చరణ్ కృష్ణుడు లేదా అర్జునుడి పాత్రలో నటించే అవకాశం ఉన్నట్టు కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఈ సినిమా షూటింగ్ ఆలస్యానికి కారణం?

ఈ సినిమాలో హీరోయిన్ పై కూడా పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా తెలుగు అమ్మాయి సాత్విక వీరవల్లి నటిస్తారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమాలో సాత్విక హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు ఈ సినిమాకు హీరోయిన్ గా ఇదివరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సారా అర్జున్ ను పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. వీళ్ళతోపాటు భాగ్యశ్రీ బోర్సే, అనిత పద్దా లాంటి హీరోయిన్ ల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమా షూటింగ్ మాత్రం వచ్చే ఏడాదిలో ప్రారంభం అవుతుందని సమాచారం. ఇప్పటివరకు పూర్తిస్థాయి నటీనటులను ఇంకా ఎంపిక చేయలేదని తెలుస్తోంది. అందువల్లే షూటింగ్ మాత్రం కాస్త ఆలస్యంగా మొదలవుతుందని సమాచారం. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే పట్టాలెక్కనుందని క్లారిటీ వచ్చింది.