సినిమా ఇండస్ట్రీలో విజయాలు, అపజయాలు సహజం. అయితే ఒక స్టార్ హీరో వరుస పరాజయాలను ఎదుర్కొన్న తర్వాత తిరిగి విజయాల బాట పట్టడం అనేది అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య విషయంలోనూ ఇదే జరుగుతోంది. గత కొంతకాలంగా సరైన విజయాల కోసం ఎదురుచూస్తున్న ఈ హీరోకు 2026 మాత్రం ఎంతో ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుస విజయాలను అందుకునే దిశగా సాగుతున్నారు. ఒకప్పుడు సూర్య సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఉండేవి. మధ్యలో కొన్ని పరాజయాలు ఆయన మార్కెట్‌పై ప్రభావం చూపించినప్పటికీ, ఇప్పుడు మళ్లీ తన సత్తా చాటుతున్నారు.

కరుప్పుతో మారిన పరిస్థితులు..

ఈ ఏడాది సూర్య విజయాల ప్రయాణానికి ‘కరుప్పు’ సినిమా మంచి పునాది వేసింది. మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆయన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. యాక్షన్, ఫాంటసీ అంశాలతో రూపొందిన ఈ సినిమాలో సూర్య తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన పాత్ర చిత్రీకరణ, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లను సాధించడంతో సూర్యకు మరోసారి బలమైన మార్కెట్ ఉందనే విషయం స్పష్టమైంది. గతంలో ఎదురైన పరాజయాలను పక్కనపెట్టి ఆయన మళ్లీ విజయాల బాట పట్టడానికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది.

విశ్వనాథ్ అండ్ సన్స్‌తో మరో కోణం..

ఒకే తరహా సినిమాలతో కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో సూర్య ఎప్పుడూ ముందుంటారు. దీనికి నిదర్శనంగానే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నిలిచింది. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రంలో ఆయన పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, ప్రేమ వంటి అంశాల చుట్టూ సాగుతుంది. మమితా బైజు కథానాయికగా నటించగా, ఇతర కీలక పాత్రలు కూడా కథకు బలాన్ని అందించాయి. ముఖ్యంగా యాక్షన్ సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన సూర్య ఒక కుటుంబ కథలోనూ తన నటనతో మెప్పించగలరని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు మంచి స్పందన రావడం విశేషం.

‘సీన్‌’తో మరింత పెరిగిన అంచనాలు..

ఇక తాజాగా విడుదలైన ‘సీన్’ సినిమాతో సూర్య మరోసారి వార్తల్లో నిలిచారు. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి విడుదలైన తొలి రోజునే మంచి టాక్ లభించింది. దాంతో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా దక్కుతున్నాయి. ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం సూర్య కెరియర్లో మరో బ్లాక్ బాస్టర్ గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. విభిన్నమైన కథాంశం, ఆసక్తికరమైన కథనం, సూర్య నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు సినిమాలతో మంచి జోష్‌లో ఉన్న సూర్యకు ఈ చిత్రం కూడా విజయాన్ని అందిస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి. కేవలం ఆరు నెలల వ్యవధిలో వరుసగా మూడు సినిమాలతో విజయాలను అందుకోవడం సూర్య కెరీర్‌లో మరో ప్రత్యేకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు.

సూర్య కెరీర్‌కు కొత్త ఊపిరి..

సాధారణంగా ఒక స్టార్ హీరోకు వరుసగా విజయాలు రావడం ఎంత ముఖ్యమో, పరాజయాల తర్వాత తిరిగి పుంజుకోవడం కూడా అంతే ముఖ్యం. సూర్య ప్రస్తుతం అదే చేస్తున్నారు. ఈ మూడు సినిమాలను గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటున్నారు. కేవలం మాస్ ఇమేజ్‌పైనే ఆధారపడకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడం ఆయనకు కలిసొస్తోంది. మొత్తానికి గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న విజయాలు ఇప్పుడు వరుసగా పలకరిస్తుండటంతో సూర్య అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఈ విజయ పరంపర ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఆయన మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకప్పుడు సూర్యను ఎలా అయితే స్టార్ హీరోగా ఆదరించారో, ఇప్పుడు అదే స్థాయి క్రేజ్‌ను తిరిగి సంపాదించుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.