సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు నటీనటుల కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ముఖ్యంగా భారీ పౌరాణిక చిత్రాల్లో నటించే అవకాశం రావడం అనేది ప్రతి హీరోకు దక్కే అదృష్టం కాదు. ఇప్పుడు అలాంటి ఒక ఆసక్తికరమైన విషయం ప్రభాస్ విషయంలో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ’ సినిమాలో రావణుడి పాత్రను మొదట ప్రభాస్‌కు ఆఫర్ చేసినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఈ అవకాశాన్ని అంగీకరించకపోవడంతో చివరకు ఆ పాత్ర కన్నడ స్టార్ హీరో యష్‌ను వరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందనే విషయంపై అధికారిక స్పష్టత లేకపోయినప్పటికీ, ప్రస్తుతం ఈ చర్చ సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది.

రావణుడిగా యష్.. అదిరిపోయిన నటన!

ప్రభాస్‌కు దక్కలేదని ప్రచారం జరుగుతున్న ఈ పాత్రలో యష్ అద్భుతంగా ఒదిగిపోయారు. ఇప్పటికే ‘కేజీఎఫ్’ సినిమాలతో దేశవ్యాప్తంగా మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, రావణుడి పాత్రతో తన నటనలో మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. కేవలం ప్రతినాయకుడిగా మాత్రమే కాకుండా, అపారమైన శక్తి, రాజసం, అహంకారం, పౌరుషం కలిగిన లంకాధిపతిగా యష్ కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, గంభీరమైన నటన, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సినిమా విడుదలైన తర్వాత రావణుడి పాత్రలో యష్ నటనకు ప్రత్యేకంగా ప్రశంసలు లభిస్తుండటం విశేషం. ఈ పాత్రతో ఆయన తన మాస్ ఇమేజ్‌ను మరింత విస్తరించుకున్నారు.

ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామాయణ..

నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ‘రామాయణ’ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో రూపొందించారు. భారతీయ ఇతిహాసాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇందులో రన్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యష్ రావణుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటించారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీత బాధ్యతలు చేపట్టారు.

నవంబర్ 5న విడుదలైన మొదటి భాగానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా భారీ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, నేపథ్య సంగీతంతో పాటు ప్రధాన నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటన్నింటిలోనూ యష్ పోషించిన రావణుడి పాత్ర ప్రత్యేకంగా చర్చకు వస్తోంది.

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు!

మరోవైపు ప్రభాస్ కూడా ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ సినిమాలో శ్రీరాముడిగా కనిపించిన ఆయన, ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా ఇమాన్వీ కనిపించబోతుంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 19న విడుదల చేయనున్నట్లు మూవీ బృందం కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంతో పాటు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ మొట్ట మొదటి సారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’ రెండో భాగంలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండవ భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ‘ప్రశాంత్ నీల్’ దర్శకత్వంలో ‘సలార్ 2’ సినిమా కూడా ఆయన లైనప్‌లో ఉన్నాయి.

ప్రభాస్ చేసి ఉంటే ఎలా ఉండేదో?

నిజానికి ప్రభాస్‌కు ‘బాహుబలి’ సినిమాలతో పౌరాణిక, చారిత్రక పాత్రలకు సరిపోయే భారీ కటౌట్ ఉందని ప్రేక్షకులు భావిస్తుంటారు. అలాంటి హీరో రావణుడిగా కనిపించి ఉంటే వెండితెరపై మరో అద్భుతమైన అనుభూతి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ పాత్రలో యష్ తనదైన ముద్ర వేస్తున్నారు. మొత్తానికి ఒకవైపు ప్రభాస్ ఈ అవకాశాన్ని కోల్పోయారనే ప్రచారం, మరోవైపు రావణుడిగా యష్‌కు వస్తున్న ప్రశంసలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి రామాయణ రెండో భాగంతో యష్ తన ప్రభావాన్ని ఇంకెంత పెంచుకుంటారో చూడాలి.