ఇండస్ట్రీకి ప్రతి శుక్రవారం ఒక కొత్త హీరో పరిచయం అవుతూనే ఉంటారు. అలా పరిచయమైన హీరోలలో కొందరు సక్సెస్ అయితే మరికొందరు మాత్రం మొదటి సినిమాతోనే నిరాశ పరుస్తారు. ఫస్ట్ సినిమా మెప్పించింది అంటే ఆ హీరోలో మ్యాటర్ ఉన్నట్టే. ఆ తర్వాత కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ వారం కూడా అలా ఒక కొత్త హీరో టాలీవుడ్కు పరిచయం అయ్యాడు. అతడే అనీష్ రెడ్డి. నిర్మాత మహేష్ రెడ్డి కుమారుడిగా అనీష్ టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. దీంతో అనీష్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ప్రచారం చేశారు. దీంతో అనీష్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. స్టార్ హీరోలు వచ్చారంటే కచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉంటుందని అంతా భావించారు. అలా అనీష్ హీరోగా ..అనస్వర రాజన్  ( Anaswara Rajan ) హీరోయిన్ గా వచ్చిన సినిమానే ఇట్లు అర్జున ( Itlu Arjuna ). ఈ సినిమాకు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. హీరో నాగార్జున సమర్పణలో డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మించారు. మరి నిర్మాత కొడుకుగా భారీ ప్రచారంతో వచ్చిన అనీష్ ఫస్ట్ సినిమాతో మెప్పించాడా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ

ఇట్లు అర్జున అనేది ఒక మాటలు రాని తెలివైన యువకుడి కథ. అర్జున్ (అనీష్) చిన్ననాటి నుండి దొంగతనాలకు పాల్పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతడిపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అవుతాయి. చిన్ననాటి నుండే తన ఇంటిపై ఉండే కీర్తి అనస్వర అనే అమ్మాయిని అర్జున్ ఇష్టపడుతూ ఉంటాడు. ఆమెతో మాట్లాడాలని, ఒక్కసారి అయినా షేక్ హ్యాండ్ ఇవ్వాలని ..తన ప్రేమను వ్యక్తం చేయాలని అనుకుంటాడు. కానీ కీర్తి మాత్రం చాలా పద్ధతిగా పెరిగిన అమ్మాయి. ఆమెకు ఇల్లే ప్రపంచం. కీర్తి కుటుంబ సభ్యులు చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ ఆమెను బయటకు రాకుండా పెంచుతుంటారు. అలాంటి కీర్తి ఓ రోజు తల్లి ఇంట్లో లేకపోవడంతో మొదటిసారి న్యూ ఇయర్ సందర్భంగా పబ్ కు వెళుతుంది. అక్కడ తన బావ కంటి నుండి తప్పించుకుని ఇంటికి వచ్చే ప్రయత్నంలో అర్జున్ తో మొదటిసారి పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత అనుకోకుండా వెయ్యి కోట్ల హవాల డబ్బు వ్యవహారంలో అర్జున్ కీర్తి చిక్కుకుంటారు. దీంతో విలన్ లు వారి వెంటాడుతూ ఉంటారు. ఈ క్రమంలో కీర్తి అర్జున్ ఎలా తప్పించుకున్నారు? అసలు ఆ హవాల డబ్బు వెనక ఉన్న కథ ఏంటి? ఇద్దరి మధ్య ఎలా ప్రేమ చిగురించింది… చివరికి కలుసుకున్నారా లేదా? అనేదే ఈ సినిమా కథ.

నటీ నటుల పని తీరు

మొదటి సినిమా అంటేనే కథ కథనం కంటే ముందుగా హీరో పర్ఫామెన్స్ చూస్తారు. అందరి కళ్ళు హీరో పైనే ఉంటాయి. కాబట్టి చాలా సెక్యూర్ గా ఉండే కథలనే ఎంచుకుంటారు. కానీ అనీష్ మొదటి సినిమాతోనే మాటలు రాని యువకుడి పాత్రలో నటించి ఓ సాహసం చేశాడు.. అంతేకాకుండా సక్సెస్ అయ్యాడు కూడా. తన నటన డాన్స్ అన్ని రకాల హవా భావాలను పండించి ఫస్ట్ సినిమాతోనే మెప్పించాడు. కీర్తి పాత్రలో నటించిన అనస్వర సైతం తన నటనతో మెప్పించింది. సినిమాలో అనస్వర బావగా నటించిన వెన్నెల కిషోర్ నవ్వులు పండించాడు. మిగతా నటీనటులు సైతం తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విశ్లేషణ దర్శకత్వం స్క్రీన్ ప్లే

మాటలు రాని యువకుడుగా హీరోను చూపించడం సాహసం అనే చెప్పాలి. కాస్త తేడా వచ్చినా ఆ ప్రభావం సినిమా పై పడుతుంది. కానీ హీరోలోని ఆ బలహీనతను కథకు తెలివిగా ముడిపెడుతూ సన్నివేశాలను మలచిన తీరు ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. కొడుకు భవిష్యత్తు కోసం అడ్డువచ్చే వాళ్ళ ప్రాణాలు తీసే విలన్ కు చెందిన వెయ్యి కోట్ల హవాల డబ్బు, దానికి సంబంధించిన పెన్ డ్రైవ్, నెల రోజులు మాత్రమే పని చేసే పాస్వర్డ్ ఇలా ప్రారంభంలోనే దర్శకుడు కథపై ఇంట్రెస్ట్ వచ్చేలా సన్నివేశాలు తెరకెక్కించాడు.

ఇలాంటి ఇంట్రెస్టింగ్ సన్నివేశాల మధ్య హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ మొదలవుతుంది. ఆ రెండు ట్రాక్ లను దర్శకుడు నడిపించే విధానం బాగుంది. ప్రేమ కథకు తోడుగా మధ్యలో వెన్నెల కిషోర్ చేసే కామెడీ తో సినిమా మరింత వినోదాత్మకంగా సాగుతుంది. ప్రధాన పాత్రలను పరిచయం చేయడం హీరో బాల్యం.. బ్రేక్ ముందు వచ్చే కొన్ని సన్నివేశాలు, ఫస్ట్ పార్ట్ సినిమాకు బలంగా నిలిచాయి. ఇక సెకండ్ పార్ట్ కూడా పెన్ డ్రైవ్, పాస్వర్డ్, టైం లైన్ చుట్టూనే తిరుగుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్ట్ లు సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్తాయి. సెకండ్ హాఫ్ లో లవ్ స్టోరీ కూడా బాగుంటుంది. హీరో హీరోయిన్ కు తన ప్రేమను వ్యక్తపరిచే సీన్లు ఈ సినిమాకి హైప్ తెచ్చాయి. కథను దర్శకుడు ట్రెండీగా నడిపించే విధానం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది.

సంగీతం

ఈ సినిమాకు తమన్ ( S S Thaman ) స్వరాలు సమకూర్చారు. ఆయన ఇచ్చిన మ్యూజిక్, బీజీఎం చిత్రానికే హైలెట్ గా నిలిచాయి.

సినిమాటోగ్రఫీ & నిర్మాణం

ఈ సినిమాకు రాజా మహదేవన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. సినిమాకు ఆయన చూపించిన బ్యూటిఫుల్ విజువల్స్ ప్లస్ గా నిలిచాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్

మొదటి సినిమా అయినా ఈ సినిమాలో హీరో నటన ప్లస్ గా నిలిచింది. విరామం ముందు వచ్చే సన్నివేశాలు, ప్రేమ కథ.. వెన్నెల కిషోర్ కామెడీ బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గినట్టు అనిపించడం ఈ సినిమా మైనస్ అని చెప్పవచ్చు.

ముగింపు: కొత్త కుర్రాడు అదరగొట్టాడు